calender_icon.png 28 October, 2024 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనవాళ్లు మళ్లీ 100 బిలియన్లు పంపారు

27-06-2024 02:03:50 AM

  • వరుసగా రెండో ఏడాది ప్రవాస భారతీయుల రికార్డు రెమిటెన్సులు

న్యూఢిల్లీ, జూన్ 26: ప్రవాస భారతీయులు దేశంలోకి వరుసగా రెండో ఏడాది 100 బిలియన్ డాలర్లుపైగా పంపారు. 2022 తొలిసారిగా 100 బిలియన్ డాలర్లకుపైగా దేశంలోకి రెమిటెన్సులు తరలిరాగా, 2023 సైతం  ఇవి 100 బిలియన్ డాలర్లను మించాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో రికార్డుస్థాయిలో 111 బిలియన్ డాలర్లు భారత్‌లోని వారి సన్నిహిత బంధువులకు పంపినట్టు  యునైటెడ్ నేషన్స్ మైగ్రేషన్ ఏజెన్సీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) విడుదల చేసిన రిపోర్ట్ తెలిపింది. ఉత్తర అమెరికా, యూరప్‌ల్లో ఉంటున్న ప్రవాస భారతీయ ఐటీ నిపుణులు అత్యధికంగా రెమిటెన్సుల్ని స్వదేశంలోకి పంపుతున్నారు.

ఎన్నారైల 100 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు విదేశీ ఇన్వెస్టర్ల నికర పెట్టుబడులకు రెట్టింపు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు కలిపి 54 బిలియన్ డాలర్లు దేశంలోకి వచ్చాయి. రెమిటెన్సులపై ఆర్బీఐ నిర్వహించిన సర్వే ప్రకారం యూఎస్ నుంచి అత్యధికంగా 23 శాతం రెమిటెన్సులు వచ్చాయి. గల్ప్ ప్రాంతం నుంచి రెమిటెన్సులు తగ్గుతున్నాయి. రెమిటెన్సులు పొందుతున్న ఎన్నారైల బంధువులు చాలావరకూ కుటుంబ అవసరాలకు వినియోగి స్తుండగా, కొంత మొత్తాన్ని డిపాజిట్లు, ఇతర ఆస్తుల్లో పెట్టుబడి చేస్తున్నారు.  ప్రవాసుల రెమిటెన్సులు పొందుతున్న దేశాల్లో అగ్రస్థానం భారత్‌దేనని ఇటీవల ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ఒకటి వెల్లడించింది. తదుపరిస్థానాల్లో మెక్సికో, చైనా, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్‌లు ఉన్నాయి.

టాప్‌లో ఇండియా

ప్రపంచంలో ఏ ఇతర దేశాలకన్నా భారత్‌లోకి తరలివచ్చిన రెమిటెన్సులే అధికం. రెమిటెన్సులు అధికంగా అందుకున్న దేశాల్లో భారత్ తర్వాతిస్థానాల్లో మెక్సికో, చైనా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్‌లు ఉన్నాయి.  భారత్‌లోకి రెమిటెన్సుల ప్రవాహం క్రమేపీ పెరుగుతున్నదని ఐఓఎం నివేదిక తెలిపింది. 2010లో భారత్‌లోకి 53.48 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు రాగా, 2015లో అవి 68.91 బిలియన్ డాలర్లకు, 2020లో 83.15 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2022లో 111.22 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇతర దేశాలకు వలస వెళుతున్న కార్మికులు, ఉద్యోగుల్లో దక్షిణాసియా దేశాల నుంచి అధికమని, అందుచేత అంతర్జాతీయ రెమిటెన్సులు పొందుతున్న టాప్ దేశాల్లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు ఉన్నాయన్నది. 

1.8 కోట్ల మంది విదేశాలకు వలస

మైగ్రేషన్ ట్రెండ్స్‌ను ఐఓఎం రిపోర్ట్ వివరిస్తూ భారత జనాభాలో 1.3 శాతం (1.8 కోట్లు) విదేశాలకు వలస వెళ్లారని, ఇందులో ఎక్కువమంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్, సౌదీ అరేబియాల్లో ఉన్నారని వెల్లడించింది. అలాగే విదేశీయులు తరలివచ్చే దేశాల్లో భారత్ 13వ స్థానంలో ఉన్నదని, 44.8 లక్షల మంది ఇతర దేశాల నుంచి వచ్చి భారత్‌లో నివసిస్తున్నారని పేర్కొంది.