calender_icon.png 1 October, 2024 | 3:44 AM

కాంగ్రెస్ వచ్చాక వెయ్యికిపైగా రైతు ఆత్మహత్యలు

01-10-2024 01:08:25 AM

రాహుల్ వరంగల్ రైతు డిక్లరేషన్ ఏమైంది?

రైతుల ఓట్లతో గద్దెనెక్కి.. వారికే వెన్నుపోటు

కాంగ్రెస్ తీరుపై బీజేఎల్సీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ధ్వజం

కాంగ్రెస్ తీరును నిరసిస్తూ ధర్నా చౌక్‌లో బీజేపీ రైతు దీక్ష

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వెయ్యి మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డి.. ఇచ్చిన హామీలు మర్చిపోయావా? మర్చిపోయినట్టు నటిస్తున్నావా? అంటూ మండిపడ్డా రు.

రైతు హామీల సాధన కోసం బీజేపీ ప్రజాప్రతినిధులు బీజేఎల్పీ ఆధ్వర్యంలో సోమవా రం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద 24 గంటల దీక్ష చేపట్టారు. మంగళవారం ఉదయం 11 గంటల వరకు జరిగే ఈ దీక్షను కర్ణాటక, తమిళనాడు బీజేపీ సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత ఏలేటి ప్రసంగిస్తూ.. వరంగల్ డిక్లరేషన్‌లో రాహుల్‌గాంధీ సమక్షంలో రేవంత్‌రెడ్డి రూ.81వేల కోట్లతో రైతులను ఆదుకుం టామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చి, రూ.40 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారని, క్యాబినెట్ భేటీలో రూ.31వేల కోట్లుగా  నిర్ణయించి బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లు ఇచ్చి చివరికి రూ.17 వేల కోట్లు మాత్రమే అందచేశారని దుయ్యబట్టారు.

రైతు ల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. చివరకు అన్నదాతలనే మోసం చేసిందని ఆరోపించారు. రైతులకు తాము అండగా ఉంటామని, కాంగ్రె స్ మెడలు వంచుతామని ఏలేటి భరోసా ఇచ్చారు. ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జీ నగేశ్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావుపటేల్, సూర్యనారాయణ, హరీశ్‌బాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు.  

హైడ్రా కాదు.. హైడ్రోజన్ బాంబు

హైడ్రా పేదల పాలిట హైడ్రోజన్ బాంబులా మారిందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. పేదల కన్నీళ్లు చూస్తే బాధగా లేదా? మీకూ కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్లకు ఇలాంటి ఇబ్బంది ఎదురైతే ఇలాగే ఉంటారా అని అన్నారు. ఎవరి పైన కక్ష ఉంటే వారిపైనే చర్యలు తీసుకోవాలని సూచించారు. హైడ్రాపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. 

 ఎంపీ డీకే అరుణ

రేవంత్ రెడ్డికి అధికారం నెత్తికెక్కింది

రేవంత్ రెడ్డి అధికారం నెత్తికి ఎక్కి ఎవరినీ లెక్కజేయని స్థాయికి ఎదిగాడని, కేసీఆర్‌కి 6 ఏళ్లు పడితే.. రేవంత్‌కి మూడు నెలలకే అహంకారం తలకెక్కిందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. మోసానికి దగాకు మారుపేరుగా రేవంత్ మారిపోయారని విమర్శించారు. మూసీ ప్రక్షాళన పేరుతో లక్షన్నర కోట్లలో వచ్చే కమీషన్ కోసమే రేవంత్‌రెడ్డి ఇదంతా చేస్తున్నారని విమర్శించారు.  

ఎంపీ ఈటల రాజేందర్ 

సుందరీకరణ పేరుతో కొత్త డ్రామా

పదేండ్లలో బీఆర్‌ఎస్ సర్కారు ఎంతటి అపఖ్యాతిని మూట కట్టుకుందో.. 10 నెలల్లో కాంగ్రెస్ అంత మూట కట్టుకుందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో రేవంత్‌రెడ్డి కొత్త డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. తమ పాలనలో చనిపోయిన రైతు కుటుంబాలను కనీసం పరామర్శించని బీఆర్‌ఎస్ నేతలు.. నేడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవాచేశారు. 

  మెదక్ ఎంపీ రఘునందన్ రావు

ఎవరి ఇల్లు కూలిపోతదో తెలియట్లేదు

రాష్ర్టంలో ఎవరి ఇల్లు ఎప్పుడు కూలిపోతదో తెలియడం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కూల్చివేతల్లో ముస్లింలకు ఒక న్యాయం, హిందువులకు ఒక న్యాయం, చుట్టాలకు ఒక న్యాయం సామాన్యుడికి ఒక న్యాయం అమలు అవుతోందని ఆరోపించారు. తక్షణమే రాష్ర్ట రైతులకు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ