29-04-2025 01:13:13 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపులకు పాల్పడుతూనే ఉంది. వరుసగా నాలుగో రోజు కూడా పూంచ్ సెక్టార్‌లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ రేంజర్ల కవ్వింపు చర్యలకు భారత ఆర్మీ దీటైన సమాధానం ఇచ్చిం ది. ‘ఏప్రిల్ 27-28 అర్ధరాత్రి కూడా పాక్ సైన్యం కుప్వారా, పూంచ్ జిల్లాల్లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరిపింది.
అర్ధ రాత్రి సమయంలో భారత పోస్టులపై చిన్న ఆయుధాలు, ఆటోమేటిక్ రైఫిల్స్‌తో కాల్పులకు తెగబడ్డారు. అయితే ఈ దాడులను భ ద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టా యి’ అని భారత సైన్యం తెలిపింది.
సైనిక చర్యలకు సమయం ఆసన్నం..
భారత్ సైనిక చర్యలు తీసుకునే సమ యం ఆసన్నమైందని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ ఆసిఫ్ అన్నారు. ‘భారత్ సైనిక దాడి చేస్తే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మేము కూడా మా భద్ర తా దళాలను సన్నద్ధం చేశాం. ఆ సమయం లో కొన్ని ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఆ నిర్ణయాలను ఇప్పటికే తీసుకున్నాం. పాక్ హైఅలర్ట్‌గా ఉంది. మాకు విపరీతంగా ముప్పు వాటిల్లుతుందని అనిపిస్తేనే అణ్వాయుధాలు వాడుతాం.’ అని మంత్రి పేర్కొన్నారు.
సైన్యం సంసిద్ధతపై ప్రధానికి వివరించిన రాజ్‌నాథ్ సింగ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని నివాసంలో సోమవారం భేటీ అయ్యారు. ఈ సం దర్భంగా సైన్యం సంసిద్ధతపై మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధానికి వివరించారు. రాజ్‌నా థ్ సింగ్ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహన్‌తో భేటీ అయిన తర్వాతి రోజే ప్రధానిని కలవడం ప్రాముఖ్యతను సంతరిం చుకుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశం దాదాపు 40 నిమిషాల పాటు సాగింది. పార్లమెంట్ ప్రాంగణంలో రక్షణ వ్యవహారాలపై స్టాం డింగ్ కమిటీ సమావేశం అయింది. పహ ల్గాం ఉగ్రదాడిపై చ ర్చించారు. ఈ సమావేశానికి పలువురు ఎంపీలు హాజరయ్యారు. ఇప్పటికే ఈ ఘటనపై కేంద్రం అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించింది.
ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ ఖాళీ!
పాకిస్తాన్ తమ ఆధీనంలో ఉన్న పలు ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను ఖాళీ చేయిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. భారత్‌కు చెంది న భద్రతా సంస్థలు ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్‌లను గుర్తించడంతోనే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. లాంచ్ ప్యాడ్‌లను ఖాళీ చేయించడంతో పాటు టెర్రరిస్టులను బంకర్లలోకి తరలిస్తున్నట్టు సమాచారం.
పీవోకేలో ఉన్న కీలక ఉగ్రస్థావరాలైన కెల్, సర్ది, దుధ్నియల్, ఆత్ముఖం, జురా, లిపా, పచ్చిబన్, ఫార్వర్డ్ కహుతా, కొట్లి, ఖుహిరట్ట, మంధర్, నికేల్, చామన్‌కోట్, జన్‌కోటె ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదులను వేరే చోటికి తరలిస్తున్నట్టు నిఘా వర్గాల సమాచారం. కొద్ది రోజులు ఈ లాంచ్‌ప్యాడ్స్‌లో తలదాచుకుని టెర్రరిస్టులు నియంత్రణరేఖ దాటి భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు.
పీవోకేలో ఉన్న 42 టెర్రర్ లాంచ్ ప్యాడ్స్‌ను నేలమట్టం చేసేందుకు భద్రతా దళాలు నిఘా పెట్టాయ ని వార్తలు వస్తున్నాయి. ఈ లాంచ్ ప్యాడ్స్ లో 150 నుంచి 200 వరకు శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉంటున్నారు.
పాక్ యూట్యూబర్లకు షాక్..
పాక్‌కు చెందిన పలు సంస్థలు, ప లువురు వ్యక్తులకు చెందిన 16 యూ ట్యూబ్ చానల్స్‌పై భారత్ నిషేధం విధించింది. కేంద్రం నిషేధం విధించిన చానల్స్‌కు 63 మిలియన్ల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. పాక్‌కు చెందిన డాన్ న్యూస్, సామ టీవీ, అరీ న్యూస్, బోల్ న్యూస్, రాఫ్తార్, జియో న్యూస్, సునో న్యూస్‌తో పాటు పలువురు జర్నలిస్టులకు చెందిన చానల్స్, పలు క్రీడా చానల్స్, పలువురు క్రీడాకారుల చాన్ల్స్‌ను కూడా కేంద్రం బ్యాన్ చేసిం ది.
ఈ చానల్స్ వీక్షించాలని చూస్తే ‘ప్రస్తుతం ఈ కంటెంట్ ఈ దేశంలో అం దుబాటులో లేదు. జాతీయ భద్రత దృష్ఠ్యా కేంద్ర ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం’ అనే సందేశం కనిపిస్తోంది. పీఎస్‌ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్) బ్రాడ్‌కాస్టింగ్‌లో పని చేస్తున్న 23 మంది భారతీయులను ఈ నెల 27వ తేదీనే పాకిస్తాన్ ప్రభు త్వం వెనక్కి పంపింది.
నిషేధం విధించిన చానల్స్ జాబితాలో పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చానల్ లేకు న్నా కానీ అతడి చానల్ మాత్రం వీక్షించేందుకు అందుబాటులో లేదు. జాతీ య భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు హోం మంత్రి త్వ శాఖ వెల్లడించింది. ఈ చానల్స్ సున్నితమైనకం టెంట్‌ను వ్యాప్తి చేయడంతో పాటు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నట్టు తెలిపింది.
500పైచిలుకు ప్రాంతాల్లో వేట..
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భద్రతాబలగాలు జమ్మూలోని 500కు పైగా ప్రాంతా ల్లో గాలించాయి. ఎటువంటి టెర్రరిస్టు కదలికలు నమోదయినా భద్రతాబలగాలు వద లడం లేదు. దాడులు చేయడంతో పాటు అనుమానం వచ్చిన ఉగ్రవాదుల ఇండ్లను నేలమట్టం చేస్తున్నాయి.