- పశువులకు పెయిన్‌కిల్లర్స్ వాడిన రైతులు
- వాటి కళేబరాలు తిన్న రాబందుల మృత్యువాత
- రాబందులు లేక 5 లక్షల మంది మృతి
- తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తల వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు 2: మనం ఒక్కోసారి అతి సాధారణం అని పట్టించుకోకుండా వదిలేసిన విషయాలే భవిష్యత్తులో ప్రాణాంతకంగా మారుతుంటాయి. మన దేశంలో రాబందులు అంతరించే దశకు చేరుకోవటానికి సరిగ్గా ఇలాంటి అలసత్వమే కారణ మైందని శాస్త్రవేత్తలు తేల్చారు. 1990 దశకానికి ముందు మనదేశంలో రాబందులు ఎక్కడైనా కనిపించేవి. వాటి సంఖ్య లక్షల్లో ఉండేది. ఆ తర్వాత 30 ఏండ్లలో వాటిని సంరక్షణ కేంద్రాల్లో పెట్టి కాపాడాల్సిన దుస్థితికి పరిస్థితి దిగజారింది. ఇప్పుడైతే దేశంలో ఒక్క రాబందైనా ఎక్కడైనా కనిపిస్తుందేమోనన్న ఆశతో శాస్త్రవేత్తలు వెదుకుతున్నారు.
ఈ పరిస్థితి అంతటికి కారణం చిన్న సూదిమందు అని శాస్తవేత్తలు తేల్చారు. అంతే కాదు ప్రకృతిని శుభ్రం చేసే రాబందులు అంతరించిపోవటంతో వివిధ వ్యాధులు ప్రబలి దేశంలో దాదాపు 5 లక్షల మంది మరణించారని, వేలకోట్ల నష్టం కూడా వాటిల్లిందని చెప్తున్నారు. మనదేశంలో రాబం దుల అంతర్ధానంపై అమెరికన్ ఎకనమిక్ అసోసియేషన్ ‘ది సోషల్ కాస్ట్ ఆఫ్ కీస్టోన్ స్పెసీస్ కొలాప్స్: ఎవిడెన్స్ ఫ్రమ్ ది డిక్లున్ ఆఫ్ వల్చర్స్ ఇన్ ఇండియా’ పేరుతో ఓ పరిశోధనను ప్రచురించింది.
సూదిమందు తెచ్చిన సంక్షోభం
భారత్ వ్యవసాయాధారిత దేశం కావటంతో కోట్ల మంది రైతులకు సాగుతోపాటు పశుసంపద అత్యంత విలువైనది. పూర్వకాలంలో పశువులకు జబ్బుచేస్తే గ్రామాల్లో ఉండే నాటువైద్యులే వైద్యం చేసేవారు. దానివల్ల ఎవరికీ ఏ సమస్యా వచ్చేదికాదు. కానీ, 1990 దశకంలో పశువైద్యంలో ఇంగ్లిష్ మందులు వచ్చి చేరాయి. ప్రభుత్వాలు ప్రత్యేకంగా పశువైద్యులను నియమించి, గ్రామా ల్లో తిరిగి వైద్య సేవలందించాయి. దీంతో ఇంగ్లిష్ మందుల వాడకం పెరిగింది. ఇందు లో పశువులకు ప్రధానంగా వాడింది ‘డిక్లోమెనాక్’ అనే ఔషధం. ఇది పశువుల్లో యాం టీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఒళ్లు నొప్పులు తగ్గటానికి ఇస్తుంటారు.
ఈ మందే ఆ తర్వాత దేశంలో రాబందుల జాతిని తుడిచిపెట్టేసిందని తాజాగా పరిశోధకులు ప్రకటించారు. 1990 నాటికి దేశంలో 5 కోట్ల వరకు ఉన్న రాబందులు.. రెండు దశాబ్దాల్లో 20 వేలకు పడిపోయాయని అమెరికన్ ఎకనమిక్ అసోసియేషన్ ప్రచురించిన నివేదికలో వెల్లడించింది. డిక్లోమె నాక్ మంది ఒక్క చుక్క అయినా రాబందులకు ప్రాణాంతకమని పేర్కొన్నది. నిజానికి రాబందులకు ఆ మందును నేరుగా ఇవ్వలేదు. ఈ మందు వాడిన పశువు చనిపోతే ఆ కళేబరాన్ని తిన్న రాబందు శరీరంలోకి ఈ మందు ప్రవేశిస్తుంది. అదే రాబందు ప్రాణాలు తీసింది.
5 లక్షల మంది మృతి
ప్రకృతిని, పరిసరాలను శుభ్రంగా ఉంచే జీవుల్లో రాబందులే కీలకం. జంతు కళేబరాలను ఆరగిస్తూ దుర్గంధాన్ని, పరిసరాల కాలుష్యాన్ని నివారిస్తుంటాయి. ఒక రాబందుల గుంపు ఒక ఆవు కళేబరాన్ని కేవలం 45 నిమిషాల్లో పూర్తిగా తినేయగలదు. అలాంటి రాబందులు అంతరించిపోవటంతో జంతు కళేబరాలు ఎక్కడపడితే అక్కడే ఉండిపోయి, సూక్ష్మ క్రిములు చేరి వ్యాధులు ప్రబలాయి. జంతువుల కళేబరాలను నీటి వనరుల్లో పడేయటం వల్ల ఆ నీటి ద్వారా మనుషులకు సూక్ష్మక్రిములు చేరి కూడా వ్యాదులు పెరిగిపోయాయని ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్‌లో ఎకన మిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆనంద్ సుదర్శన్ తెలిపారు. ఈ కారణంతో మనదేశంలో దాదాపు 5 లక్షల మంది చనిపోయారని నివేదిక తెలిపింది. ప్రాణ నష్టంతోపాటు ఆర్థిక వ్యవస్థకు వేలకోట్ల ఆస్థి నష్టం కూడా వాటిల్లినట్టు నివేదిక వెల్లడించింది.