calender_icon.png 25 September, 2024 | 3:48 PM

పేజర్.. వాకీటాకీ.. తర్వాత?

20-09-2024 02:16:15 AM

  1. లెబనాన్, సిరియాలో వణుకుతున్న ప్రజలు
  2. ఎప్పుడు ఏది పేలుతుందోనని ఆందోళన
  3. టీవీలు చూసేందుకూ జంకు 
  4. ఎలక్ట్రానిక్ వస్తువులంటేనే భీతిల్లుతున్న ప్రజలు

టెల్ అవీవ్, సెప్టెంబర్ 19: అత్యంత పకడ్బందీగా, చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన దాడితో లెబనాన్, సిరియా ప్రజలు ఎలక్ట్రానిక్స్‌ను చూస్తేనే దయ్యాన్ని చూసినట్టు వణికిపోతున్నారు. మంగళవారం ఒక్కసారిగా పేజర్లు పేలిపోవటం, ఆ మరుసటి రోజే వాకీటాకీలు ధ్వంసమవడంతో తర్వాత ఏం పేలు తాయోనని భీతిల్లుతున్నారు. అంతుపట్టని తీరులో వరుసగా ౨ రోజులపాటు జరిగిన దాడిలో సిరియా, లెబనాన్‌లో 32 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడుల వెనుక ఉన్నది ఇజ్రాయిలేనని లెబనాన్ కేం ద్రంగా పనిచేస్తున్న హెజ్బొల్లా ఉగ్రసంస్థ ఆరోపించింది. ఇజ్రాయెల్ మాత్రం ఇప్పటివరకు నోరు మెదుపలేదు. అయినా, దాడులు జరిగిన తీరు, ఎంచుకొన్న లక్ష్యాలను బట్టి ఇది ఇజ్రాయిల్ పనేనని అంతర్జాతీయ సమాజం నిర్ధారణకు వచ్చింది. 

తర్వాత దాడి వేటితో?

నిత్యం వాడే పరికరాలే మృత్యు పాశంగా మారటంతో లెబనాన్‌లోని హెజ్బొల్లా ఉగ్రవాదులతోపాటు సామాన్య ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం పేజర్లు పేలిపోవటం, ఆ దాడి నుంచి కోలుకోకముందే బుధవారం వాకీటాకీలు పేలటంతో తర్వాత ఏం పేలుతాయోనని భయపడుతున్నారు. ఇండ్లల్లో టీవీలు పెట్టడానికీ ప్రజలు భయపడుతున్నారని మీడియా కథనాలు వెలువరిస్తున్నది. ఇక హెజ్బొల్లా.. ఇజ్రాయెల్ వ్యూహాలను పసిగట్టలేక సతమతమవుతున్నది. ప్రపంచంలోనే అత్యధిక ఆయు ధ సంపత్తి కలిగిన ఉగ్రసంస్థ హెజ్బొల్లా. దీనివ ద్ద లక్షకుపైగా స్వల్పశ్రేణి రాకెట్లు ఉన్నాయి. క్షిపణులు పోగేసుకొన్నట్టు నివేదికలు చెప్తున్నాయి. ఈ ఆయుధ సంపత్తిని ఇజ్రాయెల్ హ్యాక్ చేస్తే హెజ్బొల్లా నాశనం ఖాయం. పేజ ర్లు, వాకీటాకీల పేలుడు స్వలం. కానీ, ఆయుధాలు పేలితే తీవ్ర విధ్వం సం తప్పదు. 

ఊహకందని దాడి

తన ఉత్తర సరిహద్దులో వేగంగా బలపడుతున్న ప్రబల శత్రువు హెజ్బొల్లాను ఊహిం చని విధంగా దెబ్బతీయాలని ఇజ్రాయెల్ కొన్నేండ్ల నుంచి పకడ్బందీగా ప్రణాళిక వేసినట్టు అంతర్జాతీయ యుద్ధ నిపుణులు చెప్తున్నారు. కనీసం వాసన కూడా బయటకు రాకుండా ఇంత భారీ ప్రణాళిక ఎలా వేసిందనే విషయంపై నిపుణులు పలు కుట్ర కోణాలను వివరిస్తున్నారు.

పరికరాల్లో పేలుడు పదార్థాలు అమర్చటం

హెజ్బొలా గత ఏడాది 5000 పేజర్లను తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో లోగో ఉన్న పేజర్లను కొనుగోలు చేసింది. వాటిని తయారుచేసేటప్పుడే ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ వాటిలో పేలుడు పదార్థాలు ఉంచినట్టు భావిస్తున్నారు. కేవలం మూడు గ్రాముల బరువున్న ఈ పేలుడు పరికరాలను పేజర్లలో అమర్చటంలో హెజ్బొల్లాతోపాటు వాటిని తయారుచేసిన కంపెనీ కూడా గుర్తించలేకపోయింది. ఆ పేజర్లకు మంగళవారం ఓ ప్రత్యేక కోడ్‌తో సందేశం పంపి పేల్చివేసినట్టు గుర్తించారు. జపాన్ కంపెనీ తయారుచేసిన వాకీటాకీలను కూడా ఉత్పత్తి సమయంలోనే మొసాద్ ట్యాంపర్ చేసినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సప్లు చైన్ ట్యాంపర్

సప్లు చైన్‌ను ట్యాంపర్ చేయటం ద్వారా కూడా ఇలాంటి పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉన్నదని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పరికరాలు హెజ్బొల్లాకు చేరటానికి ముందే వాటిని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు ట్యాంపర్ చేసి ఉండొచ్చని చెప్తున్నారు. పేలిపోయిన పేజర్లు గోల్డ్ అపోలో కంపెనీకి చెందిన ఏఆర్ 924 మోడల్‌వి. వీటిని హంగెరీలోని బీఏసీ సంస్థ తయారుచేసి గోల్డ్ అపోలో లోగోలను అధికారికంగా వాడుకొన్నది. అవి కంపెనీలో తయారవుతున్నప్పుడే కుట్రతో వాటిలో పేలుడు పరికరాలు అమర్చి ఉండొచ్చని భావిస్తున్నారు. 

ఎలక్ట్రానిక్ సిగ్నల్‌తో పేల్చివేత

పేజర్లు, వాకీటాకీల్లో పేలుడు పదార్ధాలు ఉంచకపోయినా సుదూరం నుంచి రేడియో సిగ్నల్‌ను పంపి కూడా వాటిని పేల్చివేసి ఉండొచ్చని సైబర్‌స్పేస్ సొలేరియమ్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రిటైర్డ్ అడ్మిరల్ మార్క్ మాంట్‌గోమరీ అన్నారు. ఆ పరికరాలను తయాచేసేటప్పుడే ఏదైనా ఉద్దేశపూర్వక లోపాన్ని సృష్టించి కొంతకాలం తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ లేదా ఎలక్ట్రానిక్ సిగ్నల్ పంపటం ద్వారా పేల్చివేసి ఉండవచ్చని వివరించారు.