calender_icon.png 24 March, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

22వ ప్యాకేజీ కాళేశ్వరం నిర్మాణ పనులకు నిధులు ఇవ్వాలని అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే

22-03-2025 11:12:33 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టగా కామారెడ్డి జిల్లాలో ప్రాజెక్టులకు నిధులు అంతంతే అనే శీర్షికతో శనివారం విజయ క్రాంతి పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవ వర్గాలకు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పేరుతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పనులను ప్రారంభించారు. కామారెడ్డి నిజాంబాద్ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. సుమారు రూ.160 కోట్ల పనులు జరిగాయి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో 22వ ప్యాకేజీ కింద కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గం లోని రైతులకు రెండు లక్షల ఎకరాల కు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో కాలువలు తవ్వకాలు రూ.160 కోట్లతో పనులు చేపట్టారు. అప్పట్లో మరో రూ.60 కోట్లు ఖర్చు పెడితే రెండు లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది.

కాంగ్రెస్ ప్రభుత్వం పోయి టిఆర్ఎస్ ప్రభుత్వం రావడంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చి కాళేశ్వరం పేరు పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో నిర్మించిన 22వ ప్యాకేజీ పనులకు నిధులు కేటాయించలేదు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతులకు ఆశలు చిగురించాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో రైతులకు నిరాశ ఎదురయింది. శనివారం అసెంబ్లీ సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు 22వ ప్యాకేజీ ప్రాణహిత చేవెళ్ల కాలేశ్వరం ప్రాజెక్టు కింద రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రత్యేకంగా ప్రభుత్వ నిధులు కేటాయించాలని కోరారు. గత ఎన్నికల ముందు రైతులకు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. దీంతో కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతుల్లో ఆశలు చిగురించాయి. ప్రభుత్వం ఎమ్మెల్యే ప్రస్తావించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిధులు కేటాయించి ఇస్తే రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని రైతులు ఆశిస్తున్నారు.