- సుప్రీంకోర్టును ఆశ్రయించిన గ్రూప్ -1 అభ్యర్థులు
- ఇప్పటికే జీవో 29పై సుప్రీం కోర్టులో పిటిషన్
- ఫైనల్ ‘కీ’పై మరోసారి సుప్రీంకోర్టుకెళ్లిన నిరుద్యోగులు
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): గ్రూప్ ---1 పరీక్షలపై నిరుద్యోగులు న్యాయ పోరాటం చేస్తున్నారు. వీరు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒకవైపు హైకోర్టు మెట్లెక్కి పోరాటం చేస్తూనే మరోవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఒకసారి జీవో -29పై సుప్రీంకోర్టుకెళ్లిన అభ్యర్థులు.. మళ్లీ ఫైనల్ ‘కీ’పై సుప్రీంకోర్టు తలుపుతట్టారు.
ఫైనల్ కీలో అనేక తప్పులున్నాయని, తమ అభ్యంతరాలను టీజీపీఎస్సీ పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ నిరుద్యోగులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. అభ్యర్థుల తరపున అడ్వకేట్ మోహిత్‌రావు సుప్రీంకోర్టులో పిటిషన్‌ను వేశారు. ఈ కేసు సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశాలున్నాయి.
ఆ పుస్తకాలను ప్రమాణికంగా తీసుకోలేమన్న టీజీపీఎస్సీ
గ్రూప్ --1 ప్రాథమిక కీని టీజీపీఎస్సీ విడుదల చేయగా 1,712 మంది అభ్యర్థుల నుంచి 6,417 అభ్యంతరాలొచ్చాయి. నిపుణుల కమిటీ సూచనల మేరకు మాస్టర్ క్వశ్చన్ పేపర్‌లో ప్రశ్న నెంబర్ 56, 59లను తొలగించారు. ప్రశ్న నెంబర్ 115కు సరైన సమాధానం ఆప్షన్ 2 నుంచి 1 సరైనది సమాధానంగా మార్చారు. అయితే అభ్యర్థులు మొత్తం 13 ప్రశ్నల ఆన్సర్లపై అభ్యంతరాలు లేవనెత్తారు.
ప్రశ్న నెంబర్లు 35, 41, 45, 59, 64, 66, 67, 79, 95, 106, 116, 119, 139 అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని కోర్టుముందుంచారు. ‘కీ’పై విచారణ సమయంలో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రమాణికం కాదని హైకోర్టుకు టీజీపీఎస్సీ తెలిపింది.
గూగుల్, వికీపీడియాను ప్రామాణికంగా తీసుకుని ‘కీ’ని ఖరారుచేసినట్లు కోర్టుకు టీజీపీఎస్సీ గతంలో తెలిపింది. ప్రభుత్వ సంస్థ ముద్రించిన పుస్తకాలు ప్రామాణికం కాదంటే ఎలా అంటూ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
గ్రూప్ హైకోర్టులో 15 కేసులు.
గ్రూప్--1పైహైకోర్టులో దాదాపు 15 కేసులు విచారణలో ఉన్నాయి. ఈ కేసుల్లో కొన్ని డివిజన్ బెంచ్, మరికొన్ని సింగిల్ బెంచ్ విచారణలో ఉన్నాయి. గ్రూప్ --1 మెయిన్స్ పరీక్షల సమయంలో అభ్యర్థులు జీవో -29ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును గతంలో ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టులోని కేసులు తేలే వరకు గ్రూప్ --1 మెయిన్స్ ఫలితాలు విడుదల చేయవద్దని స్పష్టం చేసింది.
అలాగే హైకోర్టు ఈ కేసులను త్వరగా విచారించాలని ఆదేశాలిచ్చింది. ఈక్రమంలోనే ఈనెల 21 గురువారం గ్రూప్ సంబంధించిన ఐదు పిటిషన్లను విచారించిన హైకోర్టు ఈ నెల 26న తుది విచారణ జరుపుతామని ప్రకటించింది.
అయితే అభ్యర్థులు ఒకవైపు హైకోర్టులో న్యాయపోరాటం చేస్తూనే, మరోవైపు సుప్రీంకోర్టులోనూ పోరాటానికి సిద్ధమయ్యారు. జీవో -29 సహా, ఫైనల్ ‘కీ’పై గల కేసుల్లో న్యాయం తమవైపే ఉందని అభ్యర్థులంటున్నారు. రెండు కోర్టుల్లోను తమకే అనుకూలంగా తీర్పువస్తుందని అభ్యర్థులు ధీమా వ్యక్ంత చేస్తున్నారు.