calender_icon.png 9 November, 2024 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాకొద్దీ ప్రభుత్వాలు!

09-07-2024 12:00:00 AM

వేణు బెక్కం :

భారత్ నుంచి అమెరికా దాకా అన్ని ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుల్లో ఒకటే అంశం కనిపిస్తున్నది. ‘మాకు మార్పు కావాలి. భావోద్వేగాలు వద్దు.. బాధ్యత తీసుకొనే వారు కావాలి. ఉపాధి కావాలి. సంస్కరణలు కావాలి. చక్కటి జీవితాన్ని ఇచ్చే పాలన కావాలి’ అని ఓటర్లు తేల్చి చెప్తున్నట్టు అర్థమవుతున్నది. 

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ దేశాల్లోని ప్రభుత్వాలను మార్చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న నేతలంతా ఇంటిదారి పడుతున్నారు. ఇప్పటికే బ్రిటన్, ఫ్రాన్స్, ఇరాన్‌లలో ప్రభుత్వాలు మారిపోయాయి. డిసెంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ మార్పు తప్పదనే వాదన ఊపందుకున్నది. ప్రజల్లో ఇంత తిరుగుబాటు ఎందుకు వచ్చినట్టు? ప్రాంతాలకు అతీతంగా ప్రజలు ఏం కోరుకొంటున్నారు?

భారత్‌తో మొదలు

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం. ఇక్కడ గత ఏప్రిల్ నుంచి జూన్ వరకు సుదీర్ఘకాలం సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. మూడోసారి అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగిన బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ 400 ఎంపీ సీట్లు గెలుస్తామని ఘంటాపథంగా చెప్పారు. ప్రచారం కూడా అదే ఎత్తున చేశారు. కానీ, ప్రజలు బీజేపీని ఎన్నికల్లో తిరస్కరించారు. కనీసం 2019 ఎన్నికల్లో ఇచ్చినన్ని సీట్లుకూడా ఇవ్వలేదు. చివరకు ఎన్డీయే మిత్రపక్షాల మద్దతుతో మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

ఇరాన్, యూపీ, ఫ్రాన్స్..

మే నెలలో ఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత జూన్‌లో జరిగిన ఎన్నికల్లో ఆ దేశ మతపెద్దకు ప్రజలు షాకిచ్చారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలి ఖొమేనీకి దివంగత రైసీ అత్యంత సన్నిహితుడు. నిజానికి ఆ దేశంలో ఖొమేనీ ఆశీర్వాదం ఉంటేనే ఎన్నికల్లో గెలుస్తారనే ప్రచారం ఉన్నది. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు పోటీ పడాలన్న దానిపై ఇరాన్ మత పెద్దల సంఘానిదే తుది నిర్ణయం. ఆ సంఘం కూడా ఖొమేనీ కనుసన్నల్లోనే నడుస్తుంది. రైసీ మరణానంతరం ఈ సంఘం ఆరుగురు అధ్యక్ష అభ్యర్థులను ఎంపిక చేసింది. అందులో అత్యధికులు ఖొమేనీ అనుయాయులే.. పేరుకు అధ్యక్ష ఎన్నికలు నిర్వహించినా.. ఎటొచ్చీ తన మనుషులే గెలువాలన్న ఉద్దేశమే ఇందులో కనిపిస్తుంది. ఒక రకంగా తన వాళ్లను తప్ప ఎవరినీ ఎన్నుకొనేందుకు ప్రజలకు వీలు లేకుండా చేసినా ఫలితం మాత్రం ఖొమేనీకి వ్యతిరేకంగానే వచ్చింది.

ఖొమేనీకి నమ్మిన బంటు లాంటి సయీద్ జలీలీని ఓడించి సంస్కరణవాది అయిన మసౌద్ పెజెష్కియన్‌కు ఇరాన్ ప్రజలు పట్టం గట్టారు. దేశంలో మార్పు కోరుకొంటున్నామని ఓటుద్వారా స్పష్టంగా చెప్పారు. ఇటీవల వెల్లడైన బ్రిటన్ ఎన్నికల్లోనూ ఇలాంటి తీర్పే ఇచ్చారు. 14 ఏండ్లుగా అధికారంలో ఉన్న సంప్రదాయ కన్జర్వేటివ్ ప్రభుత్వాన్ని గద్దె దింపి లేబర్ పార్టీకి బ్రిటన్ ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చారు. సోమవారం వెల్లడైన ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల్లోనూ ఇదే ఫలితం వచ్చింది. దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నేతృత్వంలోని సంప్రదాయ వాద నేషనల్ రాలీ (ఆర్‌ఎన్) పార్టీని ఫ్రాన్స్ ప్రజలు తిరస్కరించారు. వామపక్ష కూటమికి పట్టం గట్టారు. మరో యూరప్ దేశం నెదర్లాండ్స్‌లోనూ అదే జరిగింది. 14 ఏండ్లుగా ప్రధానిగా దేశాన్ని ఏలిన మార్క్ రుట్టేను ఆ దేశ ప్రజలు ఇంటికి పంపించారు.

అమెరికాలో గందరగోళం

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు అనగానే ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తుంటుంది. ఆ దేశంలో ఎన్నికైన అభ్యర్థినిబట్టే ప్రపంచ వ్యవహారాల్లో మార్పులు చోటుచేసుకొంటాయి కాబట్టి, ఆ దేశ అధ్యక్ష ఎన్నికలకు అంత క్రేజ్ ఉంటుంది. నాలుగేండ్ల క్రితం అధ్యక్ష పదవికి పోటీ పడ్డ నేతలే ఈసారి కూడా పోటీలో ఉన్నారు. రిపబ్లికన్ల అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఎదురెదురు నిలిచారు. వీరిద్దరూ 70 ఏండ్లు పైబడిన నేతలే. అయితే, ఎన్నికల ప్రచారం జోరందుకున్న ప్రస్తుత కీలక సమయంలో అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయన పబ్లిక్ మీటింగుల్లో ప్రవర్తిస్తున్న తీరుతో డెమోక్రాట్లు బెంబేలెత్తుతున్నారు. మొన్నటికి మొన్న ట్రంప్‌తో జరిగిన తొలి ప్రెసిడెన్షినల్ చర్చలో బైడెన్ ఘోరంగా విఫలమయ్యారు. దీంతో బైడెన్‌ను మార్చి ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్లు సొంత పార్టీలోనే ఊపందుకొన్నాయి.

డెమోక్రాట్లకు విరాళాలు ఇచ్చేవారు కూడా ఇందుకోసం ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. దీంతో ఈసారి ట్రంప్ గెలుపు నల్లేరుమీద నడకే అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గాజాలో మారణహోమం సృష్టిస్తున్న ఇజ్రాయెల్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ప్రధాని నెతన్యాహూకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ప్రజలు భారీ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నిజానికి కొన్ని నెలల క్రితం ఇజ్రాయెల్‌పై హమాస్ సంస్థ చేసిన భీకర దాడిని ప్రపంచమంతా ఖండించింది. గాజాపై ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధానికి అనేక దేశాలు మద్దతు ప్రకటించాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. దాడుల్లో వేలమంది అమాయక పాలస్తీనియన్లు చనిపోతుండటంతో ఇజ్రాయెల్‌పై ఈసడింపులు పెరిగాయి. ఇజ్రాయెల్ ప్రజలే యుద్ధాన్ని ఆపాలని ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ యుద్ధాన్ని అడ్డం పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో గెలువాలని నెతన్యాహూ భారీ ప్లానే వేశారు. కానీ, ఈసారి ఆయనను ఇంటికి పంపటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

భావోద్వేగం కాదు.. ఉపాధి కావాలి

భారత్ నుంచి అమెరికా దాకా అన్ని ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుల్లో ఒకటే అంశం కనిపిస్తున్నది. ‘మాకు మార్పు కావాలి. భావోద్వేగాలు వద్దు.. బాధ్యత తీసుకొనే వారు కావాలి. ఉపాధి కావాలి. సంస్కరణలు కావాలి. చక్కటి జీవితాన్ని ఇచ్చే పాలన కావాలి’ అని ఓటర్లు తేల్చి చెప్తున్నట్టు అర్థమవుతున్నది. ఇరాన్‌లో మోరల్ పోలీసింగ్‌పై ప్రజలు ఎన్నాళ్లుగానో పోరాటం చేస్తున్నారు. అది ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించింది. బ్రిటన్‌లో సంప్రదాయ కన్జర్వేటివ్‌ల (టోరీలు)ను కూడా అదే తీరున తిరస్కరించారు. ‘కుబేరులకు కొమ్ముకాసే సర్కారు మాకొద్దు’ అని స్పష్టంచేశారు. ఫ్రాన్స్‌లోనూ అదే వేవ్ కొనసాగింది. అధ్యక్షుడు మాక్రాన్ అతి జాతీయ వాదాన్ని ప్రజలు తిరస్కరించారు.

ఐదేండ్ల క్రితం యూరప్ ఖండంలోని అనేక దేశాల్లో జాతీయవాద పార్టీల హవా కొనసాగింది. భావోద్వేగాలకు లోబడి ప్రజలు నాడు ఓట్లు వేశారు. ఈ ఐదేండ్లులో ఆర్థిక మందగమనంతో సంప్రదాయ వాద పార్టీల ప్రభుత్వాల డొల్లతనం బయటపడింది. ఆర్థిక సంక్షోభాలను ఆయా ప్రభుత్వాలు ఎదుర్కోలేక చతికిల పడ్డాయి. భారత్‌లోనూ అదే జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలపై సంప్రదాయవాద ప్రభుత్వాలు మోయలేని పన్నుల భారాన్ని వేశాయి. దీంతో భావోద్వేగాలతో కడుపు నిండదని, ఉపాధి, ఉద్యోగాలు కావాలని ప్రజలు ఈసారి స్పష్టంగా తీర్పులిస్తున్నారు. ముంన్ముందు కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందేమో చూడాలి.   

 వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు

భావోద్వేగాలతో పెరిగిన అభిమానం

చలాది పూర్ణచంద్రరావు :

రానున్న అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య ఇటీవలి వరకు పెద్దగా చెప్పుకోదగ్గ విధానపరమైన చర్చలు లేవు. హామీలూ లేవు. ప్రపంచ దేశాల్లో కూడా ఈ ఎన్నికల పట్ల పెద్ద ఆసక్తి కూడా లేదు. కానీ, ఎప్పుడైతే మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను హత్య చేసేందుకు దుండగుడు కాల్పులు జరిపా డో అప్పటి నుంచి ఎన్నికల ప్రచారం ఓ మలుపు తిరిగింది. నాటినుండి యావత్ ప్రపంచం ఈ ఎన్నికల వైపు ఆసక్తిగా చూపు ఎక్కుపెట్టింది. కాల్పుల తర్వాత ట్రంప్ గురించే కాదు, ఆయన తరఫు ఉపాధ్యక్ష అభ్యర్థిగా మరో భారతీయ మూలాలున్న వ్యక్తి రిపబ్లికన్ పార్టీ నుండి రంగంలోకి వచ్చారు.

ట్రంప్‌పై దుండగు డు జరిపిన కాల్పులకు పరోక్షంగా అధ్యక్షుడు బైడెన్‌కు సంబంధం ఉందంటూ ఆరోపణలు చేసిన ఆయనే జె.డి.వాన్స్. ‘ట్రంప్‌పై కాల్పులు జరిపించింది బైడెన్’ అని తీవ్రంగా పదేపదే ఆరోపించిన వాన్స్ ని రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ ప్రకటించాడు. అయితే, ఈ వాన్స్ భార్య తణుకు (ఆంధ్రప్రదేశ్) పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలోని వడ్లూరుకు చెందిన శాస్త్రీయ సద్బ్రాహ్మణ వంశానికి చెందిన చిలుకూరి రామశాస్త్రి మనుమరాలు ఉష చిలుకూరి. దీంతో వాన్స్ తెలు గింటి అల్లుడుగా గుర్తింపులోకి వచ్చారు. భారతీయులు ముఖ్యంగా తెలుగు ప్రవాసీయులు అయన అభ్యర్థిత్వం పట్ల ఎక్కు వ ఆసక్తి చూపుతున్నారు. పైగా మోదీతో స్నేహ సంబంధాల ద్వారా కూడా వారు ట్రంప్ విజయాన్ని కోరుకుంటున్నారు.

తెలుగువారి ఆడపడుచు ఉష చిలుకూరి

ఇక, తెలుగు వారి అడపడుచు ఉష భర్తకు ఎంతో అండగా ఉంటున్నారు. ఆమె శాండియాగోలోని మిడిల్ క్లాస్ కమ్యూనిటీలో పెరిగారు. యేల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్, కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయం నుంచి ఎంఫిల్ చేశారు. యేల్ లా స్కూల్లో న్యాయశాస్త్రం చదివేప్పుడు ‘సోషల్ డిక్లెన్ ఇన్ వైట్ అమెరికా’ అనే కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నా రు. ఆ సమయంలో ఉషకు జేడీ వాన్స్ పరిచయం అయ్యారు. అది ప్రేమగా మారి, పెండ్లికి దారి తీసింది. వాన్స్ క్యాథలిక్ మతాన్ని అనుసరిస్తుండగా, ఉష మాత్రం హిందూ మత విశ్వాసాలను కచ్చితంగా ఆచరిస్తారు. ఉష అమెరికా సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ దగ్గర కొంతకాలం ఉద్యోగినిగా పనిచేశా రు.

అనంతరం లాయర్‌గా ప్రాక్టీస్ చేస్త్తూ ప్రముఖ లా మేకర్‌గా ప్రసిద్ధి చెందారు. చదువు, ఉద్యోగాల్లో మంచి ప్రతిభ చూపి న ఆమె, రాజకీయాల్లో కూడా భర్తకు అండగా ఉంటూ మంచిపేరు తెచ్చుకున్నారు. ఉషను ‘యేల్ యూనివర్సిటీ ఆధ్యాత్మిక గురువు’గా ఆమె భర్త అభివర్ణిస్తుంటారు. ఎందుకని ప్రశ్నించిన వాళ్లకు ‘నాకు కూడా తెలియని ప్రశ్నలను ఆమె అర్థం చేసుకుంటుంది’ అని బదులిస్తారు. ఓహి యో సెనేటర్‌గా ఉన్న వాన్స్ పలు ఇంటర్వ్యూల్లో ‘నా భార్యే నా ధైర్యం’ అని చెప్పారు .

‘నేను చాలా తెలివైన వాడినని సగర్వంగా ఫీలైనప్పుడు ఆమె గుర్తుకొస్తే అది నీరుగారి పోతుంది. ఎందుకంటే, ఆమె నాకంటే తెలివైంది. ఆమె వెయ్యి పేజీల పుస్తకాన్ని కొన్ని గంటల్లోనే చదివేయగలదు’ అని వాన్స్ ఉషను పొగిడిన సందర్భాలెన్నో. ఇప్పుడూ ఎన్నికల సభల్లో, ఇంటర్వ్యూల్లో ఉష ప్రదర్శిస్తున్న తెలివిని, సమయస్ఫూర్తిని ప్రశంసిస్తున్నారు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచి, జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడు అయితే, ఆయన నిర్ణయాల్లో ప్రవాస భారతీయుల సంక్షేమానికి ట్రంప్‌తోపాటు ఉషద్వారా వాన్స్ మార్క్ కూడా ఉంటుందనేది కాదనలేని వాస్తవం. కాగా, డెబ్బయ్యో దశకం చివరి రోజుల్లో ఉష తల్లిదండ్రులు అమెరికా వలస వెళ్లారు. ఉష అమెరికాలోనే పుట్టి పెరిగింది.

వివాదాస్పద ఫొటో

దుండగుడు ట్రంప్‌పైకి తుపాకి కాల్చినప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ నా ప్రియమిత్రుడు ట్రంప్ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఆ దాడిని తీవ్రంగా ఖండించారు.  దీనిని పరిశీలిస్తే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన ట్రంప్ విజయాన్ని మోదీ  పరోక్షంగా కోరుకుంటున్నారని అర్థమవుతుందని పరిశీలకుల విశ్లేషణ. తాజాగా ప్రచారంలో హారీస్ దూసుకెళుతున్నట్లు తెలుస్తున్నా, ఆమె నల్లజాతి కాద ని భారత మూలాలున్న మహిళ అంటూ ఆమె చీరకట్టు, బొట్టుతో వున్న ఫొటోను ఇటీవల ట్రంప్ ప్రచారకర్తలు విడుదల చేసిన వివాదాస్పద ప్రకటన హారీస్ విజయావకాశాలను బాగా దెబ్బతీసిందని పరిశీలకుల అంచనా.ఇది అమెరికన్లలో కొంత వెనకడుగు వేయించింది. ఇక, ప్రవాస భారతీయులు మాత్రం ట్రంప్‌వైపే మొగ్గు చూపుతున్నట్లు వెల్లడవుతు న్నది. ఫలితంగా, తాజా అంచనాలనుబట్టి  ట్రంప్, వాన్స్‌లకే రానున్న అమెరికా ఎన్నికల్లో విజయావకాశాలు ఖాయంగా ఉన్నాయని చెప్పాలి.

ట్రంప్‌వైపే ఎన్‌ఆర్‌ఐల మొగ్గు

2023 గణాంకాల ప్రకారం యునైటెడ్ స్టేట్స్‌లో కోటీ 27 లక్షలమంది భారతీయ గ్రీన్ కార్డుదారులు ఉండగా, అందులో 90 లక్షలమంది అమెరికా పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. వీరికి ‘మోదీ హౌడీ’  మెగా ఈవెంట్‌తో ఆయనపట్ల అభిమానం ఉప్పొంగింది. అలాగే, గుజరాత్‌లో ట్రంప్ గౌరవార్థం నిర్వహించిన మరో భారీ ఈవెంట్ ‘నమస్తే ట్రంప్’ కలిసి రెండు దేశాల ప్రజల్లో భావోద్వేగాలు పెరిగాయి. ఈ పరిస్థితి ట్రంప్‌ను విజయావకాశాల చేరువకు చేర్చటం ఖాయమని చెప్పక తప్పదు.

అమెరికాకు చెందిన ప్రవాస భారతీయులు భారత జాతీయురాలినని చెప్పుకోలేని కమలాదేవి హరీస్‌కంటే భారతీయులపట్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో స్నేహం వున్న ట్రంప్‌పట్లనే మొగ్గు చూపుతున్నారని చెప్పాలి. దీనికి ‘మోదీ హౌడీ’, ‘నమస్తే ట్రంప్ ’ మెగా ఈవెంట్లే అయన విజయానికి మూలం అని, ఈ నమ్మకంతోనే అటు శ్వేత జాతీయులు, ఇటు ప్రవాస భారతీయులు ట్రంప్ విజయం తథ్యమన్న ధీమాతో ఉన్నట్లు సమాచారం.

వ్యాసకర్త సెల్: 9491545699