- అర్ధరాత్రి నిరసనకారులను చెదరగొట్టిన అధికారులు
- ఘర్షణల్లో ఆరుగురు అధికారులు మృతి
ఇస్లామాబాద్, నవంబర్ 27: ఇమ్రాన్‌ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయా లని డిమాండ్ చేస్తూ డీష్ట్రిచౌక్‌లో నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై పాక్ ప్రభుత్వం మంగళవారం ఉక్కుపాదం మోపింది. అర్ధరాత్రి ఆందోళనకారులపై భద్రతా బలగాలు ఆసస్మికంగా దాడులు జరిపాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులకు, అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో ఆరుగురు అధికారులు ప్రాణాలు కోల్పోయారు.
మరికొందరు తీవ్రంగా గాయ పడ్డారు. ఆందోళనల్లో పాల్గొన్న సుమారు 450 మంది అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిరసనకారులపై అధికారులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించినట్టు పాక్ మీడియా తన కథనాల్లో వెల్లడించింది.
నిరసనల వెనక విదేశీ హస్తం
ఈ నిరసన వెనక విదేశీ హస్తం ఉంద ని పాక్ ప్రభుత్వం ఆరోపించింది. విదేశీ శక్తులు పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) సహాయంతో కొంత మంది పాక్ యువతను నియమించుకుని నిరసనలను ప్రోత్సహించాయని పాక్ మంత్రి తారార్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు భద్రతా దళాల అదుపులో ఉన్న 16ఏళ్ల బాలుడి వద్ద లభించినట్టు పేర్కొన్నారు. పార్లమెంట్, ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేసేందుకు పన్నిన కుట్రకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.