కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నేటి పోటీ ప్రపంచంలో ఒక్క ఉద్యోగం సాధించడమే కష్టతరం అవుతున్న ఈ రోజుల్లో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తన ప్రతిభను చాటాడు ఓ అందుడు. కుమ్రం భీం జిల్లాకు చెందిన పుల్లూరి రాహుల్ ఇటీవల ప్రకటించిన ఉపాధ్యాయ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ ఉద్యోగాలకు ఎంపిక అవ్వగా గురువారం వెలువడ్డ గ్రూప్ -4 లోనూ వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాన్ని పొందారు. పూర్తి స్థాయి అంధత్వం ఉన్నా అందరితో పాటు సాధారణ పాఠశాల, కళాశాలలో చదివి ఉత్తమ ఫలితాలను సాధించి ఆదర్శంగా నిలిచాడు. ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన పుల్లూరి రాజబాపు సుజాతల రెండో కుమారుడైన రాహుల్ విద్యాభ్యాసం మొత్తం జిల్లాలోనే పూర్తి చేశాడు. రాహుల్ తండ్రి ప్రస్తుతం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ సెక్రటరీగా హైదరాబాద్ లో పనిచేస్తున్నారు.