calender_icon.png 20 October, 2024 | 2:54 AM

మేం చేసిన అప్పులు తక్కువే

28-07-2024 05:20:56 AM

  1. రూ.3.85లక్షల కోట్లు మాత్రమే 
  2. రాష్ర్టంలో దశాదిశ లేని పాలన కొనసాగుతోంది 
  3. గ్రామానికో మద్యం షాపు పెడుతారా? 
  4. మాజీమంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో తీసుకున్న రుణాలు రూ.3.85 లక్షల కోట్లు మాత్రమే అని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క చేసిన బడ్జెట్ ప్రసంగానికి ఉండాల్సిన దార్శనికత లేదని, రాష్ర్టంలో దశ దిశ లేని పాలన నడుస్తుందని ఆరోపించారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రూ.6,71,757 కోట్లు అప్పు చేసిందని పదేపదే కాంగ్రెస్ సర్కారు చెబుతోందని, అప్పులు నాలుగు రకాలు ఉంటాయని, ఇందులో రెండు రకాలు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేనివని శ్వేతపత్రంలో ప్రభుత్వం చెప్పిందన్నారు. గత ప్రభుత్వాలు చేసిన అప్పు 11,609కోట్లు ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.6,115 కోట్ల అప్పును తీసుకుందని, దాన్ని కూడా బీఆర్‌ఎస్ ఖాతాలో వేసిందని చెప్పుకొచ్చారు.

అలాగే కరోనా సమయంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు అన్ని రాష్ట్రాలకు అదనంగా 1.5శాతం ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలను కేంద్రం ఇచ్చిందని, దీని విలువ రూ.41,159 కోట్లు అన్నారు. శ్వేతపత్రంలో పేర్కొన్న రూ.6,71,757 అప్పుల నుంచి పైవన్నీ తీసేస్తే.. మిగిలేది రూ.3,85,340 కోట్లు అప్పు మాత్రమే అని తెలిపారు. రాష్ర్ట తలసరి ఆదాయం రూ.3,47,229 చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 7,778 మెగావాట్ల నుంచి 19,483 మెగవాట్లకు పెంచామన్నారు. ఇప్పుడు అదనంగా మరో 1,400 మెగావాట్లు ఎన్టీపీసీ నుంచి వచ్చిందని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కరెంట్  పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. తాము తప్పులు చేశాం కాబట్టే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చొబెట్టారని హరీశ్‌రావు అన్నారు. ఇప్పుడు అదే తప్పులను మీరు చేస్తారా? అని ప్రశ్నించారు.  

రెండు నెలలుగా పెండింగ్‌లో పింఛన్లు..

రూ.2వేల పింఛన్లు కూడా 2 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చారు. భట్టి ప్రసంగంలో ఉన్నదంతా అవాస్తవాల విస్తరణ, వాస్తవాల విస్మరణ అని హరీశ్ దుయ్య బట్టారు. కేంద్రం నుంచి 9 ఏళ్లుగా రూ.9 వేల కోట్లు లేక రూ.10 వేల కోట్లకు మించి గ్రాంట్స్ రావడం లేదని మంత్రి భట్టినే చెప్పారని, కానీ ఈ బడ్జెట్‌లో రూ.21,636 కోట్లు గ్రాంట్‌ను ఎలా అంచనా వేస్తారరని ప్రశ్నించారు. బీర్లపై డ్యూటీని భారీగా పెంచారని, దీని ద్వారా ధరలో పెంచబోతున్నట్లు అర్థమవుతున్నట్లు పేర్కొన్నారు. లిక్కర్ డ్యూటీని 11,031 కోట్ల నుంచి 15,500 కోట్లకు పెంచడమే ఇందుకు నిదర్శనమన్నారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం అమ్మకాలపై రాద్దాంతం చేసిన కాంగ్రెస్ నాయకులు, ఈ బడ్జెట్‌లో మద్యం అమ్మకం ద్వారా ఆదాయం పెంచుకోవాలని చూడటం ఏంటని ప్రశ్నించారు. 

హరీశ్‌రావుకు మంత్రుల కౌంటర్లు..

కార్పొరేషన్ ఛైర్మన్ కూడా పింఛన్ తీసుకుంటున్నారు: మంత్రి సీతక్క

రెండు నెలలుగా పింఛన్లు ఇవ్వడం లేదని హరిశ్‌రావు చేసిన కామెంట్స్‌పై సీతక్క స్పందించారు. 2020లో జులైలో ఇవ్వాల్సిన పింఛన్‌ను ఆగస్టులో ఇచ్చారని, అదే గ్యాప్ ఇప్పటికీ కొనసాగుతోందని సీత్కక్క చెప్పారు. ఆ తప్పును ఇప్పుడు తమపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. బీఆర్‌ఎస్ హయాంలో డబుల్ పెన్షన్స్ తీసుకున్నారని చెప్పారు. కొందరు మాజీ ఉద్యోగులు సర్వీస్ పెన్షన్‌తో పాటు ప్రభుత్వ పింఛన్లనూ తీసుకున్నారని తమ వద్ద రికార్డుల్లో ఉందని సీతక్క చెప్పారు. ఇలా 5వేల మంది డబుల్ పెన్షన్ తీసుకున్నారని వివరించారు. కార్పొరేషన్ ఛైర్మన్ కూడా ఒకవైపు అలవెన్సులు తీసుకుంటునే రూ.6వేల పెన్షన్ తీసుకున్న విషయాన్ని సీతక్క సభలో వెల్లడించారు.

వీడియోలో మమ్మల్ని చూపిస్తలేరు: హరీశ్‌రావు

10 రెట్లు ఎక్కువ చూపిస్తాం: శ్రీధర్ బాబు

అసెంబ్లీలో తాము మాట్లాడుతున్న సమయంలో తమను స్క్రీన్‌పై చూపిస్తలేరని హరీశ్‌రావు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంట్‌లో కూడా రాహుల్‌గాంధీ మాట్లా డుతున్న సమయలో చూపిస్తలేరని, ఆయన కూడా ఇదే మాట చెప్పారని పేర్కొన్నారు. అయితే దీనిపై స్పీకర్ అభ్యంతరం చెప్పారు. అందరినీ చూపిస్తామని స్పష్టం చేశారు. హరీశ్‌రావు మాటలకు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పందిం చారు. లోక్‌సభలో పార్లమెంట్‌లో రాహుల్‌గాంధీని చూపించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ చూపిస్తామని స్పష్టం చేశారు.

ముందే ఎందుకు వేలం వేశారు?: మంత్రి భట్టి

ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ బడ్జెట్‌లో అంచనాలను పెంచింది. అయితే ఎక్సైజ్ శాఖ ఆదాయం పెంచడానికి గల్లీకో మద్యం షాపును పెడుతారా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. గతేడాది మద్యం షాపుల వేలం వేశాం కాబట్టి ఆదాయం పెరిగిందని చెప్పారు. దీనిపై డిపూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. వాస్తవానికి ఈ ఏడాది వేయాల్సిన మద్యం వేలాన్ని గతేడాది ఎలా వేస్తారని ప్రశ్నించారు. అందినకాడికి దండుకోవడానికి ముందే వేలం వేశారని విమర్శలు గుప్పించారు.

సమయానికే వచ్చిన: కోమటిరెడ్డి

ఆరు గ్యారెంటీలను అమలు చేయడం లేదంటూ హరీశ్‌రావు చేసిన విమర్శలపై మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. గ్యారెంటీలకు విస్మరించిన చరిత్ర బీఆర్‌ఎస్, కేసీఆర్‌దేనని అన్నారు. తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానని చెప్పి చేయలేదన్నారు. కేంద్ర బడ్జెట్‌పై స్పందించని కేసీఆర్.. రాష్ట్ర బడ్జెట్‌పై చీల్చి చెండాడుతా అనడం విడ్డూరంగా ఉందన్నారు. చీల్చి చెండాడుతా అనడంతో తాను ఈ రోజు సభకు 9:30గంటలకు వచ్చాననని అనడంపై సభలో నవ్వులు విరిశాయి. హరీశ్‌రావు సబ్జెక్టు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మంత్రి కోమటిరెడ్డి మాటలపై హరీశ్‌రావు బదులిచ్చారు. కోమటిరెడ్డి ఏ విషయాలు తెలియకుండా మాట్లాడారని ఆరోపించారు. ఈ మాటపై కోమటిరెడ్డి స్పందిస్తూ.. హరీశ్‌కు అహంకారం పెరిగింది కానీ, అసలు నాలెడ్జ్ లేదన్నారు.