- సొంత విజ్ఞానంతో ప్రపంచస్ధాయికి ఎదిగిన మేధావి
- వంగరలో నవోదయ పాఠశాల ఏర్పాటు చేస్తాం
- పీవీ వర్ధంతి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్
భీమదేవరపల్లి, డిసెంబర్ 23 (విజయక్రాంతి): సొంత విజ్ఞానంతో దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు అంచెలంచెలుగా ఎదిగినారని, ఆయన ప్రపంచానికి మార్గదర్శి అని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పీవీ 20వ వర్ధంతి సందర్భంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో ఆయన కాంస్య విగ్రహానికి మంత్రి నివాళులర్పించారు.
అనంతరం పీవీ స్వగృహంలో నిర్వహించిన సభలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ.. వంగరలో నవోదయ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం ప్రధాని మోదీకి, కేంద్రమంత్రి బండి సంజయ్‌కి లేఖలు రాస్తామన్నారు. వంగరకు వచ్చే బ్రిడ్డి నిర్మాణానికి నిధులు సమకూరుస్తున్నామని.. వెంటనే పనులు ప్రారంభించాలని ఈఈని ఆదేశించారు. పీవీ ఇల్లు చరిత్రలో మిగిలిపోయేలా సుందరీకరిస్తామని చెప్పారు.
గ్రామంలో చెరువు సందరీకరణ పనులు వచ్చే ఏడాది వర్ధంతిలోగా పూర్తి చేస్తామని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు రూ.431 కోట్లు మంజూరు చేశామని.. కాల్వల పనులు త్వరితగతిన చేపట్టి వంగరను సస్యశ్యామలం చేస్తామన్నారు. పీవీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ పీవీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. ప్రపంచంలోని మేధావులంతా కలిసి ఎమినెంట్ పర్సన్స్ గ్రూప్‌ను 1996లో ఏర్పాటు చేశారని..
కేవలం 15 మంది ప్రపంచ మేధావులు సభ్యులుగా ఉన్న ఇందులో పీవీ రాసినవి తనకు ఇటీవలే దొరికాయన్నారు. ఇందులో గ్రామీణ ఆర్ధికవ్యవస్ధ బలోపేతం, విద్యాపరంగా భారతదేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలో పీవీ రాసుకున్నారని.. 2047 వరకు సూపర్ పవర్ భారతదేశంగా ఎలా తీర్చిదిద్దాలో లిఖిత పూర్వకంగా రాశారని చెప్పారు. సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ఎమ్మెల్సీ పీవీ కుమార్తె సురభి వాణిదేవి, సీపీ అంబర్ కిశోర్ ఝా, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.