హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 8 (విజయక్రాంతి): ప్రముఖ చిత్రకారుడు, పద్మశ్రీ జగదీశ్ మిట్టల్ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో బుధవారం జరిగాయి. చారిత్రాత్మక, సంప్రదాయ కళారూపాల పరిరక్షకుడిగా పేరుగాంచిన జగదీశ్ మిట్టల్ (101) మంగళవారం దోమలగూడలోని స్వగృహంలో కన్నుమూశారు. మిట్టల్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ, ప్రముఖ సినీ దర్శకులు బీ నర్సింగ్ రావు, ప్రముఖ శిల్పి ఎంవీ రమణారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు.
1925లో జన్మించిన ఈయన చిత్రకళపై మక్కువతో రవీంద్రనాథ్ ఠాగూర్ ఏర్పాటు చేసిన శాంతినికేతన్ కళాభవన్‌లో 1945లో పీజీ చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చిత్రకళ చరిత్రను బోధించారు. కమల అనే చిత్రకారిణితో ప్రేమ వివాహం జరిగింది. ఈయనకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు.
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భద్రి విశాల్‌పిట్టి ఆహ్వానం మేరకు 1950లో జగదీశ్ మిట్టల్ దంపతులు హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. 1976లోనే ఈ దంపతులు జగదీశ్, కమలా మిట్టల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ ఆర్ట్‌ను స్థాపించి, తాము నివసించే నివాసంలోనే మ్యూజియం ఏర్పాటు చేశారు. చిత్రకళకు మిట్టల్ చేసిన సేవలకు గానూ ఆయనకు1990లో పద్మశీ అవార్డు లభించింది.
కళ ఎప్పటికీ మరణించదు: బీ నర్సింగరావు, సినీ దర్శకుడు
కళ ఎప్పటికీ మరణించదు. జగదీశ్ మిట్టల్ కళాభిమానుల హృదయంలో, హైదరాబాద్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి జగదీశ్, కమలామిట్టల్ మ్యూజి ఆఫ్ ఇండియన్ ఆర్ట్‌లో అద్భుతమైన కళాఖండాలను సేకరించారు. ఈ కళాఖండా సేకరణ అద్భుతమైన భారతీయ చరిత్ర, సంస్కృతి పట్ల వారికున్న అభిరుచి, అంకితభావం తెలియజేస్తుంది. హైదరాబాద్ నగరానికి జగదీశ్ మిట్టల్ అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టారు.