అందరు ఆరోగ్యంగా ఉండాలన్నదే మా సంకల్పం
ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ జూన్ 9 (విజయక్రాంతి): సిఎం రిలీఫ్ ఫండ్ పేదలకు భరోసా కల్పిస్తుందని ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80 మంది లబ్దిదారులకు ఆయన సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాల్లో దాదాపు మూడు వేల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద ప్రజలకు కూడా ప్రభుత్వం సహాయం అందిస్తోందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సుమారు రూ 3 వేల కోట్ల ను కేటాయించారని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సిబ్బందిని నియమించామని చెప్పారు.
అవసరమైన పత్రాలు సమర్పించిన వారికి మూడు నెలల్లోనే చెక్కులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో లేనివిధంగా వేగవంతమైన వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవన బీమా పథకం అమలు చేయనున్నామని వెల్లడించారు. దురదృష్టవశాత్తు కుటుంబ పెద్ద మరణిస్తే రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచుతూ, వైద్యులను నియమిస్తూ మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆయన చెప్పారు. విద్య, వైద్యం, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 ఇళ్లు మంజూరు చేసి, మరో 2,500 ఇళ్లను పేదలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని తెలిపారు.
ఈ రెండున్నర సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని గమనించి ప్రజలు మళ్లీ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, కార్పొరేటర్లు షబ్బీర్ అహ్మద్, అవేజ్, తాహేర్, భాను చందర్ , మజ్జీద్, ఎంపి ప్రవీణ్, నాయకులు రాములు యాదవ్, అజ్మత్ అలి, సల్మాన్, లీడర్ రఘు, శరత్, ఫైసల్ ,అక్బర్, మోయీజ్, అశ్వాక్ , రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.






