calender_icon.png 6 October, 2024 | 6:07 AM

మన స్పెషాలిటీ.. సూపర్!

06-10-2024 02:36:33 AM

వరంగల్ దవాఖాన నిర్మాణంలో లీలలు

అడ్డగోలుగా అంచనాలు పెంపు

అంచనాల పెంపులో గణపతిరెడ్డిదే కీలక పాత్ర

ఈఎన్‌సీ హోదాలో ఆడింది ఆట పాడింది పాట

రిటైరైనా ఎక్స్‌టెన్షన్‌తో చక్రం తిప్పిన గణపతిరెడ్డి

రేవంత్ సర్కారు ఆగ్రహంతో రాజీనామా 

సర్కారును వేధిస్తున్న అంచనాల పెంపు

హైదరాబాద్, అక్టోబర్ ౫ (విజయక్రాంతి): వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణంలో అధికారుల, పాలకుల లీలలు విస్తుగొలుపుతున్నాయి. ఈ దవాఖాన నిర్మాణం కోసం గత ప్రభుత్వం ఆగమేఘాల మీద సిద్ధమైంది.

అప్పటికే నగరంలో ఎంజీఎం లాంటి పెద్ద సూపర్ స్పషాలిటీ దవాఖాన ఉన్నా దాన్ని మరింత బలోపేతం చేయడం మానేసి తమ ధన దాహాన్ని తీర్చుకొనేందుకు మరో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం చేపట్టింది. ఇందుకోసం ఏళ్లుగా ఉన్న వరంగల్ సెంట్రల్ జైలు స్థలాన్ని తాకట్టు పెట్టి మరీ రుణం తీసుకుని రంగంలోకి దిగింది.

ఈ నిర్మాణానికి వైద్య ఆరోగ్య శాఖకు తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎంఎస్‌ఐడీసీ) అనే సంస్థ ఉన్నప్పటికీ, దాన్ని కాదని ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా నిర్మాణ పనులను చేపట్టింది గత ప్రభుత్వం. దీంతో ఆ శాఖ విభాగాధిపతిగా ఎక్స్‌టెన్షన్‌లో ఉన్న ఈఎన్‌సీ గణపతిరెడ్డి ప్రభుత్వంపై అంతులేని స్వామి భక్తిని ప్రదర్శించారు.

ఈ దవాఖాన నిర్మాణానికి ముందు నిర్ణయించిన అంచనాలను ఏకంగా 36.27 శాతం పెంచేశారు. పేపర్లపైనే అంచనాలు పెంపు జరిగింది. దీంతో ప్రభుత్వ ఖజానాపై రూ.626 కోట్ల అదనపు భారం పడింది.

అంతపెద్ద ఆసుపత్రి భవనమే అక్కడ అవసరం లేదని, ఉన్న ఎంజీఎంలో వసతు లను పెంచి సిబ్బందిని రెట్టింపు చేస్తే చక్కని వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని నిపుణులు మొత్తుకున్నా వినకుండా జైలు స్థలాన్ని తాకట్టు పెట్టడమే కాకుండా భారీగా అంచనాలను పెంచేసి ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు కుట్ర చేశారు.

అంచనాల పెంపులో నాటి ఈఎన్‌సీ గణపతిరెడ్డిదే కీలక పాత్ర అని, రిటైరైనా ఆయన ఎక్స్‌టెన్షన్‌తో చక్రం తిప్పారని ఆ శాఖ అధికారులు కొందరు అంటున్నారు. 

మొదట రూ. 1100 కోట్లతో అంచనాలు

20.76 లక్షల చదరపు అడుగుల్లో 24 అంతస్తుల్లో నిర్మాణం చేపట్టిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం అప్పటి బీఆర్‌ఎస్ సర్కారు ఎన్నో అంతుచిక్కని నిర్ణయాలను తీసుకుంది. 2,100 పడకల్లో పేషెంట్ల అటెండెంట్ల కోసమే 450 పడకలు.. 42 లిఫ్టులు, 8 లక్షల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ సహా ఎన్నో ఆధునిక సదుపాయాలతో దేశంలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అంటూ గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది.

ఇందుకోసం టీఎస్‌ఎస్‌హెచ్‌సీఎల్ పేరిట ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ ద్వారానే ఎప్పటి నుంచో ఉన్న వరంగల్ సెంట్రల్ జైలు స్థలాన్ని రూ.1,173 కోట్లకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు తాకట్టు పెట్టింది. దీంతో రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జైలు సేవలు ఆగిపోయాయి. సూపర్ స్పెషాలిటీ ముసుగులో జైలు స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూసినా ప్రభుత్వం మారడంతో గత పాలకుల ఆశలు నెరవేరలేదు.

ఇది ఇలా ఉంటే అంచనాల పెంపు అందరినీ ఆశ్చర్యపరిచింది. రూ.1,100 కోట్లతో అంచనాలు వేసిన ఆర్‌అండ్‌బీ అధికారులు కొన్ని రోజుల్లోనే ఆ అంచనాలను ఏకంగా రూ.1,726 కోట్లకు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణకే నిధులు లేక ఇబ్బందులు పడుతున్న సర్కారుకు ఈ అంచనాల పెంపు సమస్యగా మారింది. 

అంతా చేసి చల్లగా జారుకొని..

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అంచనాలను ఇష్టానుసారంగా పెంచేశారని గుర్తించిన సీఎం రేవంత్‌రెడ్డి.. గణపతిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంచనాల పెంపుపై ఈ ఏడాది జూన్ 29న విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రూ.626 కోట్ల మేర అంచనాలను పెంచడంపై విజిలెన్స్ అధికారి ఏఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో విచారణ ప్రారంభమైంది.

మరోవైపు ఈ అంశంపై సీఎం సీరియస్‌గా దృష్టి సారించడంతో గణపతిరెడ్డి తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారని అంటున్నారు. ఈఎన్‌సీగా 2017లో పదవీ విరమణ చేసినా గత ప్రభుత్వం అండదండలతో అదే పదవిలో కొనసాగిస్తూ వచ్చారు.

గణపతిరెడ్డి హయాంలో చోటుచేసుకున్న అక్రమాలపై కాంగ్రెస్ సర్కారు దృష్టి సారించిన వెంటనే ఈ ఏడాది సెప్టెంబర్ 2న రాజీనామా చేసి వెళ్లిపోవడం గమనార్హం. రాజీనామా చేసినా అంచనాల పెంపుకు కీలక బాధ్యుడిగా భావిస్తున్న గణపతిరెడ్డిపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తోందని ఆర్‌అండ్‌బీ శాఖలోని అధికారులు చెబుతున్నారు.

ఎన్నికల ముందు అంచనా పెంపు

మొదట రూ.1,100 కోట్ల అంచనాతో పనులు చేపట్టిన ఆసుపత్రిలో సివిల్ పనుల కోసం రూ.509 కోట్లు, మంచినీళ్లు, పారిశుద్ధ్య పనుల కోసం రూ.20.36 కోట్లు, మెకానికల్, ప్లంబింగ్, విద్యుత్తు పనుల కోసం రూ.182.18 కోట్లు కేటాయించారు. వైద్య పరికరాలకు రూ.105 కోట్లు, ట్యాక్స్ ఇతర చార్జీలకు రూ.229.18 కోట్లు, వివిధ అనుబంధ పనుల కోసం రూ.54 కోట్లు మంజూరు చేస్తూ పనులు చేపట్టారు.

అయితే గత ప్రభుత్వం ముగుస్తుందనగా నిర్మాణ అంచనాలను ఈఎన్‌సీ గణపతిరెడ్డి అండ్ కో పేపర్లపైనే ఏకంగా రూ.1,726 కోట్లకు పెంచేసి ప్రభుత్వ ఖజానాను లూటీ చేశారనే విమర్శలు వచ్చాయి. నిర్మాణ సామగ్రిని మార్కెట్ ధరల కంటే ఎక్కువకు కొనుగోలు చేసినట్లుగా చూపించారు. ఫ్లోరింగ్ కోసం మార్బుల్‌ను చదరపు అడుగుకు రూ.500 చొప్పున కొనుగోలు చేశారు.

ఇక్కడ మార్కెట్ ధర దాదాపు రూ.300 ఉండగా, 66 శాతం పెంచేశారు. ఇదే విధానం అన్నింటా అమలు చేసి అంచనాలను పెంచారు. గత ప్రభుత్వం చెప్పినట్లు విన్న ఆర్‌అండ్‌బీ శాఖ అంతులేని స్వామి భక్తిని చాటుకునేందుకే ఏకంగా రూ.626 కోట్ల మేర అంచనాలను పెంచేసిందని అంటున్నారు. ఈఎన్‌సీ హోదాలో గణపతిరెడ్డి ఆడింది ఆట పాడింది పాట అన్నట్లుగా ఉండేదని ఆర్‌అండ్‌బీ అధికారులు చెప్తున్నారు. 

నిజాం కట్టిన జైలును తాకట్టు పెట్టారు

110 ఏళ్ల క్రితం నిజాం సర్కారు నిర్మించిన వరంగల్ సెంట్రల్ జైలును కూడా గత బీఆర్‌ఎస్ సర్కారు వదిలిపెట్టలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ఏకంగా 54 ఎకరాల స్థలాన్ని చెర పట్టాలని బీఆర్‌ఎస్ సర్కారు కుట్ర చేసింది. అందుకే వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అంటూ కొత్త నాటకానికి తెర తీశారు.

అక్కడికి కేవలం కిలోమీటర్ దూరంలోనే ఉన్న ఎంజీఎం ఆసుపత్రిని మరింత ఆధునీకరిస్తే పేదలకు వైద్య సేవలు అందేవి. కానీ రియల్ దందా కోసమే సూపర్ స్పెషాలిటీ నాటకం మొదలుపెట్టారు. ఇందుకోసం జైలు స్థలాన్ని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు తాకట్టు పెట్టారు.

అంచనాలను పెంచేసి అక్రమాలకు తెరతీశారు. అప్పటి అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు సైతం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటోంది. ప్రభుత్వ అక్రమాలపై మా పోరాటం కొనసాగుతుంది. 

 బక్క జడ్సన్, సామాజిక ఉద్యమకారుడు