calender_icon.png 1 November, 2024 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన

03-07-2024 12:13:13 AM

  1. జీవో నంబర్ 60 అమలు కోసం నిరీక్షణ
  2. జలమండలి ఎండీ కరుణ చూపాలని వేడుకోలు
  3. చాలీచాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 2(విజయక్రాంతి): హైదరాబాద్ మహా నగరంలో మంచినీటి సరఫరా, మురుగు నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న జలమండలిలో ఏండ్ల తరబడి పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నా రు. నెలకు కనీసం రూ.25 వేలు ఖర్చు చేస్తే కానీ నగరంలో కాలం గడవని పరిస్థితుల్లో చాలీచాలని జీతాలతో జీవనం సాగిస్తున్నా రు. జలమండలిలో సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైస్కిల్డ్ ప్రాతిపదికన 4,534 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. వారి లో 10 ఏండ్లకు పైబడి పనిచేస్తున్న వారూ ఉన్నారు. వీరు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తక్కువ వేతనాలు పొందుతూ కష్టంగా ఇళ్లు గడుపుతున్నారు. ఇక రోజురోజుకూ జలమండలిలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణలు పెరుగుతుండడంతో తమపై పని భారం పెరుగుతున్నట్లు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వాపోతున్నారు. 

పూర్తిస్థాయిలో అమలు చేయాలని..

ప్రభుత్వ జీవో నంబర్ 60 ప్రకారం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు టైం స్కేల్‌కు తగ్గకుండా వేతనాలివ్వాల్సి ఉంది. 2016లో ఈ జీవో విడుదలయింది. దీని ప్రకా రం 30 శాతం జీతాలను పెంచా రు. 2021 నుంచి జీహెచ్‌ఎంసీ సహా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ జీవో ప్రకారం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందుతున్నాయి. ఈ జీవో ప్రకారం కేటగిరీ 1, 2, 3 ఉద్యోగులు రూ.15,600, రూ.19, 500, రూ.22,750 వేతనంగా పొందుతున్నారు. కానీ జలమండలిలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీవో నంబర్ 60 పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం వల్ల పెరిగిన వేతనాలు అందకపోవ డంతో ఇబ్బందులు పడుతున్నారు.

సెమీ స్కిల్డ్ ఉద్యోగులు రూ. 15,600, స్కిల్డ్, హైస్కిల్డ్ ఉద్యోగులు రూ.19,500 వేతనానికి పని చేస్తున్నారు. కానీ కేటగిరీల ప్రకారం విభజించకపోవడంతో దాదాపు 1,800 మంది ఉద్యోగులు నెలకు రూ.4 వేల వరకు వేతనం కోల్పోతున్నారు. ఈ జీవో పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో పెరిగిన 30 శాతం వేతనాన్ని పొందలేక పోతున్నారు. నూతన ఎండీ అశోక్‌రెడ్డి తమ పట్ల శ్రద్ధ చూపితే సమస్యకు పరిష్కారం లభిస్తుందని వాపోతున్నారు. ఇదిలా ఉండగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏజన్సీల ద్వారా వేతనాలు ఇస్తుండడంతో సమ యానికి అందక ఇబ్బందులు పడుతున్నారు. జలమండలి ద్వారా అయితే  తమకు జీతా లు సకాలంలో అందుతాయని, జలమండలికి కూడా ఆదాయం మిగులుతుందని చెబుతున్నారు. 

పెరగని ఉద్యోగుల సంఖ్య

రోజురోజుకూ జలమండలి పరిధి విస్తరిస్తోంది. ప్రస్తుతం ఓఆర్‌ఆర్ వరకు సేవలందిస్తోంది. కానీ ఉద్యోగులు మాత్రం సరిపడా లేరు. దానికి తోడు రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతోంది. రెగ్యులర్ ఉద్యోగులతో పని చేస్తున్నా సరైన గుర్తింపు లేదు. రెగ్యులర్ ఉద్యోగం చేసే అటెండర్‌తో పోల్చితే ఔట్‌సోర్సింగ్‌లో పని చేస్తున్న హైస్కిల్డ్ ఉద్యోగికి వేతనం తక్కువ. జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు లభించడం లేదు. దీనికి తోడు అనుభవం, అర్హత ఉన్నప్పటికీ పలువురు జలమండలి కేటాయించిన ఉద్యోగాల్లోనే పని చేస్తున్నారు. అప్‌గ్రేడ్ చేస్తే తమకు గుర్తింపు లభిస్తుందని ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి అభిప్రాయం వ్యక్తం చేశారు.