26-04-2025 01:17:20 AM
పహల్గాం దాడి వెనుక పాక్ సైన్యం హస్తం ఉన్నట్టు ఆరోపణలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఉరీ, పుల్వామా దాడుల అనంతరం పాక్‌కు భారత్ తనదైన స్టుల్‌లో సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పహల్గాం ఘటనకు భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందోనన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, భారత్‌తో కయ్యానికి ఎందుకు కాలుదువ్వుతున్నారోనన్న ప్రశ్న ఉత్పన్నమవుతుతోంది.
కాగా పాక్‌లో అంతర్గతంగా నెలకొన్న సంక్షోభం, ప్రజల్లో సైన్యం పట్ల ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో మునీర్ ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్టు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బలూచిస్థాన్, ఖైబర్ ఫంఖ్తుంఖ్వా ప్రావిన్సులలో సాయుధ తిరుగుబాట్లు ప్రభుత్వానికి సవాలుగా మారాయి. దీనికి తోడు మునీర్‌పై పాక్ ప్రజల్లో ఆదరణగా గణనీయంగా తగ్గిపోయింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ఏకం చేయడానికి, సైన్యంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడానికి భారత్‌తో ఒక పరిమిత స్థాయి యుద్ధం ఉపయోగపడుతుందని మునీర్ భావిస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఉద్రిక్తతలను పెంచి, తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నారంటూ జమ్మూకశ్మీర్ మాజీ డీజీపీ ఎస్పీ వైద్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
దాడికి కొన్ని రోజుల ముందు ఏప్రిల్ 16న జనరల్ మునీర్ చేసిన హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.ఈ నేపథ్యంలో పహల్గాం దాడి వెనుక పాక్ సైన్యం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.