calender_icon.png 21 October, 2024 | 3:03 AM

ఘనంగా పద్మశాలి దసరా మేళా

20-10-2024 08:49:01 PM

ఎల్బీనగర్,(విజయక్రాంతి): పద్మశాలి సంఘం ఎల్బీనగర్ సర్కిల్ ఆధ్వర్యంలో ఆటోనగర్ లోని హరిణ వనస్థలి అనన్య ఏకో టూరిజం పార్కులో నిర్వహించిన ''పద్మశాలి దసరా మేళా'' కార్యక్రమాని నిర్వహించింది. ఈ కార్యక్రామానికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కీ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుయాష్కీని సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ.. గీతా , నేత తదితర  బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ ఏకమైనప్పుడే రాజ్యాధికారం సాధ్యమన్నారు.

రాజ్యాధికారం సాధన ద్వారానే బడుగు వర్గాల అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, నిజాం సర్కార్ కు ఎదురొడ్డిన కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించారన్నారు.  తెలంగాణ వాణిని, ప్రజల ఆకాంక్షలను మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ లాంటి ఢిల్లీ పెద్దలకు వివరించి ఒప్పించిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తనకు కూడా ఎంతో ఆత్మీయుడని, ఆయన తన రాజకీయ జీవితానికి ఆదర్శమని మధుయాష్కీ చెప్పారు. అంత గొప్ప వ్యక్తి.. ఎదుటివారి పట్ల చాలా మర్యాదగా, గౌరవంగా మాట్లాడే వారన్నారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు కనీసం గూడు కూడా లేదు అని.. తన ఇంటినే పార్టీ కార్యాలయంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ ఉద్యమానికి ఆయన ఇంటిని ఇచ్చాడన్న అక్కసుతో.. అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయన ఇంటిని కూల్చివేసిందని గుర్తు చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ మరణిస్తే.. కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో ఆయన అంతిమయాత్ర నిర్వహించుకునేందుకు కూడా సరైన సహకారం అందించలేదన్నారు. కేవలం బలహీనవర్గాలకు చెందినవాడన్న కారణంతోటే.. ఆయన సమాధికి స్థలం కేటాయింపు, ఘాట్ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజల కోసం నిలబడ్డ బలహీన వర్గాల ప్రజలకు ఇప్పటికీ సరైన న్యాయం దక్కటం లేదన్నారు. కేవలం అగ్రవర్ణాల వారికే వారు చనిపోతే ఎకరాల కొద్ది స్థలం  ఇచ్చి గుర్తింపు ఇస్తున్నారని, బలహీన వర్గాల నేతలకు మాత్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయంగా ఎదిగేందుకు బలహీనవర్గాలలో ఐక్యమత్యం ముఖ్యమని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యే, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, పద్మశాలి సంఘం ఎల్బీనగర్ సర్కిల్ అధ్యక్షుడు ఉన్న గణేష్ నేత, దసరా మహిళా చైర్మన్ కౌకుట్ల రవితేజ, సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం లక్ష్మీనారాయణ, ప్రతినిధులు నారని రవీందర్, జిల్లా జగన్నాథం, దోర్నాల చంద్రమౌళి , చిట్టిప్రోలు శ్రీనివాస్, సంఘం రమేష్ చేరుపల్లి ప్రభాకర్, కొండ బత్తుల శ్రీనివాస్ , కర్నాటి శ్రీనివాస్, కస్తూరి శ్రీనివాస్  తదితరులు ఉన్నారు.