హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24 (విజయక్రాంతి): మధురానగర్‌లోని మేము నివసం ఉండే ఇల్లు బఫర్ జోన్‌లో లేదని.. కృష్ణాకాంత్ పార్కు దిగువన ఉన్న వేలాది ఇళ్ల తర్వాత తన ఇల్లు ఉందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. తన ఇల్లు బఫర్ జోన్‌లో ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
మధురానగర్‌లో గత 4 దశాబ్దాలుగా తాము ఉంటున్న ఇంటిని తన నాన్న ఏపీవీ సుబ్బయ్య 1980లో నిర్మించారన్నారు. ఒకప్పటి పెద్ద చెరువులోనే రెండున్నర దశాబ్దాల క్రితం కృష్ణాకాంత్ పార్క్ నిర్మించారని తెలియజేశారు. అయితే తమ ఇల్లు మాత్రం ఆ చెరువు కట్టకు దాదాపు కిలోమీటరు దూరంలో ఉంటుందన్నారు. ఇరిగేషన్ నిబంధనల ప్రకారం చెరువు కట్టకు దిగువన 10 మీటర్లు దాటితే కిందనున్న నివాసాలన్నీ బఫర్ జోన్ పరిధిలోకి రావన్నారు.
ఇరిగేషన్ నిబంధనల ప్రకారం తన ఇల్లు చెరువుకట్టకు కిలోమీటరు దూరం ఉండ టంతో తన ఇల్లు ఎట్టి పరిస్థితిలో బఫర్ జోన్‌లోకి రాదన్నారు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే వాళ్లు ఈ వాస్తవాలను గ్రహించాలన్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాకు మ్యాపింగ్ ఫొటోలను విడుదల చేశారు.