10-02-2025 06:24:56 PM
ఐటీడీఏ పీవో రాహుల్...
భద్రాచలం (విజయక్రాంతి): ఆదివాసి గిరిజన తెగల సంస్కృతితో పాటు వారి జీవన విధానం నకు సంబంధించిన కళాకృతుల చిత్రాలను అందంగా గోడలపై చిత్రీకరించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. సోమవారం నాడు ఐటిడిఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియంను ఆయన సందర్శించి మ్యూజియం లోపల ముఖద్వారం వద్ద గిరిజన కల్చర్ కు సంబంధించిన పెయింటింగ్ చిత్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పెయింటింగ్ చిత్రాలను చిత్రీకరించే క్రాఫ్ట్ టీచర్లకు సూచనలు సలహాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మ్యూజియం సందర్శనకు వచ్చే పర్యాటకులకు మ్యూజియం లోపలికి ప్రవేశించక ముందే గిరిజన కల్చర్కు సంబంధించిన కళాఖండాలు ఆకర్షించే విధంగా ఉండాలని ఆ విధంగా పెయింటింగ్ రూపంలో వారి జీవన విధానాలు, గిరిజన మహిళల దుస్తుల అలంకరణ, కట్టు, బొట్టు, గిరిజన రైతుల పంటల సాగు, వారి కులవృత్తి, పూజా విధానం, అన్ని తెగల గిరిజనుల పండుగలు వారి ఇల వేల్పుల దేవత మూర్తుల చిత్రాలు ఆకట్టుకునేలా చిత్రీకరించాలని అన్నారు.
చిన్నపిల్లలు ఆడుకునే బాక్స్ క్రికెట్ గ్రౌండ్ విశాలంగా 20 రోజులలో పూర్తిస్థాయిలో నిర్మాణం కావాలని పనులు త్వరితగతిన ప్రారంభించాలని స్పోర్ట్స్ అధికారి గోపాల రావుకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, మ్యూజియం ఇంచార్జ్ వీరాస్వామి, క్రాఫ్ట్ టీచర్లు బేబీ సునంద, సరస్వతి, రాంబాబు, మూర్తి, చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.