- సైబర్ నేరాల నియంత్రణలో అగ్రస్థానం
- బాధితులతోనే ఫ్రెండ్లీ పోలీసింగ్.. నేరస్థులతో కాదు
- ఏఐ టెక్నాలజీతో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు
- సికింద్రాబాద్ ఆలయ ఘటనపై ఉద్రిక్తత పెంచడం సరికాదు
- విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు పరిహారం పెంపు
- పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 21 (విజయక్రాంతి): దేశ భద్రత, ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర ఎనలేనిదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలు, నిఘా విషయంలో తెలంగాణ పోలీసులు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన అధికారులను గుర్తు చేసుకోవడం మన బాధ్యత అని చెప్పారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే శాంతి భద్రతలు అత్యంత కీలకమని పేర్కొన్నారు.
శాంతిభద్రతలు లేని రాష్ట్రాల్లో పెట్టుబడులు రావని అన్నారు. కేఎస్ వ్యాస్, పరదేశీ నాయుడు, ఉమేశ్‌చంద్ర, కృష్ణ ప్రసాద్ లాంటి ఎందరో పోలీసు అధికారులు శాంతిభద్రతలను కాపాడటం కోసం అమరులై భావితరాలకు స్పూ ర్తిగా నిలిచారని కొనియాడారు. పోలీసు సిబ్బం ది పట్ల తనకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు.
పోలీసులు, వారి కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించాలని పేర్కొన్నారు. ఎవరి ముందో చేయి చాచే పరిస్థితి తెచ్చుకోవద్దని, విమర్శల కు అవకాశం ఇవ్వొద్దని అన్నారు. విధి నిర్వహణలో పోలీసులకు ఎలాంటి లోటులేకుండా చర్యలు తీసుకుంటామని, వారి ఖర్చులు, ఇతర ఏర్పాట్లకు నిధులు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు.
అమరులైన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచుతున్నట్టు ప్రకటించారు.
దేశానికే ఆదర్శం మన ఫోరెన్సిక్ ల్యాబ్
తెలంగాణ పోలీసు విధానాలను ఇతర రాష్ట్రాలు పాటిస్తున్నాయని, మన ఫోరెన్సిక్ ల్యాబ్ అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మన సైబర్ క్రైమ్ విభాగం దేశంలోనే గొప్పదని కేంద్ర హోంశాఖ అభినందించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం డ్రగ్స్ మహమ్మారి యువతను పట్టిపీడిస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్స్ వల్ల పంజాబ్ రాష్ట్రం అనేక కష్టాలు ఎదుర్కొంటుంది.
అక్కడ యువత డ్రగ్స్‌కు బానిసలుగా మారారని అన్నారు. రాష్ట్రంలో కూడా గత పదేళ్లలో మాదకద్రవ్యాల వినియోగం బాగా పెరి గిందని చెప్పారు. వీటి నివారణకు రాష్ట్రంలో టీజీ న్యాబ్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించా రు. నేరగాళ్లు సరికొత్త విధానాలతో ముందుకొస్తున్నారని, పెరుగుతున్న ఆధునిక సాంకేతికత ద్వారా నేరాలు చేస్తున్నారని చెప్పారు.
సైబర్ క్రైమ్‌లో చదువుకున్న వారే ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు. ఎస్‌ఐబీ లాంటి సంస్థలను ఏర్పాటు చేసి నేరాలను కట్టడి చేస్తున్నామని స్పష్టంచేశారు. నేరస్థులను కఠినంగా శిక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. శాంతిభద్రత లను చేతుల్లోకి తీసుకోద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య ను అధిగమించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)ను ఉపయోగించి చర్యలు తీసుకో వాలని పోలీసులకు సీఎం సూచించారు. ఇందుకు అవసరమయ్యే సాంకేతికత, ఇతర సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
పండుగలు ప్రశాంతంగా జరుపుకోవడంలో పోలీసుల సేవలు మరిచిపోలేమన్నారు. జీతం కోసం వారు పనిచేయడం లేదని, బాధ్యతాయుతంగా భావించి సేవలు అందిస్తున్నారని కొనియాడారు.
ఆలయంపై దాడితో అలజడులు సృష్టిస్తున్నారు
ఉన్మాదంతో కొందరు ఆలయంపై దాడి చేయడం ద్వారా అలజడులు సృష్టిస్తున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు తెలివైన వారని, ఇలాంటి వాటిపైనా అప్రమత్తంగా ఉంటారని చెప్పారు. ముత్యాలమ్మ గుడిలో జరిగిన ఘటన ఆందోళనకరమని, వెంటనే నేరానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయడం ద్వారా ఎవరినీ ఉపేక్షించబోమనే సంకేతాలను పోలీసులు ఇచ్చారని పేర్కొన్నారు.
నేరాలకు పాల్పడే వారిని తామే శిక్షించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, వారిని శిక్షించడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇటీవల జరిగిన పోలీస్ నియామకాల్లో ఉన్నత విద్య అభ్యసించిన వారు కానిస్టేబుల్, ఎస్సైలుగా చేరారని.. గొప్ప లక్ష్యం కోసం యువత పోలీస్ జాబ్‌లో చేరుతున్నారని అన్నారు. శాంతి భద్రతలు కా పాడటంలో పోలీసుల కృషిని ప్రజలు గుర్తించాలని కోరారు.
నేరస్థులతో కఠినంగా.. బాధితు లతో ఫ్రెండ్లీగా ఉండాలని పోలీసులకు సూచించారు. సీనియర్ ఐపిఎస్ అధికారి రాజీవ్ రత న్ చనిపోతే ఆయన కుమారుడికి నిబంధనలు సడలించి గ్రేడ్ టు మున్సిపల్ కమిషనర్‌గా అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.
అమర వీరులను స్మరించుకోవడం మన బాధ్యత: డీజీపీ జితేందర్
దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకోవడం మన బాధ్యతని డీజీపీ జితేందర్ అన్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది 214 మంది పోలీసులు అమరులయ్యారని చెప్పారు. తెలంగాణ నుంచి ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయరని గుర్తుచేశారు. సైబర్ నేరాలను అరికట్టడంలో తెలంగాణ పోలీసు శాఖ ముందు వరుసలో ఉందని వివరించారు.