calender_icon.png 5 January, 2025 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిలిప్పీన్స్‌కు మన బియ్యం

03-01-2025 01:38:52 AM

  1. 45వేల టన్నులు ఎగుమతి
  2. మూడు జిల్లాల నుంచి ముందుకొచ్చిన మిల్లర్లు
  3. ఐదేళ్ల తరువాత తెలంగాణ బియ్యం ఇతర దేశాలకు..

హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో వానకాలం సీజన్‌లో ధాన్యం ఎక్కువ పండటంతో ప్రభుత్వం విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఒప్పం దం కుదుర్చుకుంది. బియ్యం ఎగుమతిపై రెండు నెలల కితం ఫిలిప్పీన్స్ ప్రతినిధులతో అధికారులు చర్చలు జరిపారు.

గత యాసంగి, ఈ వానకాలంలో సేకరించి సీఎంఆర్ చేసిన బియ్యం ఎగుమతికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. యా దాద్రి, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో దాదాపు 15 మిల్లులు ఇందుకు అంగీకరించినట్లు తెలిసింది. ఈ మిల్లుల నుంచి కాకినాడ పోర్ట్ వరకూ బియ్యాన్ని లారీల్లో పంపిస్తారు. అక్కడి నుంచి ఫిలిప్పీన్స్‌కు తరలిస్తారు.

బియ్యంలో నూక 5 శాతానికి మించకుండా ఎగుమతి చేయాలని ఆ దేశం కోరడంతో రాష్ర్టం నుంచి 1.50 లక్ష టన్నుల బియ్యం ఎగుమతికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నాలుగు రోజుల క్రితం మిల్లర్లతో పౌర సరఫరా శాఖ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి చేసే విషయంలో మిల్లర్లతో చర్చలు జరిపారు.

2022- 23 యాసంగి సీజన్ ధాన్యం గతంలోనే టెండర్ వేసినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటివరకూ ఆ సీజన్ వడ్లను మిల్లర్లు పూర్తిగా ఇవ్వకుండా తప్పించుకున్నారు. వాటిని ఇవ్వాలని, లేకుంటే ఆర్‌ఆర్‌యాక్ట్ అమలుచేస్తామని హెచ్చరించి అప్పటి సీజన్‌కు చెందిన బియ్యం ఇవ్వాలని పేర్కొనడంతో పలు మిల్లులు ముందుకొచ్చాయి. 

మూడు జిల్లాల నుంచి 45 వేల టన్నులు ఎగుమతి 

ఫిలిప్పీన్స్‌కు బియ్యం పంపించడానికి సూర్యాపేట, ఖమ్మం, యాద్రాద్రి జిల్లా నుంచి 15 మిల్లులు అంగీకరించాయి. ఈ మిల్లుల్లో గత యాసంగి సీజన్‌కు సంబంధించిన ధాన్యం సీఎంఆర్ చేసి 45 వేల టన్నులను ఫిలిప్సీన్స్‌కు పంపించడానికి సిద్ధ్దంగా ఉన్నాయి. తెలంగాణలో అయితే సీఎంఆర్‌కు 25 శాతం నూకను ప్రభుత్వం అంగీకరించేది, విదేశాలకు పంపితే 5 శాతం నూకతోనే బియ్యం పంపించాల్సి ఉంటుంది.

క్వింటాల్ ధాన్యం సీఎంఆర్ చేస్తే రూ.50 చొప్పున మిల్లింగ్ చార్జీలు కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. బియ్యం ప్యాక్ చేయడానికి తెల్ల గన్నీ సంచులు జిల్లా పౌరసరఫరాల శాఖ సరఫరా చేయనుంది. బియ్యం నాణ్యతతో పాటు నూక శాతాన్ని స్థ్ధానిక అధికారులు పరిశీలన చేసిన తరువాత ఎగుమతి చేసేందుకు వీలుంటుంది. 

ఐదేళ్ల తరువాత..

బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తరువాత తెలంగాణ బియ్యం ఇతర దేశా లు కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. అంతకు ముందు ఫిలిప్పీన్స్, జమైకా వంటి దేశాలు ఏటా 1.20లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేసుకునేవి. తరువాత నాణ్యత తక్కువ ఉండటంతో ఆ దేశాలు ఎగుమతి నిలిపివేశాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాష్ట్రంలో వానాకాలం వరి పంట పెద్దఎత్తున పండుతుందని అంచనా వేసి గతంలో ఉన్నట్లు ఇతర దేశాలకు పంపేందుకు అక్కడ ప్రతినిధులలతో చర్చలు జరిపి వారిని ఒప్పించి.. నాణ్యమైన బియ్యం పంపిస్తామని హామీ ఇవ్వడంతో వారు తెలంగాణ బియ్యం తీసుకునేందుకు ముందుకొచ్చారు.