calender_icon.png 23 September, 2024 | 4:38 AM

వక్ఫ్ సవరణ ఒవైసీలకు ఇష్టం లేదు

23-09-2024 02:54:03 AM

బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్‌రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): వక్ఫ్ భూములు, ఆస్తుల విషయంలో అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటని పరిష్కరించేందుకే కేంద్రం వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చేందుకు జేపీసీని ఏర్పాటు చేసినట్లు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్ రావు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని అమలు చేస్తే ముస్లింలకు నష్టం జరుగుతుందని అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతున్నారని, అయితే గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా వక్ఫ్ సవరణలు చేసినట్లు గుర్తు చేశారు. వక్ఫ్‌లో అవకతవకలు, అవినీతిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు.

మైనార్టీల మహిళలతో పాటు మిగతా వర్గాలను కూడా వక్ఫ్ బోర్డులో ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అవినీతిని ప్రోత్సహించే ఒవైసీలు ఈ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని రాంచందర్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ బాగా కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఈ నెల 18 నాటికి దేశవ్యాప్తంగా 18 రోజుల్లోనే 4.2 కోట్ల సభ్యత్వాలు చేశామని.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6 లక్షల మంది పార్టీలో చేరారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల సభ్యత్వాలు చేసేలా లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ నెల 25న శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా 25 లక్షల సభ్యత్వాలు పూర్తవ్వాలని పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా టార్గెట్ ఇచ్చారని.. ఆ లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా నాయకులంతా సభ్యత్వ నమోదులో కీలకంగా వ్యవహరించాలని పార్టీ అధిష్ఠానం నిర్దేశించిందన్నారు. ఈ నెల 25 తర్వాత పార్టీకి చెందిన అన్నీ మోర్చాల ద్వారా సభ్యత్వాల నమోదు కార్యక్రమం ప్రారంభమవుతోందన్నారు. రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాంచందర్‌రావు ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పార్టీ సభ్యత్వాలు తీసుకున్నారు.