తొలి మహిళా పీసీవోఎంగా అరుదైన రికార్డు
హైదరాబాద్, జనవరి 15 (విజయక్రాంతి): దక్షిణ మధ్య రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ (పీసీవోఎం)గా ఐఆర్‌టీఎస్ అధికారిణి కే పద్మజ బుధవారం బాధ్య తలు స్వీకరించారు. దక్షిణ మధ్య రైల్వేలో మొట్టమొదటి మహిళా పీసీవోఎంగా ఆమె గుర్తింపు పొందారు. పద్మజ ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీస్ 1991 బ్యాచ్‌కు చెందినవారు. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌గా విధులను నిర్వర్తిస్తూనే పీసీవోఎంగా అదనపు బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు.
దాదాపుగా రైల్వే శాఖలో 30 ఏళ్లకుపైగా విధులు నిర్వర్తిస్తున్న పద్మజ.. ద.మ.రైల్వేలో హైదరాబాద్ డివిజన్‌లో అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్, సికింద్రాబాద్ డివిజనల్ సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్, గుంతకల్లు డివిజన్ డిప్యూటీ చీఫ్ కమర్షియల్ మేనేజర్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్, సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్, రైల్ నిలయం ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్, కోచింగ్ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్, జనరల్ చీఫ్ ప్యాసింజర్ ట్రాఫిక్ మేనేజర్, చీఫ్ ఫ్రైట్ ట్రాఫిక్ మేనేజర్, చీఫ్ కమర్షియల్ మేనేజర్, ప్యాసింజర్ సర్వీసెస్ వంటి అనేక ఇతర కీలక పదవులు నిర్వహించారు. రవాణా శాఖ సలహాదారుగా, గోదావరి ఫెర్టిలైజర్స్ కంపెనీ లిమిటెడ్ జనరల్ మేనేజర్‌గా కూడా పనిచేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవ లు అందించడంతో పాటు సరకు రవాణా లో కూడా ద.మ.రైల్వే ముందుండేలా తన సేవలను అందిస్తామని ఆమె తెలిపారు.