calender_icon.png 13 November, 2024 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మాయిలు అదరహో

17-06-2024 12:05:00 AM

బెంగళూరు: స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 143 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. స్మృతి మంధాన (127 బంతుల్లో 117, 12 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో కదం తొక్కి టాప్ స్కోరర్‌గా నిలిచింది. దీప్తి శర్మ (48 బంతుల్లో 37, 3 ఫోర్లు) , పూజా వస్త్రాకర్ (42 బంతుల్లో 31, 3 ఫోర్లు) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో కాకా 3 వికెట్లు తీయగా.. మసబతా క్లాస్ 2, డెర్క్‌సెన్, లాబా, షాంగేస్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సఫారీ జట్టు 37.4 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌట్ అయింది.

దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో సునే లస్ (58 బంతుల్లో 33, 4 ఫోర్లు) టాప్ స్కోరర్. సినాలో జప్టా (27), మారినే కాప్ (24) పర్వాలేదనిపించారు. భారత బౌలింగ్‌లో ఆశా శోభన 4 వికెట్లతో సఫారీల పతనాన్ని శాసించగా.. దీప్తి శర్మ 2, రేణుకా, పూజా, రాధాలు తలా ఒక వికెట్ పడగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. షెఫాలీ వర్మ (7), హేమలత (12), కెప్టెన్ హర్మన్ (10), రోడ్రిగ్స్ (17) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఆ తర్వాత రిచా ఘోష్ కూడా (3) వెనుదిరగడంతో భారత్ 99 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ దశలో భారాన్ని భుజానికెత్తుకున్న స్మృతి సఫారీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని పరుగులు సాధించింది. లోయర్ ఆర్డర్‌లో దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్‌ల సహకారంతో మంధాన 116 బంతుల్లో శతకం మార్క్‌ను అందుకుంది. వన్డేల్లో మంధానకు ఇది ఆరో సెంచరీ. మంధాన వెనుదిరిగినప్పటికీ పూజా కొన్ని చక్కటి షాట్లతో టీమిండియా గౌరవ ప్రదమైన స్కోరును సాధించింది. అనంతరం భారత బౌలర్ల ధాటికి సఫారీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మధ్యలో సునే లాస్, కాప్ వికెట్ల పతనాన్ని కాసేపు మాత్రమే అడ్డుకోగలిగారు. సెంచరీతో మెరిసిన స్మృతి మంధాన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకుంది.