calender_icon.png 13 January, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకులు తింటూ ఔట్సోర్సింగ్ కార్మికుల నిరసన

13-01-2025 05:17:26 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రి ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఆకులు తింటూ వినూత్నంగా నిరసన తెలిపారు. సిఐటియు మంచిర్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అబ్బోజు రమణ, దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు విన్నవించిన పట్టించుకోకపోవడంతోనే నిరసన తెలపరచి వచ్చిందన్నారు. పిఎఫ్ పేరుతో కూత విధించిన డబ్బులు కార్మికుల ఖాతాల్లో జమ చేయడం లేదని ఆరోపించారు. యూనిఫామ్, గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదని, వేతనాల చెల్లింపులు విషయంలో కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వెంటనే ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టి కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

జిల్లా అధికారులు వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్న ఐదు నెలల వేతనాలను కార్మికులకు చెల్లించాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి సంఖ్య రవి మాట్లాడుతూ.. కోత విధించిన పిఎఫ్ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేయాలని, యూనిఫామ్, ఐడి కార్డులను అందించాలని కోరారు. ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు చెల్లించాలని లేనట్లయితే ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దూలం శ్రీనివాస్, సిఐటియు బెల్లంపల్లి మండల కన్వీనర్ చల్లూరి దేవదాస్ తో పాటు ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.