calender_icon.png 23 October, 2024 | 11:22 PM

అధిష్ఠానానికి మన రాజ్యసభ సీటు?

09-08-2024 01:18:01 AM

  1. ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వి 
  2. ఉన్న ఒక్క సీటూ ఉత్తరాధికి అప్పగించిన తెలంగాణ కాంగ్రెస్
  3. తెలంగాణ నేతలకు మొండి చెయ్యేనా? 
  4. సింఘ్వి కోసమే కేకేతో రాజ్యసభకు రాజీనామా చేయించిన ఏఐసీసీ

హైదరాబాద్, ఆగస్టు 8(విజయక్రాంతి) : తెలంగాణలో జరిగే రాజ్యసభ ఉప ఎన్నికకు ఉత్తరాధికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత,  సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని ఏఐసీసీ ఎంపిక చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి విజయం సాధించిన కే కేశవరావు కాంగ్రెస్‌లో చేరగానే, రెండు సంవత్సరాల కాలపరిమితి ఉన్నా ఆయన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

కేకే స్థానంలో తెలంగాణకు చెందిన వారికి అవకాశం దక్కుతుందని ఇక్కడి నేతలు భావించారు. కానీ, కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం రాజ్యసభలో పార్టీ సీనియర్‌కు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణకు నేతలకు మొండి చెయ్యేనని విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన మూడు రాజ్యసభ స్థానాల్లో రెండింటిని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకాచౌదరి, యూత్ కాంగ్రెస్ నాయకుడు అనిల్‌కుమార్ యాదవ్‌తో భర్తీ చేశారు.

అప్పుడే ఒక సీటును ఢిల్లీ పెద్దలకు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కే కేశవరావు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సీఎం రేవంత్‌రెడ్డి నియమించారు. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి కోసమే కేకేతో అధిష్టానం రాజీనామా చేయించిందని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. 

కాంగ్రెస్ విజయం ఖాయం

అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండటంతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమని చెప్పొచ్చు. తెలంగాణ నుంచి ఉన్న  ఒక్క స్థానంలో ఉత్తరాది వ్యక్తిని నిలబెట్టడంపై కొందరిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే అధిష్ఠానం నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించే అవకాశాలు లేనట్లు సమాచారం. కాగా సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన తర్వాత అభ్యర్థి పేరుపై మరింత స్పష్టత రానున్నది.