- కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి
- మరణ వార్తను ధ్రువీకరించిన ఆయన కుమార్తె
- తొలి సినిమాతోనే జాతీయ అవార్డు
- హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీని స్థాపించిన ఘనత ఆయనదే
- అల్వాల్‌లో జన్మించి... అంతర్జాతీయ స్థాయికి..
- హైదరాబాద్ అంటే ఆయనకు ఎనలేని ప్రేమ..
- భారత చిత్ర పరిశ్రమలో విషాదం
ముంబై, డిసెంబర్ 23: ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ (90) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలోని వోకార్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 6.30గంటలకు తుదిశ్వాస విడిచారు. శ్యామ్ మరణ వార్తను ఆయన కూతురు పియా బెనగల్ ధ్రువీకరించారు. ఆయన మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే
శ్యామ్ బెనగల్ సికింద్రాబాద్‌లోని అల్వాల్‌లో డిసెంబర్ 14, 1934లో జన్మించారు. శ్యామ్ బెనగల్ తండ్రి పేరు శ్రీధర్ బీ బెనగల్. ఆయన ఫొటో గ్రాఫర్‌గా పని చేశారు. శ్యామ్ బెనగల్ సికింద్రబాద్‌లోని మెహబూబ్ స్కూల్‌లో తన పాఠశాల విద్య ను పూర్తి చేశారు. అనంతరం నిజాం కాలేజీలో డిగ్రీ చేసి, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందారు.
కాపీ రైటర్‌గా కేరీర్ ప్రారంభించి..
శ్యామ్ బెగనల్ తన కేరీర్‌ను కాపీ రైటర్‌గా ప్రారంభించారు. 1959లో ముంబైకి చెందిన లింటాస్ అడ్వర్టుజింగ్ అనే అడ్వర్టుజింగ్ ఏజెన్సీలో కాపీ రైటర్‌గా పని చేయడం మొదలు పెట్టారు. ఈ సమయంలో ఆయన గుజరాతీలో 1962లో ‘ఘేర్ బేతా గంగా’ అనే పేరుతో మొదటి డాక్యుమెంటరీ చిత్రాన్ని తీశారు.
ఆ తర్వాత మరో అడ్వర్టుజింగ్ ఏజెన్సీలో చేరి అనేక ప్రకటనలకు సంబంధించిన చిత్రాలను తెరకెక్కించారు. 1966 మధ్య పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో పిల్లలకు పాఠాలు బోధించారు. అంతేకాకుండా ఆ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్‌గా కూడా బెనగల్ రెండుసార్లు పని చేశారు.
1967లో తీసిన ఎ చైల్డ్ ఆఫ్ ది స్ట్రీట్స్ అనే డాక్యుమెంటరీకి విస్తృత ప్రశంసలు అందుకున్నారు. ఇలా కాపీ రైటర్‌గా తన జీవితాన్ని ప్రారంభించిన బెనగల్ తన కెరీర్‌లో దాదాపు 70కిపైగా డాక్యుమెంటరీలు, లఘు చిత్రాలను రూపొందించారు.
ఎందరో నటీనటులకు అవకాశం
తన చిత్రాల్లో శ్యామ్ బెనగల్ ఎందరో కొత్త వారికి అవకాశం కల్పించారు. అలా బెనగల్ అవకాశం కల్పించిన వారిలో ప్రధానంగా నసీరుద్దీన్ షా, ఓం పురి, స్మితా పాటిల్, షబానా అజ్మీ, కులభూషన్ ఖర్బండా, అమ్రిష్ పురి వంటి గొప్ప నటులు ఈ జాబితాలో ఉన్నారు. అంకుర్ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైన షబానా జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు.
12ఏళ్లకే తొలి చిత్రం..
శ్యామ్ బెనగల్‌కు చిన్నప్పటి నుంచి చిత్రాలపై మక్కువ ఎక్కువే. ఈ క్రమంలోనే పుట్టిన రోజు తన తండ్రి బహుమతిగా ఇచ్చిన కెమెరాతో 12ఏళ్ల వయసులోనే బెనల్ తన మొదటి చిత్రాన్ని రూపొందించారు. సామాజిక సమస్యలు, ఆర్థిక అసమానతలపైనే బెనగల్ ఎక్కువ సినిమాలు రూపొందించారు.
1974 లో అంకుర్ సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన బెనగల్.. 2023 వరకూ సినీ రంగానికి తన సేవలను అందించారు. 2023లో చివరగా ‘ముజిబ్: ది మేకింగ్ ఆఫ్ ఏ నేషన్’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 15న ప్రేక్షకు ల ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో ఫిల్మ్ సొసైటీని స్థాపించిన ఘనత బెనగల్‌కే దక్కుంది.
తెరకెక్కించిన సినిమాల జాబితా ఇదే..
బ్లేజ్ ఫిల్మ్ ఎంటర్‌ప్రైజెస్ నిర్మాణ సంస్థ సహకారంతో 1974లో మొట్టమొదటగా అంకుర్ అనే ఫీచర్ ఫిల్మ్‌ను శ్యామ్ బెనగల్ తెరకెక్కించారు. చరందాస్ చోర్(1975), నిశాంత్(1975), మంథన్(1976), భూమిక (1977), కొండూర(1978), జునూన్ (1979), కలియుగం(1981), ఆరోహన్(1982), మండి(1983), త్రికాల్(1985), సుస్మాన్(1987), అంతర్నాడ్(1991), సూరజ్ కాసత్వన్ ఘోడా(1993), మమ్మో(1994), సర్దారీ బేగం(1996), ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మ (1996), సమర్(1999), హరిబా జుబేదా (2001), నేతాజీ సుభాష్ చంద్రబోస్: ది ఫర్గాటెన్ హీరో(2005), వెల్‌కమ్ టూ సజ్జన్‌పూర్ (2008), వెల్ డన్ అబ్బా(2010), ముజిబ్: ది మేకింగ్ ఆఫ్ ఏ నేషన్(2023) అనే దాదాపు 24 సినిమాలను శ్యామ్ బెనగల్ రూపొందించారు.
వీటితోపాటు 40కిపైగా డాక్యుమెంటరీలను ఆయన నిర్మించారు. ఘేర్ బేతా గంగా, పూవనమ్, ఫ్లవర్ గార్గెన్, హీరో వంటి షార్ట్ ఫిల్మ్‌లను శ్యామ్ బెనగల్ తీశారు. యాత్ర, కథా సాగర్, భారత్ ఏక్ ఖోజ్, అమరావతికి కథాయే, సంక్రాంతి, సంవిథాన్ వంటి దారావాహికలను బెనగల్ తెరకెక్కించారు.
తొలి సినిమాకే అవార్డు
శ్యామ్ బెనగల్ రూపొందించిన తొలి ఫీచర్ ఫిల్మ్ ‘అంకుర్’కు జాతీయ స్థాయిలో సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు దక్కింది. సినీ రంగంలో ఆయన చేసిన కృషిని ప్రభుత్వం గుర్తించి అవార్డులతో సత్కరించింది. భారత ప్రభుత్వం 1976లో బెనగల్‌ను పద్మశ్రీతో గౌరవించింది. 1976లో నిశాంత్ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్నారు.
1977లో బెనగల్ తీసిన మంథన్ సినిమాకు ఉత్తమ జాతీయ చలనచిత్ర అవార్డు దక్కింది. జునూన్ చిత్రానికి 1980లో ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు పొందారు. 1991లో పద్మభూషణ్, 2005లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకున్నారు. అలాగే 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం పొందారు. జాతీయ స్థాయిలో శ్యామ్ బెనగల్ ఏకంగా ఏడు సార్లు హిందీలో అత్యుత్తమ సినిమా అవార్డులను అందుకున్నారు.
ప్రముఖుల సంతాపం
దిగ్గజ దర్శకులు శ్యామ్ బెనగల్ మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పం దించారు. భారతీయ సినీ చరిత్రలో అద్భుతమైన అధ్యాయం ముగిసిందని సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. ప్రధాని నరేం ద్రమోదీ ఎక్స్ ద్వారా సంతాపం ప్రకటించారు.
బెనగల్ రచన లు ప్రజల్లో చిరస్థాయిగా గుర్తుండిపో తాయని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగాల్ ముఖ్యమం త్రి మమతా బెనర్జీ సహా పలువురు రాజకీ య ప్రముఖులు బెనగల్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.