29-04-2025 10:49:14 AM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): భారత్ పై కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్ మరోసారి నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. ఈనెల 22వ తేదీన జమ్మూకశ్మీర్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాదుల దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. సోమవారం అర్థరాత్రి సమయంల పాకిస్థాన్ సైన్యం కుప్పారా, బారాముల్లా జిల్లాలకు ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో, అఖ్నార్ సెక్టార్ లో నియంత్రణరేఖ వెంబడి చిన్న ఆయుధాలతో పాక్ రేంజర్లు జరిపిన కాల్పులను భారత సైన్యం తుటాలు పేల్చి సమర్థంగా తిప్పికొట్టింది.
ఇదిలా ఉండగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పలు కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టుగా వెల్లడించింది. అటారీ - వాఘా సరిహద్దును మూసివేయనున్నట్టుగా ప్రకటించింది. భారత్‌లోని పాకిస్థానీలు వెళ్లిపోవాలని ఆదేశించింది. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, ఉగ్రవాదులకు మద్దతుగా నిలుస్తున్నవారి కోసం భద్రతా బలగాలు పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. నివేదిక ప్రకారం, కనీసం ఆరుగురు ఉగ్రవాదుల నివాసాలు అధికారులు ధ్వంసం చేశారు. పహల్గామ్ దాడికి సంబంధించిన విచారణకు సంబంధించి వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు.