calender_icon.png 19 April, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీస్ అవినీతి లీలలు

17-04-2025 12:46:36 AM

  1. బ్లాక్ లిస్టులో ఉన్నా కొనసాగుతున్న వైనం
  2. అధికారుల చేతివాటం

భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ అవినీతి లీలలు అన్నీ ఇన్ని కావు అన్నట్లు వెలుగు చూస్తున్నాయి. స్వయంగా మైనార్టీ సెక్రటరీ ఆదేశాలను జిల్లా స్థాయి అధికారులు బేకాతర్ చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. జిల్లాకు చెందిన పర్ఫెక్ట్ అవుట్ సోర్సింగ్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఔట్సోర్సింగ్ ఏజెన్సీని 2022 సంవత్సరంలో అప్పటి జిల్లా కలెక్టర్ అనుదీప్ బ్లాక్లిస్టులో నమోదు చేశారు.

ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన అధికారులు దొడ్డి దారిన ఆ ఏజెన్సీస్ కి రెన్యువల్ చేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే పర్ఫెక్ట్ అవుట్ సోర్సింగ్ అండ్ మేనేజ్మెంట్ ఏజెన్సీ 2022లో జిల్లాలోని అశ్వరావుపేట మైనార్టీ గురుకులంలో అవినీతికి అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఆనాటి మైనార్టీ సెక్రటరీ ఔట్సోర్సింగ్ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ లో పెట్టి క్రిమినల్ కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.

ఆ ఆదేశాల మేరకు అప్పటి కలెక్టర్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టారు. అయినప్పటికీ 2022 మార్చి 20వ తేదీ నుంచి 2025 మార్చి 31 వరకు ఫర్ఫెక్ట్ ఔట్సోర్సింగ్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కొనసాగడం గమనార్హం. తాజాగా ఆరోగ్యశ్రీ విభాగంలోని  పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి ప్రావిడెంట్ ఫండ్ సక్రమంగా చెల్లించడం లేదని, ఈఎస్‌ఐ చెల్లించకుండా పెండింగ్లో ఉంచారని, వేతనాలను  సక్రమంగా చెల్లించకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారని అదే ఔట్సోర్సింగ్ ఏజెన్సీ పై ప్రజావాణిలో ఆరోగ్యశ్రీ ఔట్సోర్సింగ్ యూనియన్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

దీంతో ఔట్సోర్సింగ్ అవినీతి లీలలు వెలుగు చూశాయి. 2022లో ఈ ఏజెన్సీ అశ్వరావుపేట మైనార్టీ గురుకులం కళాశాలలో ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులు ఉన్నాయి. తాజాగా ఔట్సోర్సింగ్ ఆరోగ్యశ్రీ సిబ్బందికి ఈపీఎఫ్, ఈ ఎస్ ఐ చెల్లించకుండా మోసం చేస్తున్నారని సిబ్బంది కలెక్టర్ ఫిర్యాదు చేశారు. బ్లాక్ లిస్టులో ఉన్న ఏజెన్సీ ఎలా కొనసాగుతున్నది అనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఈ విషయం పై జిల్లా కలెక్టర్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ట్రస్టు ద్వారా వేతనాల చెల్లించండి: ఔట్సోర్సింగ్ సిబ్బంది 

చాలీచాలని వేతనాలతో 18 సంవత్సరాల నుంచి ఔట్సోర్సింగ్ విభాగంలో తాము పని చేస్తున్నామని, ఔట్సోర్సింగ్ ఏజెన్సీస్ మోసానికి బలవుతున్నామని సిబ్బంది వాపోతున్నారు. ఏ కాంట్రాక్టర్ వచ్చిన తమకు చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్‌ఐ చెల్లించకుండా మోసం చేస్తున్నారని, దీంతో ప్రభుత్వం నుంచి పొందాల్సిన లబ్దిని కోల్పోతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు చెల్లిస్తున్న గౌరవ వేతనాన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీస్ ద్వారా కాకుండా నేరుగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా చెల్లించాలని కోరుతున్నారు.

ఫర్ఫెక్ట్ ఔర్ సోర్సింగ్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ బ్లాక్ లిస్టులోనే ఉంది

జిల్లాలో కొనసాగుతున్న ఫర్ఫెక్ట్ అవుట్ సోర్సింగ్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ బ్లాక్ లిస్ట్ లోనే ఉందని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఏజెన్సీస్ ఆరోగ్య మిత్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు ఎలా చెల్లిస్తున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు.

ఎంప్లాయిమెంట్ అధికారి శ్రీనివాస్