calender_icon.png 25 November, 2024 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లగచర్లకు వెల్లువలా మద్దతు

25-11-2024 01:00:34 AM

  1. ఫార్మా భూబాధితులకు అండగా ప్రతిపక్షాలు
  2. ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ల పర్యటనలతో మరింత ధైర్యం 
  3. భూములిచ్చేది లేదంటున్న రైతులు 
  4. లగచర్ల మాటెత్తని కాంగ్రెస్ లీడర్లు

వికారాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): కొన్నిరోజులుగా లగచర్ల ఘటన హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర రాజకీయాలు మొత్తం లగచర్ల చుట్టే తిరుగుతు న్నాయి. ఓవైపు కలెక్టర్ స్థాయి అధికారిపై దాడి ఘటనను అధికార పక్షం జీర్ణించుకోలేకపోతుండగా.. మరోవైపు ప్రతిపక్షాలు మా త్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాయి.

అయితే దాడి జరిగిన సమయంలో అధికారులే బాధితులుగా కనిపించారు. రెండు మూడు రోజు లు ఉద్యోగ సంఘాలతో పాటు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధికారులకు మద్దతు ప్రకటించారు. బీజేపీ కూడా అధికారులపై దాడిని ఖండించింది. వామపక్ష పార్టీలు కూడా మొదట్లో అధికారులపై దాడులను ఖండించాయి.  

అన్నిపార్టీల నుంచి మద్దతు..

లగచర్ల ప్రాంతం సీఎం సొంత నియోజకవర్గంలో ఉండటంతో.. తాజా ఘటనకు రాజకీయం రంగు పులుముకుంది. ఫార్మా బాధితులను పరామర్శిం చేందుకు ఎంపీలు డీకే అరుణ, ఈటల, విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్యర్యంలో బీజేపీ నాయకులు లగచర్లకు వెళ్లడానికి రెండుసార్లు ప్రయత్నం చేసినా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ప్రభుత్వ తీరుపై వారు మండిపడ్డారు.

బాధితులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట లగచర్ల బాధితుల గురించి మాట్లాడు తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వ తీరును తప్పుపడుతూనే ఉన్నారు.

ఇటీవల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో  వామపక్ష పార్టీల సభ్యుల బృందం బాధిత గ్రామాల్లో పర్యటించి.. బాధితులను పరామర్శించారు. అలాగే ఫార్మా బాధిత గ్రామాల్లో శనివారం జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు పర్యటించి.. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఇలా రోజురోజుకు ఫార్మా బాధితులకు మద్దతు పెరుగుతోంది.

పోలీసుల ఎంట్రీతో మారిన సీన్

మొదట్లో అధికారులపై దాడితో పెరిగిన సింపతీ కాస్తా.. ఘటన జరిగిన అనంతరం లగచర్లలో పోలీసుల రంగప్రవేశం, అరెస్టుల తీరుతో మొత్తం మారిపోయింది. రైతులను అరెస్ట్ చేసిన తీరు అప్రజాస్వామికమని.. ఇళ్లల్లోకి చొరబడి పోలీసులు ఇష్టారాజ్యం గా వ్యవహరించారని బాధితులు ఆరోపించారు.

దీంతో పోలీసులు, ప్రభుత్వ తీరుపై విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. అరెస్టుల తీరును ఖండిస్తూ బీఆర్‌ఎస్ ఏకంగా బాధితుల బంధువులను ఢిల్లీ తీసుకెళ్లి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అనంతరం ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ లగచర్లలో పర్యటించిన విషయం తెలిసిందే.

ప్రారంభంలో బయటకొచ్చి తమ బాధను చెప్పుకునేందుకు వెనకాడిన బాధితులు..  క్రమంగా మద్దతు పెరుగుతుండటం తో ధైర్యంగా నాయకులు, మీడియా ముందుకు వస్తున్నారు. దీంతో అధికార పార్టీ ఇరకాటంలో పడినట్లుంది. దీంతో గత నాలుగైదు రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులెవరూ లగచర్ల మాట ఎత్తడం లేదు.

ప్రాణాలు పోయినా భూములివ్వం

కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. అభివృద్ధి పనులకు సుమారు రూ.5 వేల కోట్లు కేటాయించారు. దీంతో నియోజకవర్గ ప్రజలు కొడంగల్ అభివృద్ధిలో దూసుకుపోతుందని భావించారు. అంతలో సీఎం ఫార్మా బాంబు పేల్చడంతో ఒక్కసారిగా ఐదు గ్రామాల ప్రజల్లో ఆందో ళన మొదలైంది.

లగచర్ల, పోలెపల్లి, హకీంపేట్, రోటిబండ తండా, పులిచర్ల గుట్ట తండాల ప్రజ లు అయోమయంలో పడ్డారు. లగచర్ల ఘటన చోటు చేసుకున్న మరుసటి రోజు నుంచి బాధితులు స్వరం పెంచారు. ప్రాణాలు పోయినా ఫార్మా కంపెనీలకు తమ భూములు ఇవ్వమని తేల్చి చెప్పారు. ఏమాత్రం రాజీపడినా భవిష్యత్ తరా లు నష్టపోవాల్సి వస్తోందనే ఉద్ధేశంతో మరింత పట్టుదలతో ఏకంగా ప్రభుత్వంపైనే పోరాటానికి సిద్ధమయ్యారు.