calender_icon.png 12 January, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన కల తెలంగాణ అభివృద్ధే

05-08-2024 01:22:22 AM

  1. న్యూయార్క్‌లో ప్రవాసులను ఉద్దేశించి సీఎం రేవంత్ ట్వీట్ 
  2. అమెరికాలో సీఎంకు ఘనస్వాగతం

యూఎస్‌కు బయలుదేరిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 

రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా 11 రోజుల పర్యటన

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులు తీసుకురావడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలు చేసు కోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన ప్రారంభమైంది. ఆదివారం న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో సీఎం బృందానికి ఘన స్వాగతం లభించింది. ఈ సంద ర్భంగా ‘ఎక్స్’ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి స్పం దించారు.

‘కీలకమైన న్యూయార్క్ నగరం నుంచే పెట్టుబడుల సాధన పర్యటన ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నాను. ప్రవాస భారతీయులైన ఇక్కడి మన తెలుగు సోదర సోదరీమణులు గుండెల నిండా ప్రేమ, ఆప్యాయతలతో మాకు స్వాగతం పలుకడానికి విచ్చేశారు. మనందరినీ ఏకం చేసే ఒక కల.. తెలంగాణను మరింత గొప్ప గా అభివృద్ధి చేసుకోవడం’ అని ఆయన సందేశంలో పేర్కొన్నారు.

కాగా, ఆదివారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు బయలుదేరగా సోమవారం ఉదయం చేరుకోనున్నారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం అమెరికాకు వెళ్ల  నున్నారు. వీరిద్దరూ సీఎం రేవంత్‌రెడ్డి బృందంతో కలుస్తారు. ఈ 11 రోజుల పర్యటనలో పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. అంతేకాకుండా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఇన్వెస్టర్లకు వివరించనున్నారు.

అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత పెట్టుబడుల కోసం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు విదేశాల్లో పర్యటించడం ఇది రెండో సారి. ఈ నెల తొమ్మిది వరకు న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్‌ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, వెంకట్‌రెడ్డి భేటీ అవుతారు.

అమెరికాలోని ప్రవాస భారతీయులతోనూ సమావేశమవుతారు. ఈ నెల 5న న్యూయార్క్‌లోని కాగ్నిజెంట్, ఆర్సీఎం, టీబీసీ, కార్నింగ్, జోయిటస్ సహా పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు. 6న పెప్సికో, హెచ్‌సీఏ ఉన్నతాధికారులతో సమావేశమైన తర్వాత న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ వెళతారు. 

ఐటీ కంపెనీల రౌండ్ టేబుల్ సమావేశం

వాషింగ్టన్‌లో ఐటీ సేవల సంస్థలు నిర్వహించే రౌండ్‌టేబుల్ సమావేశంలో సీఎం, మంత్రులు పాల్గొంటారు. అక్కడ ప్రపంచబ్యాంకు అధ్యక్షుడితో సమావేశమవుతారు. అనంతరం డల్లాస్‌కు వెళ్తారు. ఈ నెల 7న చార్లెస్ స్కాబ్ హెచ్, మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజాను సందర్శిస్తారు. 8న కాలిఫోర్నియాలో ట్రినెట్ సీఈవో, ఆరమ్, ఆమ్జెన్, రెనెసాస్, అమాట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు.

సెలెక్ట్ టెక్ యూనికార్న్ ప్రతినిధులతో మాట్లాడతారు. సెమీకండక్టర్ రంగానికి చెందిన పలు సంస్థలతో రౌండ్ టేబుల్ భేటీలోనూ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటారు. ఈ నెల 9న గూగుల్ సీనియర్ ప్రతినిధులతో భేటీ ఉండనున్నది. స్టాన్‌ఫోర్ట్ బయోడిజైన్ సెంటర్‌ను సీఎం సందర్శిస్తారు.

అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, జెడ్ స్కేలర్ సీఈవో, ఎనోవిక్స్, మోనార్క్ ట్రాక్టర్స్, థెర్మోఫిషర్ సైంటిఫిక్ ప్రతినిధులను సీఎం రేవంత్‌రెడ్డి బృందం కలుస్తుంది ఈ నెల 10న అమెరికా నుంచి సియోల్‌కు బయలుదేరి 11న దక్షిణ కొరియాలోని సియోల్‌కు చేరుకుంటారు.

12న సియోల్‌లో యూయూ ఫార్మా, కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీ, ఎల్‌ఎస్ హోల్డింగ్స్, హ్యూందాయ్ మోటార్స్ ప్రతినిధులు సహా ఆ దేశ ఉన్నతాధికారులతో భేటీ అవుతారు. 13న హాన్ రివర్ ప్రాజెక్టుపై డిప్యూటీ మేయర్ జూయంగ్ టాయోతో భేటీ ఉంటుంది. 14న రేవంత్‌రెడ్డి బృందం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం ఉంటుంది. దక్షిణ కొరియా పర్యటనలో సామ్‌సంగ్, ఎల్జీ సంస్థల ప్రతినిధులతోనూ సీఎం బృందం చర్చలు జరుపనుంది.