calender_icon.png 24 January, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంగ్లండ్‌పై అలవోకగా

23-01-2025 12:00:00 AM

  1. తొలి టీ20లో భారత్ విజయం
  2. బౌలర్ల సమిష్టి ప్రదర్శన
  3. రాణించిన వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ

1 - టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ (61 మ్యాచ్ ల్లో 97 వికెట్లు) నిలిచాడు. స్పిన్నర్ చాహల్ (96 వికెట్లు) రెండో స్థానంలో ఉన్నాడు.

కోల్‌కతా: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో మొదలైన టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1 ఆధిక్యంలో నిలిచింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 132 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (68) అర్థశతకంతో ఒంటరి పోరాటం చేయగా.. మిగిలిన బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు పడగొట్టారు.

133 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భారత్ 12.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ (34 బంతుల్లో 79, 5 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు అర్థశతకంతో ఆకట్టుకోగా.. శామ్సన్ (26), తిలక్ వర్మ (19 నాటౌట్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 2 వికెట్లు తీశాడు. ఇరుజట్ల మధ్య రెండో టీ20 శనివారం జరగనుంది.

బట్లర్ ఒక్కడే..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభం నుంచి ఏదీ కలసిరాలేదు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ డకౌట్‌గా వెనుదిరగ్గా.. ఆ వెంటనే బెన్ డకెట్ (4) అతన్ని అనుసరించాడు. ఆ తర్వాత హ్యారీ బ్రూక్ (17)తో కలిసి బట్లర్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు.

అయితే బ్రూక్ ఔటైన అనంతరం ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినప్పటికీ ఒక ఎండ్‌లో బట్లర్ మాత్రం భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 34 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్న బట్లర్ ఔటైన అనంతరం కాసేపటికే ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

అభిషేక్ జోరు.. ఇంగ్లండ్ బేజారు

సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శాంసన్, అభిషేక్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించిన అనంతరం శాంసన్ ఔట్ కాగా.. ఆ వెంటనే కెప్టెన్ సూర్య డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఈ దశలో తిలక్‌వర్మ (19*)తో కలిసి అభిషేక్ ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. విజయానికి దగ్గర్లో అభిషేక్ ఔటవ్వగా.. పాండ్యా (3*), తిలక్ వర్మ జట్టును గెలిపించారు.