కలెక్టర్ చొరవతో డ్రోన్ ద్వారా ఆహారం అందజేత
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పా ల్వంచ మండలంలోని దంతెలబోర వద్ద గు రువారం కిన్నెరసానిలో చిక్కుకున్న వ్యక్తులను రెస్క్యూ టీమ్ క్షేమంగా ఒడ్డుకు చేర్చింది. కలెక్టర్ జితేష్ వీ పాటిల్ ఆదేశాలతో ప్రత్యేక డ్రోన్‌ను వినియోగించి వారికి ఆహార పదార్థాలు, మంచినీరు అందజేశారు. బుధవారం పశువులను కాసేందుకు వెళ్లిన ఏడుగురు వ్యక్తుల్లో ఆరుగురు క్షేమంగా తిరిగి వచ్చారు.
గల్లంతైన జారే సాయి ఆచూకీ కోసం గురువారం మరో ఐదుగురు వాగుదాటి వెళ్లగా ఆ సమయంలోనే కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద ఉద్ధృతి పెరిగి వాగు మధ్యలో చిక్కుకు పోయారు. విషయం తెలుసుకొన్న కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవోలు మధు, దామోదర్‌రావు, పాల్వంచ తహసీల్దార్, సీఐలు వాగు వద్దకు చేరుకొన్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. కలెక్టర్ కేటీపీఎస్ అధికారులతో మాట్లాడి ప్రాజెక్టు గేట్లు దించి వేయించడంతో నీటి ఉద్ధృతి తగ్గి అందరూ క్షేమంగా బయటకు వచ్చారు.