calender_icon.png 23 October, 2024 | 12:55 AM

మన పండుగ!

03-10-2024 12:00:00 AM

“ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ..

ఏమేమి కాయొప్పునే గౌరమ్మ..

తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ..

తంగేడు చెట్టుకింద..” అంటూ బతుకమ్మ చుట్టూ  పాటలు పాడుతూ.. బొడ్డెమ్మలు ఆడుతూ.. ఆడపడుచులు పుట్టింట్లో ఇష్టంగా జరుపుకునే పూల పండుగ రానే వచ్చింది. పూలనే దైవంగా పూజించే పండుగ బతుకమ్మ. ఆడబిడ్డల ఆత్మీయ వేడుక బతుకమ్మ. తెలంగాణ ప్రజలకు ఈ పండుగ చాలా ప్రత్యేకమైంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీక.

తొమ్మిదిరోజుల పాటు ఒక్కోరోజు ఒక్కోపేరుతో బతుకమ్మను పిలుస్తారు. తీరొక్క పూలతో బతుకమ్మను అలంకరిస్తారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ప్రకృతిని కొలవడమే పరమార్థంగా సాగే ఈ పండుగ మహిళలకు మాత్రమే ప్రత్యేకం.

ఈ నెల తెలంగాణ ప్రజల పండుగ. ఈ నెలలో రెండు పెద్ద పండుగలు జరుగుతాయి. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కలయికలతో నిండిపోయి ఉంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, మరి ఒకటి విజయదశమి. అయితే బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ. తెలంగాణ సాంస్కృతి ప్రతీక. 

ఈ పండుగ వానకాలం చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వానలతో చె రువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో పూసి ఉంటా యి. వాటిలో గునుగు పూలు, తంగేడు పూలు బా గా ఎక్కువగా పూస్తాయి. బంతి, చామంతి, నందివర్థనం లాంటి పూలకు కూడా ఇదే సమయం.

సీతాఫలం కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. అలాగే జొన్న పంట కోతకు సిద్ధంగా తలలూపుతూ ఉంటుంది. వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. 

తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మని సద్దుల బతుకమ్మ అని అంటారు. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తగారింటి నుంచి పుట్టింటికి చేరుకొని పూల పండుగ జరుపుకోవడానికి తయారవుతారు. తొమ్మిది రోజులలో వీరు బతుకమ్మలు చేసి ప్రతీ సాయంత్రం దాని చుట్టూ తిరుగుతూ ఆడతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న నీటిలో నిమర్జనం చేస్తారు. 

చివరి రోజు సాయంత్రం ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు ధరించి నగలు పెట్టుకుని బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్న వారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్యత, సోదర భావం, ప్రేమను కలిపి రంగరిస్తూ మానవ హారం ఏర్పరిచి పాటలు పాడుతారు. ఒకరు ముందుగా పాట మొదలుపెడితే, మిగిలిన వారు వారితో గొంతు కలుపుతూ పాడుతారు.  ఈ పాటలు చుట్టుపక్కల ప్రతిధ్వనిస్తూ, ప్రత్యేకమైన తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరిస్తాయి. 

చీకటి పడుతుండగా స్త్రీలందరూ బతుకమ్మలను తలపై పెట్టుకుని బతుకమ్మ పాటలు పాడుతూ.. ఊరిలో ఉన్న పెద్ద చెరువు గానీ, తటాకం వైపుగానీ ఊరేగింపుగా బయలుదేరి నీటిలో జారవిడుస్తారు. ఆ తర్వాత మలీద అనే పిండి వంటకాన్నీ బంధు మిత్రులకు పంచి పెడతారు. ఆ తర్వాత ఖాళీ పళ్ళెంతో దరువు వేస్తూ పాటలు పాడుతూ బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుకుంటారు. 

బతుకమ్మ కథ

ఓ ముద్దుల చెల్లి. ఆమెకు ఏడుగురు అన్నదమ్ములు. వీరాధివీరులు. అందరికీ పెళ్ళిళ్లు అయ్యాయి. అన్నలకు చెల్లెలు అంటే పంచ ప్రాణాలు కానీ వదినలకు మాత్రం అసూయ. ఆ బంగారు బొమ్మను బాధ పెట్టేవారు. ఓ రోజున వేటకు వెళ్ళిన అన్నలు ఎంతకాలమైనా తిరిగిరాలేదు. అదే అదను అనుకుని వదినలు సూటిపోటి మాటలతో వేధించారు. యాతన తట్టుకోలేక ఆ చెల్లి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది.

ఆ తర్వాత కొంత కాలానికి అన్నలు తిరిగి వచ్చారు. ముద్దుల చెల్లి ఎక్కడ అని భార్యలను నిలదీశారు. విషయం అర్థమైంది. తిండి తిప్పలు లేవు, నిద్రాహారాలు లేవు, తిరగని పల్లె లేదు, ఎక్కని గుట్ట లేదు. ఓ ఊరి పొలిమేర దగ్గర దాహం తీర్చుకుంటూ ఉండగా, పెద్ద తామర పూవు ఒకటి కనబడింది. వాళ్ళని చూడగానే నీటిలో తేలుతూ వచ్చేసింది. ఆ తర్వాత కొంత సేపటికి ఆ రాజ్యాన్ని ఏలే రాజు అక్కడికి వచ్చాడు.

ఆ పువ్వును తీసుకెళ్ళి తన తోటలోని కొలనులో వేశాడు. కొలను చుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు మొలిచాయి. కొంతకాలానికి విష్షుమూర్తి దిగివచ్చి తామరను మనిషిగా చేశాడు. ఆమె శ్రీ లక్ష్మీ అవతారం అని పూరణం చెబుతున్నది. పూవులకు బతుకు తెరువు చూపింది కాబట్టి బతుకమ్మ అయింది.

మహిషాసురుని చంపిన తర్వాత అలసి సొలసి మూర్ఛపోయిన అమ్మవారికి, మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నమని మరో ఇతిహసం ఉన్నది. ఆత్మత్యాగంతో తెలంగాణలోని ఓ పల్లెను వరద బారినుంచి కాపాడిన త్యాగమూర్తి బతుకమ్మ అనేవారు ఉన్నారు. బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. ఈ పండుగ వేడుకలు చూడటానికి రెండు కళ్ళు చాలవు. మైదానాల్లో, చెరువుల వద్ద, ఇళ్ళ వద్ద బతుకమ్మ సంబరాలతో ప్రతి గల్లీ మారుమ్రోగుతూ ఉంటుంది. 

 పాలపర్తి సంధ్యారాణి  

నేడు అటుకుల బతుకమ్మ 

రెండో రోజు అటుకుల బతుకమ్మ జరుపుకుంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ఈ బతుకమ్మను చేస్తారు. నైవేద్యంగా అమ్మవారికి సప్పిడి పప్పు, బెల్లం, అటుకులను సమర్పిస్తారు.