* మరో పది రోజుల్లో పారిస్ వేదికగా ఒలింపిక్స్ క్రీడా సమరం ప్రారంభం కానుండగా.. విశ్వవేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించేందుకు భారత అథ్లెట్లు సిద్ధమవుతున్నారు. సిడ్నీ ఒలింపిక్స్ (2000) వెయిట్ లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరి కాంస్యం నెగ్గి.. విశ్వక్రీడల్లో పతకం సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టిస్తే.. ఈసారి భారత్ నుంచి 47 మంది మహిళా అథ్లెట్లు ఒలింపిక్స్ బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. స్టార్ షట్లర్ పీవీ సింధు హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతుంటే.. విశ్వవేదికపై తన పంచ్ పవర్ చాటేందుకు ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ సై అంటోంది!
* ఆ వేదికపై ఒక్క విజయం.. యావత్ భారతాన్ని ఊపేస్తుంది! ఒక్క పతకం.. క్రీడాలోకాన్ని ఆనంద డోలికల్లో ముంచెత్తుతుంది! ఒక్క మెడల్.. భావి తరాలకు కావాల్సినంత స్ఫూర్తినిస్తుంది!
సుదీర్ఘ చరిత్ర ఉన్న ఒలింపిక్స్‌లో భారత్ 1900 నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే.. 2000 (సిడ్నీ)లో తొలిసారి ఓ భారత క్రీడాకారిణి (కరణం మల్లీశ్వరి) విశ్వవేదికపై పతకం అందుకుంది. అంటే సరిగ్గా వందేళ్ల తర్వాత మన అమ్మాయికి ఒలింపిక్ మెడల్ దక్కిందన్నమాట. వెయిట్ లిఫ్టర్ మల్లీశ్వరి స్ఫూర్తితో.. దేశవ్యాప్తంగా ఎందరో అమ్మాయిలు గ్రౌండ్ బాటపట్టారు. తెలుగమ్మాయి తెగువతో.. క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే అమ్మాయిల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరగగా.. మరో పుష్కరకాలం (2012 లండన్ ఒలింపిక్స్) తర్వాత సైనా నెహ్వాల్, మేరీకోమ్ డబుల్ ధమాకా మోగించారు. అప్పటి వరకు ఒలింపిక్ పతకం గెలవడం అంత ఈజీ కాదనుకునే అమ్మాయిలకు ఈ ఇద్దరు సరికొత్త బాట చూపారు.
ఎంచుకున్న రంగంపై అంకితభావానికి కఠోర శ్రమ తోడైతే సాధించలేనిదేదీ లేదని నిరూపించారు. అప్పటి వరకు టైమ్‌పాస్ గేమ్ అనుకున్న బ్యాడ్మింటన్ కాస్తా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకోగా.. బాక్సింగ్ అంటే కేవలం అబ్బాయిలకే అనే అపవాదును మేరీ తుడిచిపెట్టింది. ఇక తదుపరి ఒలింపిక్స్ (2016)లో భారత్‌కు రెండు పతకాలు మాత్రమే దక్కగా.. ఆ రెండు అమ్మాయిలే సాధించడం గమనార్హం. బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజం పీవీ సింధు, రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ మెడల్స్ సాధించగా.. గత ఒలింపిక్స్ (2020 టోక్యో)లో మన అమ్మాయిలు హ్యాట్రిక్ కొట్టారు. పీవీ సింధు రెండో పతకంతో రికార్డులు తిరగరాయగా.. మీరాబాయి చాను, లవ్లీనా బొర్గోహై మెడల్స్‌తో మెరిశారు. ఈ ముగ్గురు ఈ సారి కూడా విశ్వక్రీడల బరిలోకి ఉండగా.. వీరికి తోడు మరిన్ని యువకెరటాలు విశ్వక్రీడా యవనికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించేందుకు సిద్ధమయ్యాయి. మరో పది రోజుల్లో పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. విశ్వక్రీడల్లో బరిలోకి దిగుతున్న మన అమ్మాయిల అవకాశాలపై కన్నేస్తే..
సింధు హ్యాట్రిక్‌పై గురి
క్రికెట్ మత్తులో జోగుతున్న భారత క్రీడాలోకాన్ని మరో ఆటపైకి మళ్లించిన సైనా నెహ్వాల్, పీవీ సింధు.. దేశంలో బ్యాడ్మింటన్‌కు మంచి క్రేజ్ తెచ్చిపెట్టారు. 2012 ఒలింపిక్స్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సైనా నెహ్వాల్ కాంస్య పతకంతో మెరిస్తే.. నాలుగేండ్ల తర్వాత రియో ఒలింపిక్స్‌లో తెలుగమ్మాయి పూసర్ల వెంకట (పీవీ) సింధు రజత పతకంతో జననీరాజనం అందుకుంది. అదే జోరు కొనసాగిస్తూ టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన సింధు.. ఈసారి పతకం రంగు మార్చడమే తన లక్ష్యమని బల్లగుద్ది మరీ చెబుతోంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జరిగిన భేటీలోనూ సింధు హ్యాట్రిక్ కొడతానని ధీమా వ్యక్తం చేసింది. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను, ఆర్చరీలో దీపిక కుమారి, గోల్ఫ్‌లో అదితి అశోక్, టేబుల్ టెన్నిస్‌లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ, మనిక బాత్రా కూడా పతకాలపై ఆశలు రేపుతున్నారు. నాలుగేండ్లకోసారి వచ్చే విశ్వక్రీడల్లో మన అమ్మాయిలు మరిన్ని పతకాలు సాధించాలని అభిమానులు ఆశ పడుతుండగా.. 2036లో మనదేశంలో ఒలింపిక్స్ నిర్వహించాలని భావిస్తున్న కేంద్రప్రభుత్వానికి మహిళా అథ్లెట్ల విజయాలు మరింత స్ఫూర్తి పంచడం ఖాయమే!
మనూ, ఇషాపై నజర్
ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లలో లెక్కకు మిక్కిలి పతకాలు సాధిస్తున్న మన షూటర్లు.. విశ్వక్రీడల్లోనూ మెరిసేందుకు సిద్దమవుతున్నారు. ఈ సారి షూటింగ్‌లో మనదేశంలో నుంచి 11 మంది అమ్మాయిలు ఒలింపిక్స్‌లో పోటీ పడుతుండగా.. వారిలో హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్, మనూ బాకర్, ఎలవనెల్ వలరివన్, అంజుమ్ మౌద్గిల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న షూటర్లు.. పారిస్‌లో గురి పెట్టి కొడితే పతకాలు ఖాయమే. తండ్రి సచిన్ సింగ్ మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతున్న ఇషా సింగ్.. కొవిడ్ సమయంలో ప్రాక్టీస్‌కు ఆటంకం కలగకూడదని.. ఇంట్లోనే షూటింగ్ రేంజ్ ఏర్పాటు చేసుకొని శిక్షణ సాగించింది. 2022 హాంగ్జూ ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన ఇషా.. నిరుడు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాలు గెలిచింది. జూనియర్ స్థాయిలో లెక్కకు మిక్కిలి మెడల్స్ నెగ్గి వెలుగులోకి వచ్చిన ఇషా.. పారిస్‌లో పతకం గెలిచి దేశ ఖ్యాతిని మరింత ఇనుమడింప చేయడమే తన లక్ష్యమని పేర్కొంది.
నిఖత్ పంచ్ పడాలి
ఆటుపోట్లు, అవమానాలు దాటితేనే విజయం సాధిస్తామని నిరూపించిన నిజామాబాద్ బాక్సర్ నిఖత్ జరీన్ తొలిసారి ఒలింపిక్స్ బరిలో దిగనుంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ప్రతిభే పెట్టుబడిగా అంచలంచెలుగా ఎదుగుతూ.. రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నిఖత్.. విశ్వక్రీడల్లో సత్తాచాటేందుకు సమాయత్తమైంది. మనసా వాచా కర్మనా ఏదైనా ఒక విషయాన్ని బలంగా కోరుకుంటే.. విశ్వంలోని సర్వశక్తులు దాన్ని మన దరికి చేరుస్తాయని బలంగా నమ్మే నిఖత్ పారిస్‌లో పంచ్‌లతో అదగొడతానని ధీమా వ్యక్తం చేస్తోంది. గతంలో మేరీకోమ్ వెయిట్ కేటగిరీలో కొనసాగిన నిఖత్.. ట్రయల్స్‌లో మేరీతో తలపడాలని పట్టుబట్టి వార్తల్లో నిలిచింది. అదంతా కేవలం పేరు ప్రఖ్యాతలు సాధించేందుకు కాదని.. అనతి కాలంలోనే నిరూపించింది. భారత్ నుంచి వరుసగా రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన రెండో బాక్సర్‌గా నిఖత్ రికార్డు సృష్టించింది. తను చిన్నప్పటి నుంచి బాగా ఇష్టపడే మేరీకోమ్‌లాగే.. ఒలింపిక్స్‌లో పతకం గెలవాలని నిఖత్ కృతనిశ్చయంతో ఉంది. బాక్సింగ్‌లో నిఖత్‌తో పాటు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన లవ్లీనా బొర్గోహైపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
* ‘అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం ఆనందంగా ఉంది. కానీ అతి పెద్ద లక్ష్యం మాత్రం ఒలింపిక్స్‌లో మెడల్ గెలవడమే. పారిస్ విశ్వక్రీడలకు ఎంపికైన సమయంలో చాలా సంతోషించా. అదే సమయంలో మరింత బాధ్యత పెరిగినట్లు అనిపించింది. ఒలింపిక్స్‌లో పోటీ తీవ్రత ఎక్కువ ఉంటుంది. అలాంటి చోట వంద శాతం ప్రదర్శన కనబరిస్తేనే రాణించగలం. ప్రస్తుతం నేను దాని మీదే దృష్టి పెట్టా’
ఇషా సింగ్
వినేశ్ ఫొగాట్ ఈసారైనా..!
గత కొంతకాలంగా విశ్వవేదికపై భారత్ పతకాలు అందించే పక్కా ఈవెంట్లలో రెజ్లింగ్ ఒకటిగా మారింది. 2008 నుంచి రెజ్లింగ్‌లో మనవాళ్లకు కనీసం ఒక్క పతకమైనా దక్కుతోంది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఐదుగురు మహిళా రెజ్లర్లు బరిలోకి దిగనున్నారు. అందులో వినేశ్ ఫొగాట్ (50 కేజీలు), అంతిమ్ పంగల్ (53 కేజీలు), అన్షు మాలిక్ (57 కేజీలు) పై భారీ అంచనాలు ఉన్నాయి. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై పోరాటం చేసి వార్తల్లో నిలిచిన వినేశ్.. సరైన ప్రాక్టీస్ లేకుండానే విశ్వక్రీడలకు సిద్ధమైంది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేదింపులకు వ్యతిరేకంగా గళమెత్తిన వినేశ్.. మ్యాట్‌పై కూడా అదే జోరు కనబర్చాలని ప్రయత్నిస్తోంది. భారత్ నుంచి మూడోసారి ఒలింపిక్స్‌కు ఎంపికైన ఏకైక మహిళా రెజ్లర్‌గా రికార్డు సృష్టించిన వినేశ్.. 2016లోనే తప్పక పతకం నెగ్గుతుందని అనిపించినా.. క్వార్టర్ ఫైనల్లో గాయపడటం ఆమె కెరీర్‌ను దెబ్బకొట్టింది. ప్రాణాంతకమైన సర్జరీ అనంతరం తిరిగి కోలుకున్న వినేశ్ ఈసారైనా ఒలింపిక్ పతకం గెలుస్తుందా చూడాలి.
జ్యోతి వెలిగేనా!
సుదీర్ఘ చరిత్ర ఉన్న ఒలింపిక్స్‌లో భారత్‌కు అథ్లెటిక్స్‌లో మాత్రం మంచి రికార్డు లేదు. గత ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణం నెగ్గడంతో ఒక్కసారిగా దేశంలో ట్రాక్ అండ్ ఫీల్డ్‌పై అవగాహన పెరిగింది. మహిళల విభాగంలో అథ్లెటిక్స్‌లో ఇప్పటి వరకు మనకు ఒక్క పతకం కూడా దక్కలేదు. ఈసారి మాత్రం భారత్ నుంచి అథ్లెటిక్స్‌లో 11 మంది మహిళలు పోటీ పడుతున్నారు. వారిలో పారుల్ చౌదరిపై భారీ అంచనాలు ఉన్నాయి. 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌తో పాటు 5000 మీటర్ల పరుగులో పారుల్ పోటీ పడనుంది. ఇక ఈ విభాగంలో తెలుగమ్మాయిలు దండి జ్యోతిక శ్రీ, యర్రాజి జ్యోతి కూడా బరిలో ఉన్నారు. మహిళల 4 x 400 మీటర్ల టీమ్ విభాగంలో జ్యోతిక శ్రీకి మంచి రికార్డు ఉండటం ఆశలు రేపుతుండగా.. ఇటీవలి కాలంలో ఉత్తుంగతరంగంలా ఎగిసిన యర్రాజి జ్యోతి హర్డిల్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మహిళల జావెలిన్ త్రోలో అన్ను రాణి పతక ఆశలు రేపుతోంది.
భారీ అంచనాలు
1900 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు 25 ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న భారత అథ్లెట్లకు ఇవి 26వ విశ్వక్రీడలు. ఇందులో ఓవరాల్‌గా మన అథ్లెట్లు 35 పతకాలు దక్కించుకోగా.. అందులో మహిళలు 8 మెడల్స్ నెగ్గారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి వంద మందికిపైగా అథ్లెట్లు బరిలోకి దిగుతుండగా.. అందులో 47 మంది మహిళలు ఉన్నారు. విశ్వక్రీడల్లో ఇప్పటికే రెండు పతకాలు సాధించి రికార్డుల్లోకెక్కిన పీవీ సింధుపై భారీ అంచనాలు ఉండగా.. టోక్యో ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో రజతం నెగ్గిన మీరాబాయి చాను, బాక్సింగ్‌లో కాంస్యం గెలిచిన లవ్లీనా బొర్గోహై ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చాలని చూస్తున్నారు. అత్యధికంగా అథ్లెటిక్స్ (ట్రాక్ అండ్ ఫీల్డ్)లో 12 మంది బరిలో దిగనుండగా.. షూటింగ్‌లో 11 మంది పోటీ పడుతున్నారు.
రెజ్లింగ్‌లో ఐదుగురు, బాక్సింగ్‌లో నలుగురు పతకాల కోసం పోటీ పడనున్నారు. గత ఒలింపిక్స్ (టోక్యో 2020)లో పతక ఆశలురేపి చివర్లో పరాజయం పాలైన భారత మహిళల హాకీ జట్టు ఈ సారి విశ్వక్రీడలకు అర్హత సాధించకపోయింది. దీంతో ఒలింపిక్స్‌లో పాల్గొనే అమ్మాయిల సంఖ్య గత క్రీడల కంటే ఈసారి తగ్గింది. అయితే మెగాటోర్నీకి ముందు ఈసారి మనవాళ్లు మంచి ప్రదర్శనలతో ఆకట్టుకుంటుండటం.. విశ్వక్రీడల్లో మరిన్ని పతకాలు సాధించగలమనే విశ్వాసం పెంచుతోంది. ఈ క్రీడల్లో భారత్ నుంచి పోటీపడుతున్న అతి పిన్న వయస్కురాలిగా యువ స్విమ్మర్ దినిధి నిలిచింది. 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల దినిధి.. ర్యాంకింగ్స్ ఆధారంగా విశ్వక్రీడలకు అర్హత సాధించింది.
ఒలింపిక్స్‌లో భారత పతకాలు
స్వర్ణాలు రజతాలు కాంస్యాలు మొత్తం
10 9 16 35
పారిస్ బరిలో మన అమ్మాయిలు
నిఖత్ జరీన్ బాక్సింగ్ 50 కేజీలు
పీవీ సింధు బ్యాడ్మింటన్ సింగిల్స్
ఇషా సింగ్ షూటింగ్ 25 మీటర్ల పిస్టల్
ఆకుల శ్రీజ టేబుల్ టెన్నిస్ మహిళల టీమ్
జ్యోతిక శ్రీ అథ్లెటిక్స్ 4 x 400
యర్రాజి జ్యోతి అథ్లెటిక్స్ 100 మీటర్ల హర్డిల్స్
ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన భారత మహిళలు
కరణం మల్లీశ్వరి 2000 సిడ్నీ వెయిట్ లిఫ్టింగ్ కాంస్యం
సైనా నెహ్వాల్ 2012 లండన్ బ్యాడ్మింటన్ కాంస్యం
మేరీకోమ్ 2012 లండన్ బాక్సింగ్ కాంస్యం
పీవీ సింధు 2016 రియో బ్యాడ్మింటన్ రజతం
సాక్షి మాలిక్ 2016 రియో రెజ్లింగ్ కాంస్యం
మీరాబాయి చాను 2020 టోక్యో వెయిట్‌లిఫ్టింగ్ రజతం
పీవీ సింధు 2020 టోక్యో బ్యాడ్మింటన్ కాంస్యం
లవ్లీనా బొర్గోహై 2020 టోక్యో బాక్సింగ్ కాంస్యం
ఇంతియాజ్ మహమ్మద్