calender_icon.png 26 December, 2024 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదరికం జయించి..

30-11-2024 12:00:00 AM

పోలీస్ సిస్టర్స్

పేదరికం వెంటాడినా.. కన్నతండ్రి దూరమైనా అనుకున్న లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు ఈ అక్కాచెల్లెళ్లు. లక్ష్యసాధనలో అనారోగ్యం బారిన పడినా.. గాయాలపాలైనా వెనుకడగు వేయలేదు. ఇటీవల జరిగిన పోటీ పరీక్షల్లో పోలీస్ ఉద్యోగాలు సాధించి మహిళలు ఏదైనా చేయగలరు అని నిరూపించారు. కుటుంబానికే కాదు.. సొంతూరికే ఆదర్శంగా నిలిచారు ఈ ఆడబిడ్డలు. ఆ ఇద్దరే జనగం స్రవంతి, శ్రావణి. 

భువనగిరి జిల్లా శాలిగౌరారం మండలం మనిమద్దెకు చెందిన జనగాం సత్తయ్య, ఎల్లమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. వృత్తిరీత్యా కల్లుగీత కార్మిక కుటుంబం. అయితే ఉన్న ఊళ్లో పనిలేకపోవడంతో ప్రతి ఏటా బతుకుదెరువు కోసం గుజరాత్, ఛత్తీస్‌గఢ్ లాంటి తదితర రాష్ట్రాలకు కల్లు గీసేందుకు వెళ్లేవారు. పిల్లల చదువులకు ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతో ఎల్లమ్మ తల్లిగారి ఊరైన మోత్కూర్ మండలం బుజులాపురంలో ఉంచి వెళ్లేవారు.

అప్పట్నుంచి ఈ అక్కాచెల్లెళ్లు అమ్మమ్మ ఊర్లోనే చక్కగా చదువుకుంటూ పెరిగారు. ఆర్థిక కష్టాలు ఎదురైనా తమ పిల్లలను గొప్పగా చదివించారు తల్లిదండ్రులు. ఒకటి నుంచి పది వరకు బుజులాపురం, పై చదువుల కోసం వేర్వేరు కళాశాలల్లో చేరి ఉన్నత విద్యను అభ్యసించారు. స్రవంతి డిగ్రీ, శ్రావణి ఇంటర్‌లో మంచి మార్కులతో పాసయ్యారు. అంతా సవ్యంగా సాగుతున్నక్రమంలో తండ్రి సత్తయ్య ఆరేండ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.

ఈ క్రమంలో తీవ్ర పేదరికం వెంటాడినా చదువును మాత్రం ఆపలేదు. పిల్లల ప్రతిభను అర్థం చేసుకున్న తల్లి ఎల్లమ్మ, తమ్ముడు శ్రీకాంత్ కష్టించి చదివించారు. మరోవైపు బంధువులు కూడా తమవంతు చేయూతనిచ్చారు. ఫలితంగా అక్కాచెల్లెళ్లు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అయితే గ్రూప్స్ లక్ష్యంగా పెట్టుకున్న వీరిద్దరు ఇటీవల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారు.

అయితే ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా, సొంత ఐడియాలజీతో కష్టపడి చదివి మొదటి ప్రయత్నంలోనే స్రవంతి 135, శ్రావణి 137 మార్కులు సాధించి ఏఆర్ కానిస్టేబుళ్లుగా అర్హత సాధించారు. ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు ఎదురైనా మనసు పెట్టి చదివితే అనుకున్న లక్ష్యం సాధించవచ్చు అని నిరూపించారు ఈ ఆడబిడ్డలు. 

భయపెట్టినా.. 

పోలీసులు అంటే శారీరకంగా ధృడంగా ఉండాలి. అందుకు ఎంతో కఠోర శిక్షణ అవసరం. శిక్షణ కోసం ఉదయాన్నే లేచి సన్నద్ధం కావాల్సి ఉంటుంది. మగవాళ్లతో సమానంగా ట్రైనింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. పోలీసు శిక్షణ అంటే తల్లిదండ్రుల్లోనూ ఎంతో భయం ఉంటుంది. ఇలాంటి కఠిన పరిస్థితులు ఉండటంతో ‘మీరు అమ్మాయిలు. చాలా సున్నితంగా ఉంటారు. ట్రైనింగ్ మధ్యనే వచ్చేస్తారు” అని చాలామంది భయపెట్టారు.

అయినా వెనుకడుగు వేయలేదు ఈ అక్కాచెల్లెళ్లు. “చిన్నప్నటుంచే ఎన్నోకష్టాలు పడ్డాం. తల్లిదండ్రుల కష్టం చూస్తూ పెరిగాం. అలాగే ట్రైనింగ్‌ను కూడా పూర్తి చేయగలమని గట్టిగా ఫిక్స్ అయ్యాం.. అనారోగ్యం సహకరించకపోయినా ఏ ఒక్కరోజు మిస్ కాలేదు. కఠినమైన ట్రైనింగ్‌లో రెండుసార్లు గాయపడ్డాం. అయినా విజయవంతంగా కంప్లీట్ చేశాం. తొమ్మిది నెలల ట్రైయినింగ్ సమయంలో మానసికంగా, శారీరకంగా రాటుదేలాం” అని చెప్పారు ఈ అక్కాచెల్లెళ్లు. 


-అనారోగ్యం వెంటాడినా..

నాన్న అనారోగ్య కారణాలతో చనిపోవడం ఎంతో బాధించింది. కుటుంబ బాధ్యతలతను తమ్ముడు మోయాల్సి వచ్చింది. మమ్మల్ని చదివిచేందుకు వ్యవసాయం చేశాడు. మొదట నేను పంచాయతీ సెక్రటరీ పరీక్ష రాశా. కానీ రాలేదు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లు పెళ్లి కుదిర్చారు. ఈవెంట్స్ ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నా. మా ఆయన శంకర్ ఆర్మీ జవాన్. ఆయన నా ప్రతిభను గుర్తించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేలా ప్రోత్సహించాడు. రెండేళ్లు శ్రమించి ఉద్యోగానికి అర్హత సాధించా. నా భర్త సూచనలు పోలీస్ కొలువు సాధించేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. 

 -స్రవంతి 


నాన్న ఉంటే సంతోషించేవాడు..
అక్కా నేను ఒకే పాఠశాలలో, ఒకే కళశాలలో చదువుకున్నాం. ఇద్దరం ఒకే దగ్గర చదువుకోవడం వల్ల పోటీ పరీక్షల ప్రిపరేషన్ చాలా సులువుగా మారింది. చదువుకునే క్రమంలో ఏమైనా సందేహాలు ఉంటే ఒకరికొకరం చర్చించుకున్నా. కుటుంబానికి దూరంగా హైదరాబాద్ హాస్టల్ లో ఉండి చదువుకునేవాళ్లం. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా పోలీస్ జాబ్ కొట్టడం ఎక్కడా లేని ఆనందం ఇచ్చింది. ఈ సమయంలో నాన్న ఉంటే చాలా సంతోషించేవాడు. మా సక్సెస్ వెనుక అక్క భర్త శంకర్ ఉన్నాడు. పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి? శరీరకంగా ఎలా ఫిట్‌నెస్ సాధించాలి? అనే విషయాలపై అవగాహన కల్పించి సన్నద్ధం చేశాడు. పెద్దమ్మ కొడుకులు, మామయ్యలు సహకారం కూడా మరువలేనిది.  
-శ్రావణి