calender_icon.png 3 March, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా లక్ష్యం.. ఆర్థిక స్వేచ్ఛ!

02-03-2025 12:03:49 AM

‘అసమానతలు లేని సమాజం అవసరం. మహిళలు ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే తమదైన ముద్ర వేయాలి. సరికొత్త ఆలోచనలతో సమాజంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి’ అంటున్నారు వీణూ డైరెక్టర్, రచయిత శ్రీ ఊహా. ఈతరం అమ్మాయిలకు మార్గనిర్దేశం చేస్తూ.. స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా వీ-హబ్ కార్యాచరణ గురించి, తన రచనల విశేషాల గురించి ‘విజయక్రాంతి’తో పంచుకున్నారిలా.. 

ఒక్క ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది. ఇన్వెస్టర్లను రప్పిస్తుంది. మార్కెట్‌ను పరిచయం చేస్తుంది. విశ్వ విపణికి దారి చూపుతుంది. కొత్త అవకాశాలను చేరువచేస్తుంది. ఆలోచన నుంచి అద్భుత విజయం వరకూ.. మహిళలను వేలు పట్టుకుని నడిపిస్తున్నది వీ-హబ్.

వీ-హబ్ డైరెక్టర్‌గా గ్రామీణ మహిళలకిచ్చే సలహా?

గ్రామీణ మహిళలకు నేను చెప్పేది ఒక్కటే. స్వయం ఉపాధితో పైకి ఎదగాలి. కేవలం ఉపాధి కోసం కాకుండా చిన్నస్థాయిలో బిజినెస్‌ను ప్రారంభించి, ఆర్థిక స్వేచ్ఛను సాధించాలి. ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుని, వాటిని సద్వినియోగం చేసుకోవాలి. బిజినెస్ నైపుణ్యాలకు పదును పెట్టడంలో వీ-హబ్ గ్రామీణ మహిళలకు తోడుగా ఉంటుంది. ముఖ్యంగా వీ-హబ్ నిర్వహించే వీ-రిసెర్చ్, ప్రాజెక్ట్ ఇన్‌క్లూషన్ వంటి కార్యక్రమాలను ఉపయోగించుకుంటే చాలా విషయాలు నేర్చుకుంటారు.  

బిజినెస్‌లో మహిళలు రాణించాలంటే ఇంకా ఏం చేయాలి?

బిజినెస్‌లో రాణించాలంటే ప్రారంభించేముందు దానిపై స్పష్టమైన అవగాహన అవసరం. ఏ బిజినెస్‌లో అయిన నమ్మకం, నాణ్యత అనేది చాలా ప్రధానమైనవి. మన వ్యాపారం, మన కస్టమర్లు ఎవరు అనేదానిపై కచ్చితమైన అవగాహన ఉండాలి. వ్యాపారంలో వెంటనే లాభాలు రాకపోతే నిరుత్సాహ పడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకువెళ్లాలి.

వెనకడుగు వేయకుండా ప్రతి సవాలును అవకాశంగా మార్చుకోవాలి. బిజినెస్ మొదలుపెట్టే ముందు మార్కెటింగ్, డిజిటల్ స్కిల్స్, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్‌లో ట్రైనింగ్ తీసుకోవాలి. గ్రామీణ మహిళలకు వీ-హబ్స్, వీ-రిసెర్చ్, వీ-లీడ్స్ వంటి కార్యక్రమాల ద్వారా మా సంస్థ అవగాహన కలిగిస్తున్నది. టెక్నాలజీని ఉపయోగించుకుంటే ఇంకా మంచి ఫలితాలు కనిపిస్తాయి.

రచయితగా మీకు స్ఫూర్తి ఎవరు? 

అవును.. నాకు చిన్నప్పటి నుంచి రచనలు అంటే చాలా ఇష్టం. విశ్వనాథ సత్యనారాయణ రచనల్లో భారతీయత, చారిత్రిక విశ్లేషణ, తాత్వికత స్పష్టంగా కనిపిస్తాయి. ‘వేయి పడగలు’ లాంటి నవలలు సమాజాన్ని ప్రతిబింభించడంతోపాటు భారతీయ సంస్కృతి గురించి లోతైన అర్థాన్ని అందిస్తాయి. అలాగే కాళోజీ కవితలు అంటే చాలా ఇష్టం. తెలంగాణ ప్రజల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప ప్రజాకవి. వారి రచనల ప్రభావం నాపై పడింది. 

మీరు రాసిన పుస్తకాలు?

మానవ సంబంధాలు, సామాజిక అంశాలు, మహిళా సాధికారతపై రెండు రచనలు చేశా. ఒకటి ఇసుక అద్దం.. రెండోది బల్కావ్. మొదటిది మహిళల ఆత్మవిశ్వాసం, సహనం, సామాజిక సమానత్వంపై కథల రూపంలో రాశాను. రెండోది సామాజిక మార్పు, యువత భవిష్యత్తు, సమాజంపై వ్యక్తుల ప్రభావం వంటి అంశాలను ప్రతిబింభిస్తుంది. ఇవి కథల రూపంలో ఉన్నప్పటికీ, వాస్తవ సంఘటనల ఆధారంగా రాశా.

ఈ రెండు రచనలకు చాలా అవార్డ్స్ వచ్చాయి. యండమూరి వీరేంద్రనాథ ఉగాది పురస్కారం, హాసిని రామచంద్ర లిటరరీ అవార్డు, వాయిస్ ఆఫ్ తెలంగాణ అవార్డు, ఇన్‌స్పైరింగ్ విమెన్ ఆఫ్ తెలంగాణ పుస్తకంలో 50 మంది స్ఫూర్తిదాయకమైన మహిళల్లల్లో నా పుస్తకం ఉంటుంది. 

పుస్తకాలు రాయాలని ఎందుకు అనిపించింది?

చిన్నప్పటి నుంచి చాలా కథలు చదివాను. కథల ద్వారా, నవలల ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నా. ఒక విధంగా నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేయడంలో వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ నమ్మకంతోనే కథలు రాయడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి నా చుట్టూ జరిగిన యదార్థ సంఘటనలను ఆధారం చేసుకుని కథలు రాస్తున్నా. 

గ్రామీణ మహిళల్లో..

గ్రామీణ మహిళల్లో వీ-హబ్ పట్ల అవగాహన మెరుగుపడుతుంది. ముఖ్యంగా స్టూడెంట్ ప్రోగ్రామ్స్, వీ-రిసెర్చ్, ప్రొజెక్ట్ ఇన్‌క్లూషన్, వీ-లీడ్స్ లాంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ మహిళలకు డిజిటల్ స్కిల్స్, ఆర్థిక అంశాలు, స్టార్టప్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. యువతులను విద్యార్థి దశ నుంచే ఆంత్రప్రెన్యూర్‌షిప్ దిశగా ప్రోత్సహించాలన్నది వీ-హబ్ ఆలోచన. ఈ వేదికను జిల్లాలకూ విస్తరించడం వల్ల గ్రామీణ మహిళలకు ఎంతో మేలు జరుగుతున్నది.

 రూప