calender_icon.png 6 January, 2025 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన ఊటీ.. కోసాయి!

02-01-2025 01:44:50 AM

  1. అడవుల జిల్లాలో ప్రకృతి అందాల కనువిందు
  2. అందాలను చీల్చుకొని వచ్చే చుక్‌చుక్ రైలు
  3. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి

ఆదిలాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్‌లో ప్రకృ తి అందాలకు కొదవలేదు. కాలంతో సంబంధం లేకుండా అక్కడి అందాలు ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తాయి. తలమడుగు, ఆదిలాబాద్ రూరల్, బేలా, భీంపూర్ మండలాల్లోని పలు గ్రామాలు ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నట్టు కనిపిస్తాయి.

ముఖ్యంగా కోసాయి గండి అటవీ ప్రాంతం ప్రకృతి అందాలకు పుట్టినిల్లు.  మంచు కురిసే వేళలో జిల్లాలోని ప్రకృతి అందాలు చూపరులను మైమరపింపజేస్తున్నాయి. జిల్లాలో ఓవైపు చలి తీవ్రత పెరుగుతుండగా మరోవైపు ఉదయం, సాయంత్రం వేళల్లో దట్టమైన పొగమంచు దృశ్యాలు కనులు తిప్పనివ్వట్లేదు. ఊటీ, కొడైకెనాల్, లంబసంగి లాంటి ప్రాంతాల్లోని ప్రకృతి అందాలను తలదన్నేలా తలమడుగు మండలంలోని కోసాయి

గండి, పల్సి (కె), రత్నాపూర్, పల్సి (బి), ఉమ్రి, ఝరి పున గూడ, దేగామ గ్రామాల అటవీ ప్రాంతంలోనూ ఆస్వాదించవచ్చు. అటు ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఖండాల ఖానాపూర్, మామిడి గూడా, మారుగుడా తదితర ఆదివాసీ గ్రామాల్లోని ప్రకృతి అందాలు ఆకట్టుకుంటున్నాయి. ఖండాల ఘాట్ అందాలు చూసేందుకు ప్రజలు తరచూ వెళ్తుంటారు.

దట్టమైన అడవిలోని పచ్చని చెట్ల మధ్యలో నుంచి పొగను వెదజల్లుతూ చుక్‌చుక్‌మంటూ వచ్చే రైలు బండిని చూస్తే ప్రకృతి ప్రేమికులు మైమరచిపోవాల్సిందే.  కోసాయి గ్రామ సమీపంలో గల సంకట మోచన హనుమాన్ ఆలయా ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చదిద్దాలని జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.