calender_icon.png 30 November, 2024 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన సాంస్కృతిక వైభవం లోక్‌మంథన్

29-11-2024 12:00:00 AM

భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే ప్రతిభారతీయుడు దేశమే అన్నిటికన్నా ముందు అనే భావనను ప్రోది చేసుకోవాలని, ‘ ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ అనే సందేశాన్ని ఈ లోక్‌మంథన్ ఇచ్చింది.

భారత్‌లో జరిగిన అతిపెద్ద సాంస్కృతికోత్సవం లోక్‌మంథన్. లోక్‌మంథన్ అనే కార్యక్రమం రెండేళ్లకోసారి ‘ప్రజ్ఞాప్రవాహ్’ అనే సంస్థ నిర్వహిస్తుంది ఆర్‌ఎస్‌ఎస్ పరివార క్షేత్రాల్లో ఇది ఒకటి. 2016లో మొట్టమొదట భోపాల్‌లో, రెండవది రాంచీలో, మూడవది గౌహతిలో జరిగింది.నాల్గవది భాగ్యనగరంలో ఈ నెల 21నుంచి 24 వరకు శిల్పకళా వేదిక, శిల్పారామంలో జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శిల్పారామంలో ఈ ప్రదర్శనను ప్రారంభించారు.

రెండవ రోజు భారత రాష్ట్రపతి ద్రౌది ముర్ము ‘లోక్‌మంథన్’ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత సమాజాన్ని చీల్చడానికి అన్ని వైపులా కుట్రలు జరుగుతున్నాయని, అయినా భారతీయత అన్న ధర్మం ఆధారం గా ప్రజలందరూ కలిసికట్టుగానే ఉన్నారన్నారు. బానిస భావజాలాన్ని వదిలించుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రతి విషయంలోనూ ఇతర దేశాలను గుడ్డిగా అనుసరించాల్సిన అవసరం లేదని మన సంస్కృతీ సంప్రదాయాల్లోనే అనేక సమస్యలకు పరిష్కారాలన్నాయని ర్‌ఎస్‌ఎస్ సర్ సంచాలక్ మోహన్ భగవత్ అన్నారు. మనం మరచిన ఆత్మగౌరవాన్ని పునః ప్రతిష్ఠించాలని పిలుపునిచ్చారు.

వనవాసులు, గ్రామవాసులు, పట్టణవాసులు, జీవజంతుజాలం అంతా కూడా ‘లోక్’ అనే భావన మనది. పంచభూతాలను దేవుళ్లుగా ఆరాధించే సంప్రదాయం  కేవలం భారత్ సొంతం. విదేశీ భావజాలాన్ని తొలగించి, భారతీయ దృక్కోణాన్ని విశ్వవ్యాప్తం చేసి, భారత దేశ సంస్కృతీ సంప్రదాయాలు విశ్వానికి మార్గదర్శనం చేసి నాయకత్వం వహించేలా చేయడమే లోక్‌మంథన్ ప్రధాన లక్ష్యం. ఇలాంటి భావనలను తొలగించి మన సంస్కృతీ సంప్రదాయాలను తిరిగిపురుద్ధరించడం, సమాజంలో ఏకీకృత భావనను తీసుకు రావడం, విశ్వ ఐక్యత ప్రాశస్త్యాన్ని ప్రతిపాదించడం ‘లోక్‌మంథన్2024’ ప్రధాన ఉద్దేశం.

ఇందులో భాగంగా లోక్ అవలోకన్, లోక్ విచార్, లోక్ వ్యవహార్, లోక్ వ్యవస్థ అంశాలపై మూడు రోజుల పాటు మంథన్ జరిగింది. మాతృభాష ప్రాధాన్యత, కుటుంబ వ్యవస్థ, స్వదేశీ ప్రాధాన్యత తదితర అంశాలపై మేధోమథనం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒకే చోట భారత దేశంలోని కళలు, కళారూపాలు, కళాకారుల ప్రదర్శనలను నిర్వ హించారు. అన్ని రాష్ట్రాలనుంచి 1502 మంది ప్రతినిధులే కాకుం డా ఇతర సంస్థనుంచి వచ్చిన వారు, విశిష్ట అతిథులు, 1568 మంది కళాకారులు  మొత్తం 4,722 మంది పాల్గొన్నారు.

3 మంది పద్మ అవార్డు గ్రహీతలు కూడా పాల్గొన్నారు. వీరంతా 13 దేశాలకు చెందిన వారు కావడం విశేషం. వారు కూడా వారి సంప్రదాయాలను ప్రదర్శించారు. చిడతల రామాయణం, వీరభద్రపళ్లెం వీడియో ప్రదర్శన, మహాన్ భారతోహం నృత్య ప్రదర్శన తదితర కార్యక్రమాలు ఎన్నో జరిగాయి. శిల్పారామంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలను ఎన్నో విద్యాసంస్థలు తమ విద్యార్థులకు చూపించాయి. 2 లక్షల మందికి పైగా ఈ కార్యక్రమాలను వీక్షించారు. భారత దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే ప్రతిభారతీయుడు దేశమే అన్నిటికన్నా ముందు అనే భావనను ప్రోది చేసుకోవాలని, ‘ ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ అనే సందేశాన్ని ఈ లోక్‌మంథన్ ఇచ్చింది.

- భవాని సాగి