calender_icon.png 1 November, 2024 | 11:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి క్వార్టర్స్‌లో బయటివ్యక్తులు!

11-08-2024 12:05:00 AM

  1. శ్రీరాంపూర్ ఏరియాలో 345 క్వార్టర్లలో ఇతరులు 
  2. కేటాయించిన సింగరేణి యాజమాన్యం 
  3. 59 క్వార్టర్స్‌లో అనధికారంగా ఇతరుల నివాసం 
  4. అద్దె చెల్లించకుండానే ఏళ్లుగా మకాం 
  5. పట్టించుకోని సంస్థ అధికారులు

మంచిర్యాల, ఆగస్టు 10 (విజయక్రాంతి): సింగరేణికి చెందిన క్వార్టర్లలో సిబ్బంది కాకుండా బయటివారు ఉంటున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి సంస్థకు సంబంధం లేని ఎంతో మంది ఉంటున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అనధికారికంగా ఉంటున్న వారి వద్ద సింగరేణి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. ఎవరైనా కంపనీ క్వార్టర్ అనుమతి తీసుకొని ఉంటే సంస్థకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎలాంటి సంస్థకు అద్దె చెల్లించకుండా ఏండ్ల తరబడి నివాసముంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

219 సింగరేణి అధికారులకు.. 345 ఇతరులకు

సింగరేణి క్వార్టర్లలో ఉండే వారికి సంస్థనే ఉచితంగా విద్యుత్, తాగునీరు సరఫరా చేస్తుంది. పారిశుధ్య నిర్వహణ సైతం సింగరేణే చూసుకుంటుంది. శ్రీరాంపూర్ ఏరియాలో మొత్తం 7,141 క్వార్టర్స్ ఉండగా ఇందులో 219 సింగరేణి అధికారులకు కేటాయించారు. సింగరేణి ప్రాంతంలో విధులు నిర్వహించే సింగరేణేతరులకు 345 క్వార్టర్స్‌ను ఇతర వ్యక్తులకు కేటాయించారు. పోలీసు, రెవెన్యూ, కలెక్టరేట్ ఇతర ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహించే వారికి ఈ క్వార్టర్లు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ అందులో వారే ఉంటు న్నారా, ఇతరులు ఉంటున్నారో తెలియదు.

అధికారులు సర్వసాధారణంగా ఎలక్షన్ల సమయంలో, లాంగ్ స్టాండింగ్ పేరిట బదిలీ అవుతుంటారు. వారికి కేటాయించిన క్వార్టర్లు అధికారులు తిరిగి ఎవరికి కేటాయిస్తున్నారో తెలియదు. అలాగే సింగరేణి కార్మికులకు 5,850 క్వార్టర్స్ ఇవ్వగా అందులో 668 ఖాళీగా ఉన్నాయి. 59 క్వార్టర్స్‌లలో ఇతరులు అనధికారికంగా ఉంటు న్నారు. ఇదంతా జీఎంతో పాటు కిందిస్థాయి అధికారులకు తెలిసినా చూసీచూ డనట్లుగా వ్యవహరిస్తున్నారు. సింగరేణి కార్మికులకు కేటాయించిన క్వార్టర్స్‌లో ఉన్న ఖాళీ స్థలంలో షెడ్డులు ఏర్పాటు చేసుకుందామంటే అనుమతివ్వరు. ఏర్పాటు చేసుకున్నా అధికారులు కూల్చివేస్తారు. కానీ అధికారులకు తెలిసే 59 మంది అనధికారంగా నివాసముంటున్నా పట్టించుకోవడం లేదు.

నచ్చిన వారికి అనధికారికంగా కేటాయింపు

శ్రీరాంపూర్ ఏరియాలో అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. నచ్చిన వారికి అనధికారికంగా క్వార్టర్లు కేటాయిస్తున్నారని, అనుమతి లేకుండా ఉంటున్న వారి నుంచి అద్దె సంస్థకు కాకుండా సంబంధిత అధికారులే వసూలు చేసుకుంటున్నట్లు క్వార్టర్ల కోసం వేచి చూస్తున్న నూతన కార్మికులు ఆరోపిస్తున్నారు. కార్మికులకు సింగరేణి కేటాయించిన క్వార్టర్ వద్ద చిన్న కట్టడం కడితేనే వాటిని కూలగొట్టడమో, ఆ ఇంటికి నీరు, కరెంటు బంద్ చేస్తున్న అధికారులు..

అనధికారికంగా ఉండే వారికి నీరు, కరెంట్ సరఫరా చేయడం గమనార్హం. డబ్బులు తీసుకుని, వారిని క్వార్టర్లలో ఉంచుతూ సంస్థకు నష్టం చేస్తున్న సంబంధిత అధికారులపై, ఏరియా జీఎం దృష్టి సారించకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇప్పటికైనా సింగరేణి క్వార్టర్లపై సీఎండీ దృష్టి సారించి బాధ్యులపై చర్యలు తీసుకోచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కార్మికులకే కేటాయించాలి 

సింగరేణి యాజమాన్యం సంస్థలో పని చేస్తున్న కార్మికులు, అధికారుల కోసం విడతల వారిగా క్వార్టర్లను నిర్మించింది. ఇలాంటి క్వార్టర్లను కార్మికేతరులకు కేటాయించడం అన్యా యం. సంస్థ కార్మికులు ఇంటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఇతరులు అనధికారికంగా నివాసముంటున్నా రు. సంస్థ ఆస్తులు రక్షించేందుకు ఎస్ అండ్ పీసీ సిబ్బం ది ఉన్నప్పటికీ ఇలా వ్యవహరించడం సబబు కాదు. కార్మికుల క్వార్టర్లు కార్మికులకే కేటా యించాలి.

 పేరం రమేష్, ఐఎన్టీయూసీ 

నాయకుడు, శ్రీరాంపూర్