calender_icon.png 16 November, 2024 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు

20-07-2024 03:37:21 AM

  • బంగాళాఖాతంలో వాయుగుండంగా అల్పపీడనం
  • రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం
  • భూపాలపల్లి, భద్రాద్రి, మంచిర్యాల జిల్లాల్లో తీవ్రత
  • వరదల ధాటికి ఏజెన్సీలో ఉప్పొంగుతున్న వాగులు
  • చప్టాలు, రహదారులు ధ్వంసమై రవాణాకు అంతరాయం.. ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు

విజయక్రాంతి నెట్‌వర్క్, జూలై 19: బంగాళాఖాతంలో అల్పపీడనం వాయిగుండంగా మారింది. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా కనిపించింది. పలుచోట్ల వాగులు పొంగి ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతాలకుతలం చేశాయి. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఉప నది ప్రాణహిత కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

మహాముత్తారం, మహాదేవ్‌పూర్, కాటారం మండలాల్లోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహాముత్తారం మండలం కేశవాపూర్ అటవీ ప్రాంతంలోని పెద్దవాగు, కాటారం మండలం పోతులవాయి బొర్రవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాటారం మండలం దామెరకుంట గుడ్రాత్‌పల్లి మధ్య అలుగువాగు పొంగడంతో బొలేరో ట్రాలీ వరదలో కొట్టుకుపోయింది. స్థానికులు చాకచక్యంగా వ్యవహరించి డ్రైవర్‌ను కాపాడగలిగారు. మహాముత్తారం మండలంలోని కొర్లకుంట అలుగువాగులో కారు కొట్టుకుపోతుండగా, స్థానికులు అప్రమత్తమై కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని కాపాడారు.

లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ రాహుల్ శర్మ విస్తృతంగా పర్యటించారు. మహాదేవ్‌పూర్ మండలం బొమ్మాపూర్ శివారులో కోతకు గురైన మందిరం చెరువు కట్టను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు ఉధృతంగా ప్రవహించే రహదారులపై రాకపోకలు నిలిపివేయాలని పోలీసులను ఆదేశించారు. వర్షాల ధాటికి మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని ఖర్జిభీంపూర్ బీటీ రోడ్డు ధ్వంసమైంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భీమిని, కన్నెపల్లి మండలాల పరిధిలోని ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

వాగు ఉప్పొంగడంతో ఇప్పటికే పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది. వరంగల్ నగరంలోని లేబర్ కాలనీ, సుందరయ్యనగర్, ఏనుమాముల, దేశాయిపేట, శాకరాసికుంట, ఎస్‌ఆర్‌ఆర్ తోట, హనుమకొండలోని సమ్మయ్య నగర్, గాంధీనగర్, వాజ్‌పేయి కాలనీ, ప్రశాంత్‌నగర్, గోపాలపురం ముంపునకు గురయ్యాయి.