calender_icon.png 17 October, 2024 | 12:01 PM

మా సీఎం ఇక్కడే ఉన్నారుగా?

17-10-2024 01:34:05 AM

మహారాష్ట్ర డిఫ్యూటీ సీఎం ఫడ్నవిస్

సీఎం అభ్యర్థిని మారుస్తారని ప్రచారం

ఫడ్నవిస్‌నే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని వదంతులు

ముంబై, అక్టోబర్ 16: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావటంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార మహాయుతి కూటమి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి నేతలు మాటల తూటాలు పేల్చుకొంటున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఈ రెండు కూటములకు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరనే అంశంపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అధికార కూటమి మళ్లీ ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండేనే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తుందని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తుండగా, మరికొందరు మాత్రం డిఫ్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని అంటున్నారు. బుధవారం సీఎం షిండేతోపాటు డిఫ్యూటీ సీఎంలు ఫడ్నవిస్, అజిత్‌పవార్ ప్రభుత్వ రిపోర్డ్ కార్డును విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా ఇదే ప్రశ్న అడిగింది.

అందుకు ఫడ్నవిస్ నర్మగర్భంగా సమాధానమిచ్చారు. ‘మా సీఎం ఇక్కడే ఉన్నారుగా? ఇక్కడే కూర్చున్నారుగా? మేం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి ఇక్కడే కూర్చున్నారు’ అని అన్నారు. దీంతో ఈ ఎన్నికల్లోనూ షిండేనే సీఎం అభ్యర్థి అని ప్రచారం మొదలైంది.

మరోవైపు విపక్ష ఎంవీఏకు ముఖ్యమంత్రి అభ్యర్థే లేడని ఫడ్నవిస్ విమర్శించారు. ‘ఎంవీఏ తమ సీఎం అభ్యర్థిని ప్రకటించటం లేదు. ఎందుకంటే వారి సీఎం ఎన్నికల తర్వాత వస్తారు. శరద్‌పవార్ సాహబ్‌ను సవాల్ చేస్తున్నా.. మీ సీఎం అభ్యర్థిని ప్రకటించండి’ అని పేర్కొన్నారు. 

మహాయుతి ప్రకటించిన తర్వాతే మేం ప్రకటిస్తాం

ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అంశంపై విపక్ష ఎంవీఏ ఇదివరకే ఓ ప్రకటన చేసింది. అధికార మహాయుతి కూటమి తన సీఎం అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే తాము సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని శివసేన (యూబీటీ) అధినేత, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. సీఎం అభ్యర్థిత్వంపై ఎంవీఏ నేతలు నోరు మెదుపటం లేదు.

ఎన్నికల్లో ఎంవీఏకు మెజారిటీ వస్తే సీఎం పోస్టు తనకే కావాలని ఉద్ధవ్ డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, శరద్ పవార్ మాత్రం ఎన్నికల్లో పార్టీలు గెలిచిన స్థానాలను బట్టి సీఎం అభ్యర్థి ఖరారవుతారని తెలిపారు. కాంగ్రెస్ మాత్రం ఈ అంశంపై స్పందించలేదు.