వనపర్తి జిల్లా వెంకంపల్లిలో గాయపడిన కూలీలు
15 మంది కూలీలకు గాయాలు
నల్లగొండ/వనపర్తి, నవంబర్ 12 (విజయక్రాంతి)/దేవరకొండ: రెండు వేర్వేరు ఘటనల్లో కూలీలతో వెళ్తున్న రెండు వాహనాలు బోల్తా పడటంతో 15 మంది కూలీలు గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం రాయవరం గ్రామానికి చెందిన 12 మంది మహిళా కూలీలు పత్తి తీసేందుకు మంగళవారం నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం పొగిళ్ల గ్రామానికి ఆటోలో బయలుదేరారు. బుగ్గతండాలోని కాసరాజుపల్లి పుష్కర ఘాట్ సమీపంలోకి రాగానే ఆటో అదుపుతప్పి రోడ్డు దిగువకు దూసుకెళ్లి బోల్తా పడటంతో పది మందికి తీవ్రగాయాలయ్యాయి.
స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్సులో దేవరకొండ ఏరియా దవాఖానాకు తరలించారు. ఆటో డ్రైవర్ అజాగ్రత్తతోనే ప్రయాదం జరిగినట్లు ఎస్సై సతీష్ తెలిపారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్ గ్రామానికి చెందిన 30 మంది కూలీలు మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్ల మండలం వెంకంపల్లిలో పత్తి తీసేందుకు మినీ వ్యాన్‌లో బయలుదేరారు.
కొత్తకోట మండలం కనిమెట్ట వద్దకు వెళ్లగానే టైర్ పగిలి వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వారికి మెరుగైన చికిత్స కోసం మహబూబ్‌నగర్‌కు తరలించినట్టు ఎస్సై మంజునాథ్‌రెడ్డి తెలిపారు.