18-03-2025 10:23:04 PM
కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాసరావు..
కూసుమంచి (విజయక్రాంతి): ఎన్నో ఏళ్లుగా మాదిగల ఆకాంక్షను సఫలం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని కూసుమంచి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొండ శ్రీనివాస్ రావు అన్నారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడంతో తెలంగాణ మాదిగ జాతికి ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చాడు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాదిగ జాతి తరపున ధన్యవాదాలు తెలియజేశారు.
చేవెళ్ల డిక్లరేషన్ లో భాగంగా ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి కోర్టు తీర్పు వచ్చిన రోజే అసెంబ్లీలో ప్రకటించి వెనువెంటనే క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి కమిటీ యొక్క సూచనలు మేరకు ఏకసభ్య కమిషన్ను నియమించి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు తీసుకోవలసిన చర్యలు అన్నీ తీసుకుని అసెంబ్లీలో వర్గీకరణపై చర్చ చేసి క్యాబినెట్ సమావేశంలో ఆమోదింపజేసి మాదిగలకు న్యాయం చేయాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం హర్షణీయమని అన్నారు.
రానున్న రోజుల్లో మాదిగ జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ రంగాలలోనే కాక చట్టసభలో, నామినేటెడ్ పదవుల్లో కూడా మాదిగ జాతికి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 45 సంవత్సరాలుగా జరిగిన అన్యాయం తొలగిపోయి జనాభా దామాషా ప్రకారం అన్ని పదవుల్లోనూ మాదిగలకు వాటా లభిస్తుందని విశ్వాసం ఉందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.