04-03-2025 01:48:03 AM
రాజేంద్రనగర్, మార్చి 3 (విజయ క్రాంతి): మన దేశంలో చిరుధాన్యాలకు ప్రత్యేక స్థానం ఉందని, అదేవిధంగా దేశ భద్రత, రైతు సంక్షేమం, శాస్త్రీయ అభివృద్ధి అనేవి సమన్వితంగా ఎదగాలని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి పేర్కొన్నారు. సోమవారం శ్రీ అన్న (మిల్లెట్స్) కోసం వికసిత్ అనే థీమ్ తో కిసాన్ మేళా 2025 రాజేంద్రనగర్‌లోని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలిలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యమాన్ని ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ రైతలు కోసం ప్రత్యేకంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి హజరై మాట్లాడారు. దేశ భద్రత, రైతు సంక్షేమం, శాస్త్రీయ అభివృద్ధి అనేవి దేశ భవిష్యత్తును మెరుగుపరచడానికి ముఖ్యమైన అంశాలన్నారు. వీటిని సమర్థంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కిసాన్ క్రెడిట్ కార్డు రైతుల ఆర్థిక అభివృద్ధికి ఒక బలమైన ఆయుధమని పేర్కొన్నారు.
భారతదేశ వ్యవసాయ వారసత్వంలో చిరుధాన్యాలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేందుకు తోడ్పడతాయి. చిరుధాన్యాలను ప్రోత్సహించడం ద్వారా మనం పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రతను సాధించగలుగుతామని తెలియజేశారు. అందుకే ‘మనం చిరుధాన్యాల కోసం ఆరోగ్యభారత దేశం‘ అనే సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు.
వ్యవసాయ రంగంలో పోషకాహార భద్రత, పర్యావరణ అనుకూలత, సంపాదన పెంపుదల వంటి అనేక ప్రయోజనాలను అందిస్తున్నాయి. మన దేశంలోని రైతులకు చిరుధాన్యాల సాగు గురించి అవగాహన కల్పించేందుకు. ఆధునిక సాంకేతికతలను పరిచయం చేసేందుకు, మార్కెట్ అవకాశాలను అందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన వివరించారు.
మిల్లెట్స్ (చిరుధాన్యాల) ప్రాముఖ్యతను క్లుప్తంగా వివరించారు. చిరుధాన్యాల్లో పోషక విలువలు అధికంగా కలిగి ఉంటాయని, సాగులో నీటిని తక్కువగా వినియోగించుకుంటాయని తెలిపారు. వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థం కలిగి ఉంటాయని, సేంద్రీయంగా, తక్కువ పెట్టుబడిలో పండించవచ్చని పేర్కొన్నారు. ఐస్‌ఎఆర్- ఐఐఎంఆర్ వంటి సంస్థలు నూతన విత్తన జాతులను, మెరుగైన సాగు విధానాలను అభివృద్ధి చేసి, రైతులకు అందుబాటులోకి తెస్తున్నాయని అన్నారు.
అదేవిధంగా పిజెటీఎయు ఉపకులపతి అల్దాస్ జానయ్య, ఎన్విఆర్, పిఆర్ జనరల్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, ఎన్‌ఐ ఎం ఎస్‌ఎంఈ డైరెక్టర్ జనరల్ సంచుగ్లోరి స్వరూప, ఐసిఎఆర్ ఐఐఓఆర్ డార్డర్ .ఆర్.కె మధుర్ ఐసిఎఆర్-ఎన్‌ఎంఆర్‌ఐ డైరెక్టర్ డా. బార్బుద్దేలు పాల్గొని రైతులకు చిరుధాన్యాలపై పలు సూచనలు చేసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు, ప్రభుత్వ అధికారులు, ప్రతినిధులు, స్వయం సహాయ సంఘాలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.