calender_icon.png 17 November, 2024 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరంగంకు తీసిపోని మన రంగనాథుడు

17-11-2024 12:00:00 AM

తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామి ఆలయానికి ఏమాత్రం తీసిపోని రీతిలో వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది. ఆలయానికి మూడు వైపులా నీటితో జలకళ.. ముందు వైపు ఆలయం ఉండి ప్రకృతి అందాలతో పర్యాటకులకూ కనువిందు చేస్తున్నది.

500 ఏండ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయంలోని చెక్కు చెదరని శిల్ప సంపద చూపరులను కట్టిపడేస్తున్నది. ఎన్నడూ ఎండిపోని రత్న పుష్కరిణి, తంజావూరు చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వనపర్తి సంస్థానాధీశుల  వారసుల చేతులమీదుగా ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం విశేషం.

  1. తమిళనాడు క్షేత్రాన్ని మరిపిస్తున్న శ్రీరంగాపురం ఆలయం 
  2. మూడు వైపులా నీటితో ప్రకృతి రమణీయత
  3. 500 ఏండ్లయినా చెక్కు చెదరని శిల్ప సంపదలు 
  4. ప్రత్యేక ఆకర్షణగా రత్న పుష్కరిణి, తంజావూర్ చిత్రాలు 
  5. ఏటా వనపర్తి సంస్థానాధీశులతో స్వామి బ్రహోత్సవాలు 
  6. ఆలయ ప్రాంగణంలో సినిమాలు, సీరియల్స్ చిత్రీకరణ  

వనపర్తి, నవంబర్ 16 (విజయక్రాంతి): వనపర్తి జిల్లాలోని శ్రీరంగపట్నంరంగనాథుడి ఆలయం ప్రకృతి రమణీయతతో భక్తులను మైమరపింపజేస్తున్నది. తమిళనాడులోని శ్రీరంగంలో కొలువై ఉన్న రంగనాథుడి ఆలయానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న ఈ ఆలయాన్ని వనపర్తి సంస్థానాధీశుడైన బహిరి అష్టబాషి గోపాలరావు 15వ శతాబ్దంలో కట్టించాడు.

స్వతహాగా కవి కావడం, ఎనిమిది భాషలపై పట్టుండటంతో దక్షిణ భారతదేశంలోని చాలా పుణ్య క్షేత్రాలను ఆయన దర్శించుకున్నాడు. అలా పుణ్యక్షేత్రాల సందర్శనలో భాగంగా తమిళనాడులోని శ్రీరంగం చేరుకున్నాడు. అక్కడ రంగనాయకులు కొలువైన క్షేత్రాన్ని చూశాడు.

ఆ ఆలయ నిర్మాణం, శిల్ప కళకు ముగ్దుడైన ఆయన ఏటా క్రమం తప్పకుండా శ్రీరంగం వెళ్లి రంగనాథ స్వామిని దర్శించుకొనేవాడు. కాలక్రమేణా రాజుకి వయసు మీద పడటంతో వనపర్తి సంస్థానం నుంచి శ్రీరంగం వెళ్లడానికి ఆరోగ్యం సహకరించలేదు. దీంతో స్వామి వారిని దర్శించుకోలేక పోతున్నానని బాధ పడుతుండేవాడు.

ఒక రోజు రాత్రి కళలో స్వామివారు కనిపించి నీ రాజ్యంలోని సంకిరెడ్డిపల్లి గ్రామ అడవిలో (ప్రస్తుత కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి గ్రామం) ఉన్న ఒక పుట్టలో తాను కొలువు దీరి ఉన్నానని.. ఓ డేగ నీకు దారి చూపుతుందని చెప్పి మాయమయ్యాడు. మరుసటి రోజు ఓ డేగ స్వామి వారి జాడను రాజుకి చూపించింది.

అక్కడ ఉన్న రంగనాథ స్వామి విగ్రహాన్ని వనపర్తి సంస్థానానికి దగ్గరల్లో ఉన్న అప్పట్లో కొరివిపాడుగా పిలిచే నేటి శ్రీరంగాపురంలో ఆలయాన్ని కట్టించాడు. తరువాత సంకిరెడ్డిపల్లి నుంచి స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారు. తరువాత కొరివిపాడు గ్రామం శ్రీరంగాపురంగా పేరుమారింది.

కంటికి ఉట్టిపడేలా శిల్ప సంపద  

ఆలయ నిర్మాణం కోసం కృష్ణ, తుంగభద్ర తీరాల్లో ప్రత్యేకంగా దొరికే ఇసుక రాయిని, తమిళనాడులోని తంజావూర్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన శిల్పులు శిల్పాలను చెక్కినట్లు తెలుస్తోంది. ఆలయంలోకి వెళ్లే ముందు పెద్ద రాజగోపురం దర్శనమిస్తుంది. దీనిని 60 అడుగుల ఎత్తు 20 అడుగుల ద్వారంతో ఐదు అంతస్థుల్లో నిర్మించారు.

రామాయణం, క్షీరసాగర మధనం, శ్రీ కృష్ణుడి జీవితం, ఉగ్ర నరసింహావతారం, లక్ష్మిదేవి వంటి దేవతామూర్తుల విగ్రహాలను కండ్లను కట్టిపడేసేలా చెక్కారు. గోపురం కింది భాగంలో ద్వారానికి రెండు వైపులా వనపర్తి సంస్థానాధీశుల కు సంబంధించి శిల్పాలు, శ్రీ రాముడి పట్టాభిషేకం శిల్పాలను చెక్కారు. 

ప్రత్యేక ఆకర్షణగా రత్న పుష్కరిణి 

ఆలయానికి వెళ్లే దారిలో నక్షత్ర ఆకారంలో పూర్తిగా రాళ్లతో రత్న పుష్కరిణి కట్టారు . గుండు బావిగా పిలిచే ఈ కోనేరు ఇప్పటి వరకు ఎండిపోలేదు. ఒకప్పుడు ఈ గ్రామస్థులంతా రత్న పుష్కరిణి నీళ్లు తాగేవాళ్లని చెప్తుంటారు. తిరుమల, తమిళనాడులోని తంజావూర్‌లోని స్వర్ణ కారులు, చిత్రకారులు రకరకాల లోహాలు, నవరత్నాలతో తయారు చేసిన చిత్రాలు నేటికి పర్యాటకుల చూపురులను కట్టి పడేసేలా చేస్తుంది. ఇప్పటికి ప్రత్యేక రుసుం చెల్లించి చిత్రాలను చూసేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నారు. 

సినిమా , సీరియల్స్ చిత్రీకరణ

ఈ ఆలయ ప్రాంగణంలో ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు అధిక స్థాయిలో వస్తుంటారు. ప్రకృతి అందాలను , ఇక్కడి శిల్ప సంపదను పలు చిత్రాలు, సీరియల్స్ చిత్రీకరణలు సైతం నిర్వహిస్తుంటారు. ఆది, సింహాద్రి, చెన్నకేశవరెడ్డి, లీలామహల్ సెంటర్, టక్ జగదీశ్  సినిమాలోని కొన్ని సీన్లను ఇక్కడ చిత్రీకరించారు. వీటితో పాటు పలు సీరియల్స్ సైతం ఇక్కడ షూటింగ్ చేశారు. 

ఏటా స్వామివారి బ్రహోత్సవాలు 

ఆధ్యాత్మిక కళాపోషణకు నిలయమైన ఈ ఆలయంలోని రంగనాథస్వామిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయం నిర్మించి స్వామిని ప్రతిష్ఠించిన నాటి నుంచి ఏటా ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నుంచి ఉగాది వరకు 15 రోజులపాటు జాతరను నిర్వహిస్తుంటారు.

ఆనవాయితీ ప్రకారం వనపర్తి సంస్థానాధీశులు నేటికి క్రమం తప్పకుండా స్వామి వారికి బ్రహోత్సవాలను నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వస్తుంటారు. స్వామివారు కొలువై ఉండటం వల్ల దేశమంతా హోలీ జరుపుకొన్న మరుసటి రోజు గ్రామంలో పండుగ నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.