calender_icon.png 3 April, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా జాతకాలు చాలా బాగున్నాయ్

02-04-2025 12:00:00 AM

ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించిన చి త్రం ‘సారంగపాణి జాతకం’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. “నేను ప్రామిస్ చేసి చెబుతున్నా.

అందరినీ నవ్వించే సినిమా ఇది. ఇంద్రగంటి దర్శకత్వంలో నటించాలన్న నా కల ‘సారంగపాణి జాతకం’తో తీరింది. ఆయనతో పనిచేయడమంటే ఫేవరెట్ టీచర్ దగ్గర చదువుకోవడం లాంటిదే. మా యూనిట్ అందరి జాతకాలు చాలా బాగున్నాయి.. మేం చక్కని విజయాన్ని అందుకోబోతున్నాం” అన్నారు. కథానాయిక రూప కొడువా యూర్ మాట్లాడుతూ.. ‘నాకు జాతకాల మీద నమ్మకం ఉండేది కాదు.

నేను గతంలో నా ఫేవరెట్ డైరెక్టర్ మోహనకృష్ణ అని చెప్పా. ఊహించనివిధంగా ఆయన సినిమాలో నటించే ఆఫర్ రావడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది’ అని చెప్పింది. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ.. “సారంగపాణి జాతకం’ సకుటుంబ సపరివార సమేతంగానే కాక పరకుటుంబ సమేతంగా కూడా చూడదగ్గ చక్కని హాస్యభరిత సినిమా. అందరూ తెలుగువారు నటించిన పరిపూర్ణమైన తెలుగు సినిమా ఇది’ అని తెలిపారు.

నిర్మాత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. “జంధ్యాలతో ‘చిన్నోడు-పెద్దోడు’, ‘ఆదిత్య 369’ సినిమాలు రాయించుకున్నా. ఆయతో ఒక కామెడీ సినిమా తీయాలనుకున్నా. కానీ కుదరలేదు. మంచి కామెడీ సినిమా తీయాలన్న కోరిక ‘సారంగపాణి జాతకం’తో తీరింది. కేవలం జాతకాలనే నమ్మొద్దు.. మనం చేయాల్సింది మనం చేయాలని చెప్పే సినిమా ఇది” అన్నారు. ఈ కార్యక్రమంలో మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.