30-03-2025 12:00:00 AM
అతి అనేది అన్ని విధాలా అనర్థమే. తిండి, నిద్ర దైనందిన జీవితంలో ఏది ఎక్కువైనా కష్టమే. కొందరు నిద్ర పోవడానికి తిప్పలు పడితే.. మరికొందరు చిటికెలో నిద్ర పోతారు. వారికి పరుపులు, ప్రదేశంతో పని ఉండదు. వదిలేస్తే రోజంతా అయినా పడుకునే ఉంటారు. నిద్ర మనసుకే కాకుండా శరీరానికి కూడా బూస్టర్‌లా పని చేస్తుంది. రోజుకు ఎనిమిది గంటల నిద్ర చాలా ఆరోగ్యకరం. కనీసం 7 గంటలైనా మంచిగా నిద్రపోవాలి. అలాగని అతి నిద్ర బూస్టర్ కాదు.. అనారోగ్యానికి కారణమవుతుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలానే ఉన్నాయి. అతి నిద్ర అంటే రోజుకు 9 గంటల కంటే ఎక్కువ నిద్ర పోయే వారు ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతారట. ఎక్కువ సేపు నిద్ర పోవడం వలన మెదడు పని తీరు దెబ్బ తింటుందని నిపుణులు చెబుతున్నారు.
స్త్రీలు ఎక్కువసేపు నిద్ర పోతే వారు గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు 7 గంటలు నిద్రపోతే మహిళలు గర్భం దాల్చడంలో ఎలాంటి సమస్యలూ ఎదురుకావట. అంతకు మించితే మాత్రం గర్భం దాల్చే అవకాశాలు తగ్గుతాయని అధ్యయనాలు తెలిపాయి. దీంతోపాటు డయాబెటిస్ ముప్పు కూడా పొంచి ఉంటుంది. 10 గంటలకు పైగా నిద్రపోయే వ్యక్తుల్లో గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయట. అలాగే బరువు కూడా పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.