calender_icon.png 12 January, 2025 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా వారి పెళ్ళి

16-09-2024 12:00:00 AM

నందగిరి ఇందిరాదేవి 

22న జయంతి

“రేపు నా పెళ్ళి. తెలుసా?” అన్నారు మావారు నవ్వుకుంటూ, పలహారం ప్లేటు టేబిలుమీద పెడుతున్న నన్ను చూసి.

“మీకు...?” అడిగాను వారి మాటల్లోని అంతరార్థం గ్రహించలేక.

“నాకు పెళ్ళి. అందుకే ఇంత హడావిడిగా వచ్చాను” అన్నారు.

“ఆ.. మీకు పెళ్ళా?” అన్నాను వచ్చే నవ్వును ఆపుకుంటూ. “పాకీదానితోనా, పని మనిషితోనా?” అన్నాను ఇంకా నవ్వుతూ.

మేము మహబూబునగరంలో కొత్తగా కాపురం పెట్టినప్పుడు ఊరికి దూరంలో ఉన్న మా యింటికి పనిమనుషులు కుదిరేవారు కాదు. ఒకవేళ కుదిరినా నాలుగు రోజులుకూడా ఉండేవారు కాదు. ఆ రోజుల్లో అక్కడ నీళ్ళకు ఇబ్బంది వుండేది. మేము అద్దెకు ఉన్నవాళ్ళ యింట్లోంచి నీళ్ళు తెచ్చుకోవాల్సి వచ్చేది. ఉదయం లేవగానే వాళ్ళింటి నుండి నీళ్ళు తెచ్చుకోవటం, పాచిపని చేసుకోవటం, వండుకోవటం శ్రమగా వుండేది పనివాళ్ళు రానప్పుడల్లా. అప్పుడు మా వారికి అమోఘమైన ఐడియా తట్టింది. నా బాధ చూళ్ళేక “కట్టకట్టి వీళ్ళందరినీ పెళ్లాడేస్తాను. తిండి పడేస్తే ఇంట్లోనే పడి వుంటారు” అనేవారు. నాకు ఆ మాట జ్ఞాపకం వచ్చింది.

“పాకీదీ కాదు పనిమనిషీ కాదు, ఒక గ్రాడ్యుయేటును” అన్నారు ఫలహారం తింటూనే.

ఆ మాట తమాషాకుకాక నిజంగా సీరియస్‌గా అన్నట్టు అనిపించింది. వారు నవ్వుకుంటూ అన్నట్టే నేనూ నవ్వు మొహంతోనే ఆడిగాను.“ఓహో! అయితే ఎవర్ని పెళ్లాడుతున్నారు దేవర వారు?” అని.

“ఉందిలే! ఒక మంచిపిల్ల. మే మిద్దరం చాలరోజులబట్టి ప్రేమించుకుంటున్నాము’ అన్నారు.

ఆ మాటవిని మళ్ళీ నవ్వొచ్చింది.

“ఏడిసినట్టే ఉంది. నాకు ఉత్తరం రాయటానికి తీరదు కాని, ఎవరినో ప్రేమిస్తున్నారట. చెపితే నమ్మేట్టు ఆన్నా ఉండాలి” అన్నాను ఏ మాత్రం తొణకకుండా.

తొణకాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే, తీర్పులు చెప్పటంలో ఊపిరి సలపని వారికి ప్రేమించటానికి, హఠాత్తుగా ఊడిపడి పెళ్ళి చేసుకుంటానికి ఎంత టైము కావాలి? అంత టైమే ఉంటే ఇంకో రెండు జెడ్జిమెంట్లు రాసుకోవచ్చుననే తత్వం వారిది!

మంచినీళ్ళు త్రాగి గ్లాసు అందించి, “అయ్యో, నువ్వు నమ్మక పోతే ఏం చేయను! నేను అసలు అబద్ధం చెపుతానా?” అన్నారు లేచి నిలబడుతూ.

“Truth, whole truth, nothing but the truth, ఇతరులతో చెప్పిస్తారు కాని మీరు చెప్పాలని ఎక్కడుంది లెండి” అన్నాను, తేలికగా నవ్వి పారేస్తూ.

“సరే, నీయిష్టం. నేను ఏదీ నీతో దాచలేదు. ఇదికూడా దాచటం లేదు. రేపు ఉదయం దేవాలయాని కెళ్ళాలి. సాయంత్రం మన యింట్లో విందు. అన్ని ఏర్పాట్లూ నీ చేతిమీదుగా జరగాలి” అన్నారు నన్ను దగ్గరకు తీసుకుంటూ. 

ఇంతలో కారు హారను మోగింది. 

“నే నిప్పుడే కాస్త బజారెళ్ళి వస్తా” అనుకుంటూ వెళ్ళారు స్నేహితుడి కార్లో.

నాకేమీ పాలుపోలేదు. ఈ యీడులో ఈ పిల్లలతో తనకు పెళ్ళేమిటి? నిజంగానే ఇంతవరకు ఏదీ దాచలేదు. అయినా తాతకు పెళ్ళిలా వుంది! వారు అబద్ధం చెప్పటం లేదని అన్నా, అది పచ్చి అబద్ధం అయినా భార్య ఉండగా పెళ్ళి చేసుకున్న వాళ్ళనూ చూశాంగా. ఎవరికీ తెలియకుండా ఏ గుళ్ళో చేసుకోటమో లేక పోలీసు పహరాతో చేసుకోటమో చూశాం కాని ఈ విపరీతం, ఈ అమాయికం చూళ్ళేదు. నేనే చేయించాలట పెళ్ళి! ఏదో జోక్ చేస్తున్నారు. ఓ! నేనులొంగి అయ్యో! ఎట్లా? అని ఏడుస్తాననుకున్నారు కాబోలు! అంతా వొట్టిదే నన్ను భయపెట్టి ఫూల్‌ని చేద్దామని...

ఇట్లాంటి ఆలోచనలన్నీ వెనక్కు నెట్టి అదే బయట పడుతుంది ఆ తమాషా యేమిటోననుకొని, మళ్ళీ రాత్రికి వంట చేసి చంటివాడికి పాఠం చెప్పుకొంటు న్నాను.

ఇంతలో ఒకావిడ లడ్డూలు చేసే జల్లి గంటెలు, అన్నం వార్చే తట్ట పట్టుకొని, గేటు దగ్గర నిలబడ్డ మా నౌకరును, “ఫలానా వారిల్లు ఇదేనా?” అని అడుగుతోంది. పాఠం ఆపి మేడమీది నుంచి చూశాను. ఆవిడ లోపలికి వచ్చింది.

కిందికి వచ్చి, “ఎవరు కావాలి?” అనడిగాను.

“మన యింట్లో రేపు రాత్రి విందటగా. ఎంతమందికి ఏం చేయిస్తారో చెపితే సామాన్లు రాయిస్తాను” అన్నదావిడ. నాకు కొంచెం కోపం వొచ్చింది. “ఎవరు చెప్పారు మీకు?” అన్నాను. ఇంట్లో ఏదైనా పట్టించుకోని వారికి వంటమనిషిని మాట్లాడి పంపే తెలివి ఎప్పటి నుంచీ అని.

“బాబుగారి స్నేహితులటమ్మా. వారు మా యింటికి మనిషిని పంపి ఇక్కడికి వెళ్లమన్నారు” అన్నది. సరే పెళ్ళి అబద్ధమైనా విందు నిజమన్నమాట అనుకొని మామూలుగా విందుకు ఎప్పుడు ఏం చేయిస్తానో చెప్పి ప్రతిఫలం కూడా మాట్లాడి ఇంట్లో లేని సామాను లిస్టు రాసుకున్నాను. ఆవిడ ఆ గరిటలు మా నౌకరుకిచ్చి రేపు మధ్యాహ్నం వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఆవిడటు వెళ్ళిందో లేదో “రేపు ఇంటికి లైట్లు పెట్టమన్నారు. ఇల్లు పనివాళ్ళకు చూపించి పోదామని వచ్చాను” అన్నాడొకతను. జోరుగానే ఉన్నాయి పెళ్ళి ఏర్పాట్లు అని అనుకుంటూ వుంటే

“అమ్మా, అమ్మా, మన యింట్లో ఏమిటే?” అన్నాడు చంటివాడు. ఏమిటీ? మన యింట్లో!

“మీ నాన్న పెళ్ళి!” అన్నాను వెటకారంగా.

ఆ మాట వినీ వినడంతోనే మేడమీద చదువుకుంటూన్న పెద్దపిల్లల దగ్గరికి వెళ్ళి “మనింట్లో పెళ్ళర్రోయి! లడ్డూలు, చేస్తున్నారు. లైట్లు పెడుతున్నారు” అని గోలగా అరిచాడు. వాడట్లా ఆరుస్తుంటే చికాకు పుట్టి, “పాఠం చదవకుండా ఆ గంతు లేమి”టని ఒక్కటి అంటించాను.

బజారెళ్ళిన మా వారు ఇంకా రాలేదు, ఒకవేపు సన్నాహాలు కనబడుతున్నా వారు చెప్పిన ఆబద్ధం నిజమని నా మనసు ఒప్పుకోటం లేదు. ఆ చెప్పే మాటకూడా నా తల నిమురుతూ నన్ను దగ్గరకు తీసుకొని చెప్పుతారేం? అబ్బ! చేతుల్లో ఎంత ఆకర్షణ! ఆ గొంతులో వెయ్యివీణల స్వరం! వారి నోట వచ్చిన ఆ మాట చేదుది అయినా సరే మాధుర్యం ఉట్టి పడుతోంది.

ఎందుకో చప్పున పెళ్ళి కాకముందు వారు వ్రాసిన మొదటి ఉత్తరం జ్ఞాపకం వొచ్చింది.

“...ఇట్లాంటి నన్ను బాగా ఆలో -చించుకోండి !...ఆ తర్వాత నన్ను అంటే లాభం లేదు” అని వ్రాశారు. వారు ఏం చేసినా ఆ బాధ్యతంతా నాదేనన్న మాట. మా బామ్మ అంటుండేది ‘చాలారోజులు మగవాళ్ళను ఒంటరిగా ఉంచకూడదు’ అని. పిల్లల చదువు, వారి ఉద్యోగం మూలానా వారు ఒక వూళ్ళో, నేనొక వూళ్లో.

‘ఛా! ఎంత పాపిష్టిది మనసు. పాడు ఆలోచనలు పోతున్నాయి’ అని నన్ను నేను తిట్టుకున్నాను.

పిల్లలంతా అన్నాలు తిని పడుకున్నారు. వారు వచ్చి నేరుగా పడక గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చేవరకు భోజనం సిద్ధం చేశాను. మేడమెట్లు దిగి వస్తుంటే తెల్లటి చొక్కా, తెల్లటి పయిజామా, నల్లని చెప్పుల్లో మెరిసి పోతున్నారు.

“కొత్త పెళ్ళికొడుకు కళ వచ్చిందే” అన్నాను నవ్వుకుంటూ.

నా కళ్ళల్లోకి చూసి, “ఏం? కానా మరి?” అని అనుకుంటూ అందిచ్చిన తువాలుతో చేతులు తుడుచుకుని భోజనానికి కూర్చున్నారు.

“ఏం తెచ్చారు బజారునుండి?” అన్నాను మామూలు ధోరణిలోనే.

వారు ఎంతో ఉత్సాహంగా, “అబ్బ! ఎన్ని దుకాణాలు తిరిగాననుకున్నావు? నాకు నచ్చినవి దొరికేటప్పటికి ఈవేళ అయింది. చూద్దువుగాని పైన పెట్టించా పాకెట్టులు. అది సరేగాని వంటమనిషి, లైట్లవాళ్ళు వచ్చారా?” అన్నారు.

“ఆ! వచ్చారు” అన్నాను ముక్త సరిగా.

“నీకు అంత ఉత్సాహంగా లేనట్టు ఉంది నేను పెళ్ళి చేసుకుంటూ వుంటే!” అన్నారు. లాయరు తెలివి తేటలతో నా అభిప్రాయం కనుక్కుందామనేమో.

నేను బెట్టుసడలించలేదు- బావురు మనలేదు.

“ఓ లేకేం! రేపటి విందుకు లడ్డూ, ఆలుబాత్, పకోడీలు, పక్వాన్నాలు చేయిస్తున్నా. చెట్లల్లో కూడా బల్బులు పెట్టమన్నా. రంగురంగుల బల్బుల పెడితే చాల బాగుంటాయి కదండీ” అన్నాను ఉత్సాహం తెచ్చిపెట్టుకుంటూ.

వారు ముసిముసిగా నవ్వుకున్నారు. భోంచేశాక ఈ పెళ్ళి అంతు ఏమిటో అదే తేలుతుంది. తొందర పడటం దేనికని నిగ్రహించుకొని భోజనం ముగించా.

మేడమీదకు వెళ్ళి తమలపాకులు కడ్తుంటే ఒక్కొక్క పాకెట్టు విప్పటం మొదలెట్టారు.

“ఇదుగో చూడూ. ఈ చీరలు పెళ్ళికూతురికి అని తెచ్చాను. ఈ రంగు బాగుంది కదూ. ఈ అంచుచూడు జరీ జరీ ఎట్లా మెరిసిపోతోందో! ఇదిగో ఇది చూడూ, ఒంటిరవ్వ ఉంగరం!” అని ఉత్సాహంగా చెప్పుకుంటూ చూపించారు. అవన్నీ చూశాక ‘ఈ పెళ్ళి నేను అనుకున్నంత తేలిక వ్యవహారం లాగ కనపడటం లేదే!’ అనుకున్నాను.

“ఇంతకీ పెళ్ళికూతురు ఎవరు? ఏ వూరు? చెప్పనే లేదు” అన్నాను అవన్నీ మడతలు చెరగకుండా మళ్ళీ డబ్బాల్లో పెడుతూ.

“చూస్తావుగా రేపు” అన్నారు.

“పాపం! ఆమె ఎవరో ఎరక్క గోతిలో పడుతోంది. మీలాంటి వారిని చేసుకుని ఏం సుఖపడుతుందని. ఎవరో తెలిస్తే బాగుండును” ఆన్నాను నాలో నేను అనుకున్నట్టు.

“వెళ్ళి చెప్పొస్తావా చేసుకో వద్దని?” అన్నారు.

“ఆహా! మీతో నేను కాబట్టి వేగుతున్నాను. చకోర పక్షిలా ఎదురుచూడగా దర్శనమే దుర్లభమయ్యే మీతో నేను కాగా కాపరం చేస్తున్నాను” అన్నాను. నా కంఠంలో కొద్దిగా జీర, నా మాటల్లో వ్యధ - అనుకోకుండా ప్రకటితమయ్యాయి.

ఇంకా చెప్పలేక వారి గుండెల్లో తల -దాచుకున్నాను. అంతా అయోమయమనిపించింది. కొట్టినా తల్లికాళ్లకే చుట్టుకునే పసిపిల్లలాగా వారిని చుట్టేసుకున్నాను. వారి చేతుల్లో ఇమిడిపోయిన నన్ను మరింత గట్టిగా అదుముకొని

“ఆ పిల్ల యెవరో చెప్పనా మరి?” అన్నారు.

“చెప్పండి, దాచటం యెందుకూ?” అన్నాను ధైర్యం కూడగట్టుకుంటూ. నా మొహంలో మొహం పెట్టి, “ఆ పిల్లవు నువ్వే” అన్నారు.

“నేనా! మరి పెళ్లేమిటి?” అన్నాను వారి బాహుబంధం విడిపించుకుంటూ.

“నిన్ను మళ్ళీ కొత్త పెళ్ళికూతురులా చూడాలని వుంది” అని ఆ తెచ్చిన ఉంగరం వ్రేలికి తొడిగారు.

“మన పెళ్లయి రేపటికి పాతికేళ్లు. కథలో చెపుతారే అట్లా, ఆకాశం అంత పందిరేసి, భూమంత అరుగేసి, ఆ పెళ్ళి అబద్ధమని, ఈ పెళ్ళి నిజమని, మన వాళ్ళందరికీ విందు చేద్దాము” అన్నారు.

ఆ మధుర క్షణంలో కాంతం ‘నీవు నా కెక్కడ దొరికావు?’ అని ఆమె భర్తను అడిగిన ప్రశ్న నాకూ కలిగింది.

అవును! ఈ అమృతమూర్తి ఎక్కడ దొరికారు నాకు! ఈ ప్రేమ పెన్నిధి సాంగత్యం ఎట్లా లభించింది!

నా హృదయంలో ఈ ప్రశ్నకు జవాబే ముంది! ఏదో పూర్వపుణ్య సుకృతం, అంతే! 

(రచనా కాలం: 1962 డిసెంబర్, 

ప్రచురణ: ‘యువ’ మాసపత్రిక, 

‘కథా నిలయం’ సౌజన్యంతో..)